హోమ్‌లోన్ లేకుండానే రూ.70 లక్షల ఇల్లు.. | Maharashtra woman buys Rs 70 lakh house without home loan shares savings strategy | Sakshi
Sakshi News home page

హోమ్‌లోన్ లేకుండానే రూ.70 లక్షల ఇల్లు.. ‘ప్లాన్‌’గా కొనేసిన మిడిల్‌ క్లాస్‌ మహిళ!

Nov 8 2026 10:10 PM | Updated on Nov 8 2026 10:10 PM

Maharashtra woman buys Rs 70 lakh house without home loan shares savings strategy

సొంతిల్లు అనేది ప్రతి మధ్య తరగతి వ్యక్తికీ జీవితకాల కల. అది అందరికీ అంత సులువు కాదు. ఇల్లు కొనాలంటే భారీగా డౌన్‌పేమెంట్‌ చెల్లించాలి.. మిగిలిన మొత్తానికి హోమ్‌లోన్‌ తీసుకోవాలి. ఆ తర్వాత నెలల తరబడి ఈఎంఐలు కట్టాలి. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించింది. క్రమశిక్షణతో కూడిన పొదుపు, అదనపు ఆదాయంతో ఎలాంటి హోమ్‌ లోన్‌ తీసుకోకుండానే సుమారు రూ.70 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేసి, తనకు నచ్చినట్లు అలంకరించుకుంది. ప్రస్తుతం ఈమె ఇంటి కొనుగోలు ప్రయాణం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మూడేళ్లలో రూ.19 లక్షల పొదుపు

మహారాష్ట్రలోని షహాద్‌కు చెందిన ఈ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రకారం.. ఆమె కొనుగోలు చేసిన ఫ్లాట్‌ విలువ రూ.60 లక్షలు. ఇంటీరియర్ పనులతో కలిపి మొత్తం ఖర్చు దాదాపు రూ.70 లక్షలకు చేరింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మూడేళ్ల పాటు ప్రణాళికాబద్ధంగా డబ్బు ఆదా చేసింది. మొదటి ఏడాది రూ.4 లక్షలు, రెండో ఏడాది రూ.5.5 లక్షలు, మూడో ఏడాది రూ.9.5 లక్షలు.. ఇలా మొత్తం రూ.19 లక్షలు పొదుపు చేసింది. వీటితో పాటు రూ.లక్ష అత్యవసర నిధిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది.

రెండు బ్యాంకు ఖాతాల వ్యూహం

పొదుపు కోసం ఆమె అనుసరించిన విధానం ఆసక్తికరంగా ఉంది. తన లాగే ప్రతి ఒక్కరూ రెండు బ్యాంకు ఖాతాలు తెరవాలని సూచించింది. ఒకటి జీతం జమయ్యే ఖాతా కాగా, మరొకటి కలల ఇంటి కోసం కేటాయించిన ప్రత్యేక ఖాతా. జీతం అందిన వెంటనే అందులో ఎక్కువ మొత్తాన్ని రెండో ఖాతాకు బదిలీ చేసేది. అనవసర ఖర్చుల కోసం ఆ డబ్బును విత్‌డ్రా చేయకుండా డెబిట్, క్రెడిట్ కార్డులకు దూరంగా ఉంచింది.

బిల్డర్‌తో ఒప్పందమే కీలకం

మొదట మిగిలిన మొత్తానికి గృహ రుణం తీసుకోవాలని భావించినప్పటికీ, తండ్రితో చర్చించిన తర్వాత మరో మార్గాన్ని ఎంచుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ కావడంతో బిల్డర్‌తో నేరుగా వాయిదాల పద్ధతిలో చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. నెలకు రూ.లక్ష చొప్పున 36 నెలల పాటు చెల్లించి, మిగిలిన రూ.8 లక్షలను ఇంటి స్వాధీన సమయంలో చెల్లించేలా మాట్లాడుకుంది.

అమ్మకాల ఉద్యోగం.. అదనపు ఆదాయం

ఆమె లక్ష్యాన్ని చేరుకోవడంలో అమ్మకాల విభాగంలో చేస్తున్న ఉద్యోగం కూడా కీలకమైంది. జీతానికి అదనంగా నెలకు సగటున రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ప్రోత్సాహకాలు పొందేది. వాటిని కూడా తన ఇంటి కొనుగోలు లక్ష్యానికి ఉపయోగించుకుంది. అంతేకాదు, కుటుంబానికి గతంలో ఉన్న ఇంటిని విక్రయించకుండా పునరుద్ధరించి అద్దెకు ఇచ్చినట్లు వెల్లడించింది.

తన అనుభవాన్ని పంచుకుంటూ.. ఇంటి కొనుగోలు విషయంలో భయపడకుండా, సరైన వ్యూహంతో ప్రణాళిక వేసుకుని ముందడుగు వేయాలని ఆమె సూచించింది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణతో పాటు అదనపు ఆదాయ మార్గాలను ఉపయోగించుకోవడం స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement