బంగారం, వెండి ధరలు గత వారం భారీగా కోలుకున్నప్పటికీ.. రానున్న రోజుల్లో మళ్లీ ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) అధికారుల వ్యాఖ్యలు, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరల దిశను నిర్ణయించనున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో భారీ రికవరీ
గత వారం కామెక్స్‌లో డిసెంబర్ డెలివరీ బంగారం ఫ్యూచర్స్ ఔన్స్‌కు 176 డాలర్లు (4.5 శాతం) పెరిగి 4,074.90 డాలర్ల వద్ద ముగిశాయి. వెండి ధర కూడా 2.60 డాలర్లు (5.4 శాతం) ఎగబాకి 51.94 డాలర్లకు చేరింది. దేశీయంగా ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.3,682 (దాదాపు 3 శాతం) పెరిగి రూ.1.42 లక్షల వద్ద స్థిరపడ్డాయి. కిలో వెండి ధర రూ.5,655 (3.15 శాతం) పెరిగి రూ.1.84 లక్షలకు చేరింది. అయితే, శుక్రవారం అమెరికా ఉపాధి గణాంకాలు అంచనాలను మించడంతో డాలర్, బాండ్ ఈల్డ్స్ బలపడి బంగారం, వెండి ధరల పెరుగుదలకు కొంత అడ్డుకట్ట పడింది.
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి
నవంబర్ 10న అమెరికా అక్టోబర్ నెల వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) గణాంకాలు విడుదల కానున్నాయి. అదే విధంగా నవంబర్ 12న భారత్ అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. చైనా, జర్మనీ, జపాన్ దేశాల ద్రవ్యోల్బణ వివరాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగితే ఫెడ్ వడ్డీ రేట్లను అధిక స్థాయిలో కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇది వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం, వెండి వంటి పెట్టుబడులపై ఒత్తిడి పెంచుతుంది. మరోవైపు డాలర్ బలపడినా బంగారం, వెండి కొనుగోళ్లు ఖరీదుగా మారతాయి.
ఇరాన్ ఉద్రిక్తతలు.. చమురు ధరల ప్రభావం
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కూడా కీలకంగా మారాయి. ఇరాన్‌లోని కష్మ్ ద్వీపంపై అమెరికా దాడులు జరిగినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించడంతో భౌగోళిక రాజకీయ పరిణామాలపై అనిశ్చితి కొనసాగుతోంది. అయితే, ఇరు దేశాల మధ్య చర్చల్లో పురోగతి సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు, ముడి చమురు ధరల కదలికలను కూడా ఇన్వెస్టర్లు గమనించనున్నారు.
జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్ అధికారుల వ్యాఖ్యలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు బులియన్ మార్కెట్‌కు కీలకం కానున్నాయి.
ఇదీ చదవండి: వచ్చే జనవరి 1 నుంచి చెక్కులు చెల్లవా? ఆర్బీఐ క్లారిటీ
గత వారం వచ్చిన రికవరీతో బంగారం, వెండి మళ్లీ పెరుగుదల బాట పట్టాయని భావించడానికి వీల్లేదని నిపుణుల అంచనా. అమెరికా ఉపాధి, ద్రవ్యోల్బణ గణాంకాలు వడ్డీ రేట్లపై అంచనాలను మార్చే అవకాశం ఉంది. దీంతో డాలర్, బాండ్ ఈల్డ్స్‌లో వచ్చే మార్పులు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చు. అందువల్ల వచ్చే వారం బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి..
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


