డిసెంబర్‌ 3న దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు సంఘాలు పిలుపు | IDBI Bank Strike on December 3 Nationwide Bank Shutdown Alert | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 3న దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు సంఘాలు పిలుపు

Nov 24 2026 4:47 PM | Updated on Nov 24 2026 4:47 PM

IDBI Bank Strike on December 3 Nationwide Bank Shutdown Alert

ఐడీబీఐ వాటాల విక్రయానికి వ్యతిరేకంగా..

ఐడీబీఐ బ్యాంకు వాటాల విక్రయానికి, యాజమాన్య నియంత్రణను విదేశీ సంస్థకు బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఆందోళనను ఉధృతం చేశాయి. ఇందులో భాగంగా డిసెంబర్‌ 3న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగులు, అధికారులకు సంఘీభావంగా అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం, అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం, బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సమ్మెలో పాల్గొనాలని తమ సభ్యులను కోరాయి.

రూ.52,878 కోట్ల విలువైన వాటాల విక్రయం

ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో అక్టోబర్‌ 14న విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం, ఎల్‌ఐసీకి చెందిన 30.24 శాతం కలిపి మొత్తం 60.72 శాతం వాటాను విక్రయించేందుకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ అనుబంధ సంస్థ అయిన కెనడా ఇంక్‌ రూ.52,878.08 కోట్లకు (షేరుకు రూ.81 చొప్పున) బిడ్‌ దాఖలు చేసి వ్యూహాత్మక కొనుగోలుదారుగా ఎంపికైంది. లావాదేవీ పూర్తయ్యాక కేంద్రం వద్ద 15 శాతం, ఎల్‌ఐసీ వద్ద 19 శాతం వాటాలు మిగులుతాయి. అయితే, ఆర్‌బీఐ నిర్వహించే పరిశీలన, నియంత్రణ అనుమతుల తర్వాతే యాజమాన్య బదిలీ పూర్తికానుంది.

సంఘాల అభ్యంతరాలు

లాభాల్లో ఉన్న బ్యాంకును విదేశీ ప్రైవేటు సంస్థకు అప్పగించడం దేశ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని, ఇది భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు దారితీస్తుందని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సమ్మె సన్నాహాల్లో భాగంగా నవంబర్‌ 25న దేశవ్యాప్త నిరసనలు, 27న బ్యాడ్జీల ధారణ, 28న సోషల్‌ మీడియా ప్రచారం, 30న కేంద్ర ఆర్థిక మంత్రికి సామూహిక వినతిపత్రం సమర్పించనున్నట్లు ఏఐబీఈఏ వెల్లడించింది. సమ్మె నోటీసును ఇప్పటికే ఐబీఏ, ఆర్థిక సేవల విభాగానికి (డీఎఫ్‌ఎస్‌) అందించాయి.

బ్యాంకింగ్‌ సేవలపై ప్రభావం

డిసెంబర్‌ 3న సమ్మె జరిగితే పాల్గొనే బ్యాంకుల శాఖల్లో నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్‌ వంటి ప్రత్యక్ష సేవలకు అంతరాయం కలగొచ్చు. అయితే, ఉద్యోగుల భాగస్వామ్యం, బ్యాంకుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సేవల ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఏటీఎంలు, యూపీఐ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వంటి డిజిటల్‌ సేవలు యథావిధిగా కొనసాగే అవకాశముంది.

ఇదీ చదవండి: సారొచ్చారు.. బంగారాన్ని పెంచారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement