జెఫ్ బెజోస్‌కు నెలవారీ అద్దె ఎంత వస్తుందంటే.. | Jeff Bezos Rental to 700M usd Portfolio Ultimate Real Estate Empire | Sakshi
Sakshi News home page

జెఫ్ బెజోస్‌కు నెలవారీ అద్దె ఎంత వస్తుందంటే..

Nov 9 2026 8:35 AM | Updated on Nov 9 2026 8:35 AM

Jeff Bezos Rental to 700M usd Portfolio Ultimate Real Estate Empire

ప్రపంచ ప్రసిద్ధ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వ్యాపార రంగంలోనే కాకుండా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒకప్పుడు అమెరికాలోని సియాటెల్ ప్రాంతంలో కేవలం 890 డాలర్ల నెలవారీ అద్దె ఇంట్లో జీవితాన్ని ప్రారంభించిన బెజోస్ నేడు దాదాపు 700 మిలియన్ డాలర్లకు పైగా విలువైన విలాసవంతమైన ఆస్తుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నారు. ఆయన ఈ అసాధారణ ప్రయాణం వ్యాపార ప్రపంచంలోనే ఆసక్తికర చర్చగా మారింది.

విస్తరించిన సామ్రాజ్యం

జెఫ్ బెజోస్ కేవలం ఒకే చోట స్థిరపడకుండా అమెరికాలోని అత్యంత ఖరీదైన, విశిష్టమైన ప్రాంతాల్లో విలాసవంతమైన భవనాలు, ఎస్టేట్లు, అపార్ట్‌మెంట్లు, భారీ భూములను కొనుగోలు చేశారు. 1994లో అమెజాన్‌ను ప్రారంభించిన సమయంలో సియాటెల్ సమీపంలో అద్దె ఇంటిలో ఉన్న ఆయన ఆ తర్వాత అదే ప్రాంతంలోని మెదినాలో కోట్లు వెచ్చించి భారీ వాటర్‌ఫ్రంట్ ఎస్టేట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఆనుకుని ఉన్న మరో భవనాన్ని కూడా కొనుగోలు చేసి సుమారు 5.3 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని తీర్చిదిద్దారు.

బిలియనీర్స్‌ బంకర్‌లో..

ఇటీవల కాలంలో బెజోస్ ఫ్లోరిడాలోని మయామి సమీపంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఇండియన్ క్రీక్ ఐలాండ్’పై దృష్టి సారించారు. దీనినే ‘బిలియనీర్స్ బంకర్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ వరుసగా మూడు లగ్జరీ వాటర్‌ఫ్రంట్ భవనాలను సుమారు 234 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా తన రియల్‌ ఎస్టేట్‌ పోర్ట్‌ఫోలియోను మరింత పెంచుకున్నారు. ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఉండటంతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఇక్కడ నివసిస్తున్నారు.

చలనచిత్ర నగరంలో..

కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్‌లో హాలీవుడ్ చారిత్రాత్మక నేపథ్యం ఉన్న జాక్ వార్నర్ ఎస్టేట్‌ను 2020లో రికార్డు స్థాయిలో 165 మిలియన్ డాలర్లకు బెజోస్ సొంతం చేసుకున్నారు. సుమారు 9 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ భవనంలో అన్ని ఆధునిక సదుపాయాలతో పాటు పికిల్‌బాల్ కోర్టులు, బీచ్ వాలీబాల్ కోర్టులను కూడా ఏర్పాటు చేసుకున్నారు.

ఇవే కాకుండా వాషింగ్టన్‌లో మాజీ టెక్స్టైల్ మ్యూజియంను భారీ నివాసంగా మార్చడం, న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ పార్క్ సమీపంలో భారీ అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేయడం, టెక్సాస్‌లో ఏకంగా 4 లక్షలకు పైగా ఎకరాల వ్యవసాయ భూమిని కలిగి ఉండటం ఆయన రియల్ ఎస్టేట్ వ్యూహానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాధారణ అద్దె ఇంటి నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు అమెరికాలోని అత్యున్నత రియల్ ఎస్టేట్ ఆస్తుల యజమానుల్లో ఒకరిగా జెఫ్ బెజోస్‌ను నిలబెట్టింది.

ఇదీ చదవండి: మాదేశం వచ్చినవారికి గుడ్‌న్యూస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement