కెనడా సరికొత్త వలస బాట
2027 నాటికి 6.22 లక్షల మందికి పీఆర్ అవకాశం
అంతర్జాతీయ వలసదారులకు గమ్యస్థానంగా ఉన్న కెనడా తన ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు చేపట్టింది. కెనడా ఫెడరల్ బడ్జెట్, సరికొత్త ఇమ్మిగ్రేషన్ లెవెల్స్ ప్లాన్ ప్రకారం, దేశ జనాభా వృద్ధిని స్థిరీకరించడం, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం, ఇప్పటికే దేశంలో నివసిస్తున్న తాత్కాలిక నివాసితులకు పెద్దపీట వేయడమే లక్ష్యంగా కెనడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. తాజా ప్రణాళిక కింద 2027 నాటికి వివిధ విభాగాల ద్వారా దాదాపు 6,22,000 మందికి పైగా కొత్తగా శాశ్వత నివాసితులుగా (పర్మనెంట్ రెసిడెన్సీ-పీఆర్) అవకాశం కల్పించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
నివాస విభాగాల వారీగా కేటాయింపులు
ఫెడరల్ ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం, 2027 సంవత్సరానికి సంబంధించి పర్మనెంట్ రెసిడెన్సీ లక్ష్యాలను వ్యూహాత్మకంగా విభజించారు.
దేశ ఆర్థిక, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యధికంగా 2,44,700 మందికి స్థానం కల్పించారు. ఇందులో నైపుణ్యం కలిగిన నిపుణులు, ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ, ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్‌ల (పీఎన్‌పీ) అభ్యర్థులకు ప్రాధాన్యత దక్కనుంది.
కుటుంబాల మధ్య అనుబంధాన్ని, బంధువుల కలయికను ప్రోత్సహిస్తూ సుమారు 81,000 మందికి అవకాశం కల్పిస్తున్నారు.
అంతర్జాతీయ బాధ్యతల్లో భాగంగా శరణార్థులు, రక్షణ పొందిన వ్యక్తుల కోటా కింద 49,300 మందిని, అలాగే మానవతా దృక్పథం ఆధారంగా మరో 5,000 మందిని శాశ్వత నివాసితులుగా అంగీకరించనున్నారు.
ఇది కాకుండా, 2027–2029 కాలానికి సంబంధించి ఏటా స్థిరంగా 3,80,000 మందికి కొత్త శాశ్వత నివాస లక్ష్యాలను నిర్దేశించినట్లు కెనడా ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాత్కాలిక నివాసితులకు అవకాశం
కెనడా తాజా బడ్జెట్, వలస ప్రణాళికలో అత్యంత ప్రధానమైన అంశం.. ఇప్పటికే కెనడాలో తాత్కాలిక నివాసితులుగా ఉంటున్న వారికి ఊరటనివ్వడం. దేశంలో ఇప్పటికే నివసిస్తున్న సుమారు రెండు లక్షల మంది తాత్కాలిక నివాసితులు 2027 చివరి నాటికి శాశ్వత నివాస హోదా (పీఆర్) పొందేందుకు ఒక ప్రత్యేక వన్ టైమ్ మార్గాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో దాదాపు ఒక లక్ష మంది ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ లేదా పీఎన్‌పీ కింద అర్హత సాధించిన వారికి అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. దీనివల్ల కొత్తగా విదేశాల నుంచి వచ్చే వారిపై భారం తగ్గడంతో పాటు స్థానికంగా ఉన్న నైపుణ్య వలసదారులకు మేలు జరుగుతుంది.
ఇదీ చదవండి: ఇవి కొంటే మీ బ్యాడ్‌లక్!


