సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి అధికార పీఠం తమదేనని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌కు కనీసం 90 సీట్లు ఖాయమని, తన అంచనా ప్రకారం 100 స్థానాల్లో విజయం సాధిస్తామని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రెండు స్థానాలను కైవసం చేసుకుంటామని, అలాగే ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కీలకంగా మారతాయని వారు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కేంద్రం తీరుపై కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం 12 ఏళ్లలో తెలంగాణకు ఏం చేసిందో గుండె మీద చేయి వేసుకుని చెప్పాలని సవాల్ విసిరారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కోసం 96 శాతం భూసేకరణ పూర్తయినా కేంద్ర క్యాబినెట్ ఆమోదం ఇవ్వడం లేదని, టెండర్లను మూడుసార్లు వాయిదా వేసిందని ఆరోపించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలతో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.12 వేల కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం వచ్చినా కేంద్రం ఎందుకు పెండింగ్‌లో పెట్టిందని ప్రశ్నించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసిందని, తాము అన్ని అనుమతులు సిద్ధం చేసినా బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు ఏం చేశారని అమిత్ షా, నితిన్ నబిన్, జేపీ నడ్డా రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించంతోపాటుగా, రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ తక్షణమే ఆమోదం తెలపాలని ఈ సందర్భంగా కోమటిరెడ్డి కోరారు.
గాంధీ భవన్‌తో అనుబంధం.. : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
గాంధీ భవన్‌తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏడేళ్లపాటు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. తన శాఖలో అద్భుతమైన పనులు జరుగుతున్నాయని, ఒక్కరోజు కాదు.. ఒక్క గంట కూడా విరామం లేకుండా పనిచేస్తున్నానని తెలిపారు.
అయితే, బీఆర్‌ఎస్ పాలనలో మాటలు ఎక్కువ.. పనులు తక్కువగా ఉండేవని, తమ ప్రభుత్వంలో మాటలు తక్కువ.. పనులు ఎక్కువగా ఉంటున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ హామీలన్నీ బోగస్ మాటలేనని విమర్శించారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఎద్దేవా చేస్తూ... తమ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో వేగంగా ముందుకు సాగుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘సర్’ను వ్యతిరేకించే వాళ్లంతా దేశద్రోహులే


