గతంలో పోలిస్తే 80 సీట్లు తక్కువ కోరిన కాంగ్రెస్
ఎస్పీతో ముగిసిన సీట్ల సర్దుబాటు తొలిదఫా చర్చలు
నేడు మరోసారి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీకి సిద్ధమని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ కాస్తంత వెనక్కి తగ్గింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎక్కువ స్థానాలు కేటాయించాలని మిత్రపక్షం సమాజ్‌వాదీ పార్టీ సూచనప్రాయంగా తెలిపిన కాంగ్రెస్ పార్టీ సోమవారం ఢిల్లీలోచర్చల్లో మాత్రం కాస్తంత వెనక్కి తగ్గింది. 181 స్థానాల్లో పోటీచేయాలని ఇటీవల భావించినా సోమవారం మాత్రం 80 స్థానాల్లో పోటీచేయబోమని, సీట్ల సర్దుబాటులో భాగంగా తమకు 100 నుంచి 120 సీట్లు కేటాయిస్తే చాలు అని కాంగ్రెస్ పార్టీ ఎస్పీకి తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రతి జిల్లా నుంచి పోటీచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఈ మేరకు కాంగ్రెస్ తాము పోటీచేయదలచిన నియోజకవర్గాలు, నేతల జాబితాను ఎస్పీకి అందజేసింది. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, ఎస్పీల మధ్య సీట్ల పంపకాలపై అధికారిక చర్చలు సోమవారం ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రమోద్ తివారీ నివాసంలో ప్రతినిధుల బృందం తొలి విడత చర్చలు జరిపింది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌లాల్ పాల్, రాజీవ్ రాయ్, ఇక్రా చౌధరి భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇన్‌ఛార్జి రాజేంద్ర గౌతమ్, రాష్ట్ర అధ్యక్షురాలు ఆరాధన, ఇమ్రాన్ మసూద్ పాల్గొన్నారు.
15 నిమిషాల్లో ముగిసిన చర్చలు
ఇరు పారీ్టలకు చెందిన సభ్యులు సమావేశమై ప్రాథమిక చర్చలు జరిపాయి. ఈ సమావేశం సానుకూల వాతావరణంలో, స్నేహపూర్వకంగా సాగిందని ఇరు పార్టీల నేతలు వెల్లడించారు. మరో రెండు మూడు రోజుల్లో సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. కేవలం 15 నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించినట్లు తెలుస్తోంది. తమ రెండు పారీ్టల్లో ఎవరు పోటీచేయాలనే దానికంటే గెలిచే అవకాశాలు అత్యధికంగా ఉన్న అభ్యర్థుల పేర్లపై చర్చ జరిగినట్లు సమాచారం. మంగళవారం మరోమారు చర్చలు జరగనున్నాయి.
గత ఫలితాలు, బలాబలాల ఆధారంగా..
ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంలో కేవలం సీట్ల సంఖ్యకే ప్రాధాన్యం ఇవ్వకుండా, ఆయా నియోజకవర్గాల్లో పారీ్టల బలం, గత ఎన్నికల ఫలితాలు, అభ్యర్థుల విజయావకాశాలను పరిగణనలోకి తీసుకుని పరస్పర అంగీకారంతో సర్దుబాటు చేసుకోవాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. 2027 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఓట్లు చీలకుండా చూడటమే ఈ పొత్తులో ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే.


