వాషింగ్టన్: ప్రపంచ టెక్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న పరిణామాల మధ్య ఏఐ దిగ్గజం ‘ఎన్‌విడియా’ సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన సతీమణి లోరీ హువాంగ్‌తో విడాకుల ప్రచారం టెక్ ప్రపంచంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఒకవేళ వీరు అధికారికంగా విడాకులు తీసుకుంటే, ఇప్పటివరకు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ పేరిట ఉన్న అత్యంత ఖరీదైన విడాకుల రికార్డు తలకిందులు కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఆయన మాజీ భార్య మెకెంజీ స్కాల్ట్ మధ్య 2019లో జరిగిన విడాకుల సెటిల్‌మెంట్ సుమారు 35 నుండి 38 బిలియన్ డాలర్లతో ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డుకెక్కింది.
అయితే, కాలిఫోర్నియా చట్టాల ప్రకారం, జెన్సన్ హువాంగ్ నికర సంపద భారీ స్థాయిలో ఉండటంతో.. ఆయన భార్య లోరీ హువాంగ్‌కు లభించే సంపద వాటా ఏకంగా 81 బిలియన్ డాలర్లకు (సుమారు రూ7.58 లక్షల కోట్లకు పైగా) పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే గనుక నిజమైతే, చరిత్రలోనే అత్యధిక భరణం చెల్లించిన రికార్డు జెన్సన్ హువాంగ్ పేరున మారుమోగనుంది.
అసలు వివాదం
ఇటీవల జెన్సన్ హువాంగ్ చైనా ఇంటెలిజెన్స్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మహిళతో తన సంబంధంపై బహిరంగంగా స్పందించడం, తన భార్యకు, కుటుంబానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పడం తెలిసిందే. ఎన్‌విడియా బోర్డు కూడా దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ అనూహ్య పరిణామాలు, వ్యక్తిగత వివాదాల నేపథ్యంలోనే వీరిద్దరి విడాకుల అంశం తెరపైకి వచ్చింది. టెక్ పరిశ్రమను కుదిపేస్తున్న ఈ భారీ విడాకుల సెటిల్‌మెంట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


