డిజిటల్ బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ‘ప్రివెంటివ్ సేఫ్‌గార్డ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్’ ముసాయిదా సవరణలను విడుదల చేసింది. ఏప్రిల్ 9, 2026 చర్చాపత్రంపై వచ్చిన అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన ఈ ప్రతిపాదనలపై డిసెంబర్ 14, 2026 వరకు అభిప్రాయాలు స్వీకరిస్తారు.
ట్రస్టెడ్ పర్సన్ మెకానిజం
నిర్దిష్ట పరిమితికి మించిన నగదు బదిలీలకు ఖాతాదారుడు ఎంపిక చేసుకున్న విశ్వసనీయ వ్యక్తి ఆమోదాన్ని అదనపు ధ్రువీకరణగా పొందే స్వచ్ఛంద విధానమిది. ఇందుకు ఇరువర్గాల సమ్మతి అవసరం. నమోదయ్యే వ్యక్తి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. బ్యాంకు ధ్రువీకరించే గుర్తింపు పత్రంతో పాటు ఖాతాకు అనుసంధానమైన నంబర్‌కు భిన్నమైన మొబైల్ నంబర్ కలిగి ఉండాలి. పరిమితి మించిన బదిలీ వివరాలు అందిన గంటలోపు ఆమోదించాలి లేదా తిరస్కరించాలి; స్పందించకపోయినా లావాదేవీ నిలిచిపోతుంది. ఈ వ్యక్తికి ఖాతా యాజమాన్యం, నిల్వలు, డిపాజిట్లు, పెట్టుబడులు లేదా బీమా వివరాలు చూసే హక్కు ఉండదు. బ్యాంకు ఖాతా అనుసంధాన యూపీఐ చెల్లింపులు, మర్చంట్ చెల్లింపులు, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్లు, ఈ-మాండేట్లు, ఎన్‌ఏసీహెచ్ పునరావృత చెల్లింపులకు ఇది వర్తించదు.
లావాదేవీల నియంత్రణ
ఖాతా హ్యాక్ లేదా అనుమానాస్పద పరిస్థితుల్లో భవిష్యత్తు కస్టమర్-ఇనిషియేటెడ్ డెబిట్ లావాదేవీలు, కొత్త పేమెంట్ మాండేట్లు, కొత్త స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్లు, కొత్త థర్డ్-పార్టీ యూపీఐ నమోదులను తక్షణమే ఆపేందుకు ‘స్టాప్ స్విచ్’ ప్రతిపాదించారు. అయితే కొనసాగుతున్న రికరింగ్ మాండేట్లు, రుణ వాయిదాలు, బ్యాంకు ఛార్జీలు, జమ లావాదేవీలు యథావిధిగా సాగుతాయి. లావాదేవీ, లబ్ధిదారుడు, రోజువారీ, మొత్తం డిజిటల్ చెల్లింపులపై పరిమితులు విధించుకునే సౌకర్యం, కార్డుల దేశీయ/అంతర్జాతీయ, ఏటీఎం, పీఓఎస్, ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ నియంత్రణలు, కొత్త ఖాతాల్లో డిజిటల్ మార్గాలను డిఫాల్ట్‌గా నిలిపివేసి అనుమతితోనే ప్రారంభించే అంశాలూ ఇందులో ఉన్నాయి.
అమలు గడువు
వాణిజ్య బ్యాంకుల ముసాయిదా ప్రకారం ప్రధాన నిబంధనలు 2027 జులై 1 నుంచి లేదా అంతకుముందు బ్యాంకు నిర్ణయించే తేదీ నుంచి అమల్లోకి రావచ్చు. బ్యాంకుల నిర్లక్ష్యానికి సంబంధించిన కొన్ని నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమలులోకి రావాలని ప్రతిపాదించారు. ఇవి ఇంకా ముసాయిదా దశలోనే ఉన్నాయి.
ఇదీ చదవండి: సారొచ్చారు.. బంగారాన్ని పెంచారు!


