సాధారణంగా చాలామంది రైళ్లలో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతారు. దీనికి కారణం తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలకు చేరుకోవచ్చు, కుటుంబంతో కలిసి ప్రయాణించవచ్చు. అయితే.. ఫ్యామిలీతో కలిసి ప్రయాణించేటప్పుడు ముఖ్యంగా చిన్న పిల్లల టికెట్ల విషయంలో చాలామందికి సందేహాలు వస్తుంటాయి. ఏ వయసు పిల్లలకు టికెట్ అవసరం లేదు?, ఎవరికి హాఫ్ టికెట్ తీసుకోవాలి?, పిల్లలకు ప్రత్యేక బెర్త్ కావాలంటే ఏం చేయాలి?, అనే విషయాలు ముందుగానే తెలుసుకుంటే ప్రయాణ సమయంలో ఇబ్బందులు ఎదురుకావు.
రైల్వే నిబంధనల ప్రకారం.. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ప్రత్యేక బెర్త్ తీసుకోకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. అంటే.. తల్లిదండ్రులు తమతో పాటు చిన్న పిల్లలను తీసుకెళ్లినప్పుడు వారి కోసం ప్రత్యేక టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే.. పిల్లలకు ప్రత్యేకంగా బెర్త్ కేటాయించరు. తల్లిదండ్రులతో పాటు ఒకే బెర్త్‌పై ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవేళ చిన్నారికి ప్రత్యేక బెర్త్ కావాలనుకుంటే మాత్రం సంబంధిత టికెట్ ధర చెల్లించి బుక్ చేసుకోవాలి.
ఇక ఐదు సంవత్సరాలు నిండిన పిల్లల విషయంలో టికెట్ నిబంధనలు కొంత భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రత్యేక బెర్త్ అవసరమా?, లేదా? అనే విషయాన్ని బట్టి టికెట్ బుకింగ్‌లో తేడా ఉంటుంది. ఈ వయసు పిల్లలకు ప్రత్యేక బెర్త్ కేటాయించరు, బెర్త్ కావాలనుకుంటే టికెట్ ధర చెల్లించి బుక్ చేసుకోవాలి.
పన్నెండు సంవత్సరాలు నిండిన పిల్లలకు సాధారణంగా పెద్దలతో సమానంగా టికెట్ తీసుకోవాలి. కాబట్టి.. రైలు టికెట్ బుక్ చేసుకునే ముందు పిల్లల వయసును సరిగ్గా నమోదు చేయడం చాలా ముఖ్యం. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసేటప్పుడు వయసు వివరాల్లో పొరపాట్లు జరిగితే ప్రయాణ సమయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
అలాగే, పిల్లలతో ప్రయాణించేటప్పుడు వారి వయసును ధ్రువీకరించడానికి అవసరమైన పత్రాలను వెంట ఉంచుకోవడం మంచిది. ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించే సమయంలో పిల్లలకు ప్రత్యేక బెర్త్ బుక్ చేసుకుంటే వారు సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవడానికి వీలుంటుంది.
ఇదీ చదవండి: మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు?.. ఈసారి ఏంటంటే!


