రైలు ప్రయాణం చేసేవారికి శుభవార్త. ఎందుకంటే.. 2027 జనవరి నుంచి టికెట్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ రేట్లు ఎందుకు తగ్గనున్నాయి?, ఎంత తగ్గనున్నాయి?, అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
2027 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా 40కి పైగా రైళ్లకు సూపర్‌ఫాస్ట్ హోదా తొలగించి, వాటిని సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా నడపనున్నట్లు తెలుస్తోంది. జాబితాలో.. మహానగరి, ప్రగతి, తులసి, సప్త క్రాంతి వంటి ప్రముఖ రైళ్లు కూడా ఉన్నాయి. ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు టికెట్ ధరలు తగ్గే అవకాశం ఉంది. కొన్ని రైళ్ల నంబర్లు కూడా మారనున్నట్లు సమాచారం.
సూపర్‌ఫాస్ట్ హోదా ఇవ్వాలంటే
సాధారణంగా ఒక రైలుకు సూపర్‌ఫాస్ట్ హోదా ఇవ్వాలంటే.. కొన్ని నిబంధనలు ఉంటాయి. బ్రాడ్‌గేజ్ మార్గంలో రైలు తన పూర్తి ప్రయాణంలో గంటకు సగటున కనీసం 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. రెండు దిశల్లోనూ ఈ ప్రమాణాన్ని అందుకోవాల్సి ఉంటుంది. కానీ.. ఇటీవల రైల్వే శాఖ నిర్వహించిన సమీక్షలో కొన్ని సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఈ వేగాన్ని అందుకోవడం లేదని గుర్తించినట్లు బిజినెస్ టుడే నివేదించింది.
దీనికి ప్రధాన కారణాలు.. రైలుకు మధ్యలో అదనపు స్టాపులు పెరగడం, రైల్వే ట్రాక్‌లపై రద్దీ ఎక్కువగా ఉండటం, కొన్ని ప్రాంతాల్లో సింగిల్ లైన్ మార్గాలు ఉండటం అని తెలుస్తోంది. దీంతో సూపర్‌ఫాస్ట్ ప్రమాణాలను అందుకోలేని రైళ్లకు ఆ హోదాను తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ రైళ్లపై ప్రభావం
ఈ ప్రభావం ఏయే రైళ్లపై పడనుంది అనే విషయానికి వస్తే.. సెంట్రల్ రైల్వే పరిధిలో మొత్తం 18 రైళ్లు ఈ జాబితాలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో.. ముంబై సీఎస్‌ఎంటీ నుంచి పూణే వెళ్లే ప్రగతి ఎక్స్‌ప్రెస్, లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి అయోధ్య కాంట్ వెళ్లే తులసి ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో 20 రైళ్లకు సూపర్‌ఫాస్ట్ హోదా తొలగించే అవకాశం ఉంది. ఇందులో.. సప్త క్రాంతి ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన మరో ఎనిమిది రైళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. తనక్‌పూర్-ఢిల్లీ, డెహ్రాడూన్-కాఠ్‌గోదాం రైళ్లు కూడా ఇందులో ఉన్నాయి. వీటితో పాటు గోవా ఎక్స్‌ప్రెస్ పేరు కూడా ఈ జాబితాలో కనిపిస్తోంది.
తగ్గనున్న టికెట్ ధరలు
ఇక టికెట్ ధరల విషయానికి వస్తే.. సూపర్‌ఫాస్ట్ రైళ్లలో సాధారణ టికెట్ ఛార్జీకి అదనంగా సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్ వసూలు చేస్తారనే విషయం తెలిసిందే. అయితే.. ఒకసారి ఈ హోదా తొలగిస్తే ఆ అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీంతో రెండో తరగతి ప్రయాణికులకు రూ.15, స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించేవారికి రూ.30 వరకు ఆదా అవుతుంది. ఏసీ చైర్ కార్, ఏసీ త్రీ టైర్, ఏసీ టూ టైర్ ప్రయాణికులకు రూ.45, ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు రూ.75 వరకు తగ్గే అవకాశం ఉంది.
ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సూపర్‌ఫాస్ట్ హోదా తొలగించినంత మాత్రాన.. రైలు వేగం పెరుగుతుందని లేదా ప్రయాణ సమయం తగ్గుతుందని అనుకోకూడదు. ఇది కేవలం రైలు వర్గీకరణకు సంబంధించిన మార్పు మాత్రమే.
అయితే.. ఇప్పటికే జనవరి ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్నవారికి పాత సూపర్‌ఫాస్ట్ ఛార్జీ తిరిగి చెల్లిస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి జనవరిలో రైలు ప్రయాణం చేయాలనుకునేవారు టికెట్ బుక్ చేసే ముందు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో రైలు కొత్త నంబర్, టికెట్ ధరలను ఒకసారి పరిశీలించడం ఉత్తమం.
ఇదీ చదవండి: భారత్‌లో పెట్రోల్ రేటు తగ్గుతుందా?


