సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రిని చంపించేందుకే ముందుగా ఆయన భద్రతను తొలగించారని, ఆయన హత్యకు ఉద్దేశపూర్వకంగానే అనుకూలమైన వాతావరణం సృష్టించారని ఆయన అన్నారు.
తల్లి సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్’ పుస్తకంపై చర్చ సందర్భంగా రాహుల్, ప్రియాంక గాంధీలు ఆమెతో కలిసి ఓ వీడియోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చివరి పర్యటన జ్ఞాపకాలను పంచుకున్నారు.
నాన్న భద్రతపై ముందే హెచ్చరించా
రాజీవ్ గాంధీ బిహార్‌లో పర్యటించిన సమయంలో రాహుల్ కూడా ఆయనతో ఉన్నారు. ఆ పర్యటనలో రాజీవ్‌పై రాళ్లు రువ్వారని సోనియా గాంధీ గుర్తుచేశారు. సరైన భద్రత లేకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పర్యటించడం చాలా ప్రమాదకరమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ఆ పర్యటన ముగిసిన తర్వాత రాహుల్ తనతో మాట్లాడుతూ.. “నాన్న భద్రత విషయంలో ఏదైనా చేయకపోతే, త్వరలోనే ఆయన అంత్యక్రియలకు రావాల్సి వస్తుందని నాకు తెలుసు” అని చెప్పినట్లు సోనియా వెల్లడించారు.
“నాన్న భద్రత తొలగించడం ప్రమాదవశాత్తు కాదు. ఆయనను చంపించేందుకే అలా చేశారు” అని రాహుల్ ఆరోపించారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత అమ్మ తన తండ్రి రాజీవ్ భద్రత విషయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యారని ప్రియాంక గాంధీ తెలిపారు. అప్పుడు తన తల్లి సోనియా గాంధీ ఇంటి చుట్టూ ఉన్న ముళ్ల కంచెలను పరిశీలించడం, భద్రతా సిబ్బంది నిద్రపోతున్నారా లేదా అని తనిఖీ చేయడం చేసేవారని ప్రియాంక గుర్తుచేశారు.
అయితే 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజీవ్ గాంధీ బాంబు పేలుడులో మరణించారు. ఆయన వయసు అప్పటికి 46 సంవత్సరాలు.
ఇదీ చదవండి: జెన్సన్ హువాంగ్ అమెరికా ‘జాతీయ సంపద’ : ట్రంప్


