‘ఐ–అలెర్ట్’ టెక్నాలజీతో డీజిల్ దుబారాకు కళ్లెం
నెలకు రూ.2 కోట్ల మేర ఆదా
రూ.5 కోట్ల ఖర్చుతో రూ.36 కోట్లు ఆదా
సెన్సర్లతో డ్రైవింగ్ తీరు ఎప్పటికప్పుడు పరిశీలన
లోపాల గుర్తింపుతో దిద్దుబాటు.. మెరుగైన ప్రయోజనాలు
మరిన్ని బస్సుల్లో ఏర్పాటుకు ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: ‘అంతా బాగానే ఉంది, కొత్తగా చేసేదేముంది’ అన్న నిర్లిప్తత వీడితే ప్రభుత్వ సంస్థల్లోనూ అద్భుతాలు చేయవచ్చని తెలంగాణ ఆర్టీసీ నిరూపిస్తోంది. దశాబ్దన్నర కాలం పాటు వరుస నష్టాలతో కొట్టుమిట్టాడిన సంస్థకు ఇప్పుడు చిన్న సాంకేతిక మార్పు పెద్ద ఊరటనిస్తోంది. డ్రైవర్ల డ్రైవింగ్ తీరును అనుక్షణం పర్యవేక్షించే ‘ఐ–అలెర్ట్’ సెన్సర్ వ్యవస్థతో సంస్థ ఖజానాకు నెలకు రూ.2 కోట్ల చొప్పున ఆదా అవుతోంది. కేవలం 16%బస్సుల్లో ఈ విధానాన్ని అమ లు చేయడంతోనే ఏడాదిలో భారీ దుబారాకు అడ్డుకట్ట పడటం విశే షం. అయితే, ఇదే మార్పును కొన్నేళ్ల కిందటే తీసుకొచ్చి ఉంటే ఆర్టీ సీ నష్టాల పద్దు ఇంతగా పెరిగేది కాదన్న చర్చ ఇప్పుడు మొదలైంది.
తొలుత 1,500 బస్సుల్లో..
తెలంగాణ ఆర్టీసీ నెలకు దాదాపు 1.80 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. ఆర్టీసీ ఆదాయంలో పెద్ద భాగం దీనికే వ్యయమవుతోంది. దీన్ని ఎంత నియంత్రిస్తే సంస్థకు అంత ఆదా అవుతుంది. గత ఏడాదిన్నరగా కీలక పోస్టుల్లోకి వచ్చిన కొత్త అధికారులు ఈ దిశగా దృష్టి సారించారు. ఆర్టీసీకి ఎక్కువగా బస్సులు సరఫరా చేసే అశోక్ లేలాండ్ కంపెనీ ‘ఐ–అలెర్ట్’ పేరుతో ఓ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీన్ని ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేశారు. మొదట 10 బస్సుల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఆ సంస్థ ఉచితంగా సాంకేతికతను అందించింది. ఫలితాలు మెరుగ్గా ఉండటంతో దూరప్రాంతాలకు నడిచే భారత్ స్టేజ్–6 మోడల్‌కు చెందిన 1,500 బస్సుల్లో ఏర్పాటు చేశారు.
‘ఐ–అలెర్ట్’ ఎలా పనిచేస్తుందంటే?
బస్సును డ్రైవర్ ఎలా నడుపుతున్నాడో ‘ఐ–అలెర్ట్’ అనుక్షణం గుర్తిస్తుంది. బ్రేకులు, గేరు, యాక్సిలేటర్.. ఇలా ప్రతి ప్రధాన భాగాన్ని నిర్వహిస్తున్న తీరును సెన్సర్ల ద్వారా పరిశీలిస్తుంది. బస్సు ప్రయాణం ప్రారంభమవటానికి ఎంత ముందు ఇంజిన్ ఆన్ అయింది? తొలుత ఏ గేర్ వాడారు? గేర్లను ఎలాంటి పరిస్థితిలో మారుస్తున్నారు? సడన్ బ్రేకులు ఎన్ని సార్లు వేశారు? యాక్సిలేటర్ వినియోగం ఎలా ఉంది? సిగ్నళ్ల వద్ద, బస్సు ఆగిన ఇతర ప్రాంతాల్లో ఇంజిన్ ఆన్‌లో ఉంటోందా?.. ఆఫ్ చేస్తున్నారా? వేగ పరిమితి ఎలా ఉంది? ఇలా ప్రతి అంశాన్ని ఆ వ్యవస్థ పరిశీలిస్తుంది.
దానికి స్కోర్ కూడా ఇచ్చి ఫైనల్‌గా గ్రేడ్ కేటాయిస్తుంది. దీన్ని మొబైల్ యాప్ ద్వారా అధికారులు వెంటనే పరిశీలించి డ్రైవింగ్ బాగాలేని డ్రైవర్‌కు నిపుణుల ద్వారా సూచనలు చేయించి మెరుగైన గ్రేడ్ వచ్చేలా చూస్తున్నారు. ఇలా ఏడాదిగా 1,500 బస్సుల డ్రైవర్ల నైపుణ్యంలో చాలా మార్పు వచ్చింది. సగటున నెలకు 1.98 లక్షల లీటర్ల డీజిల్‌ను ఆదా చేయగలుగుతున్నారు. నెలకు సగటున రూ.2 కోట్ల మేర మిగులుతోందని ఆర్టీసీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే డీజిల్ ఆదా వల్ల రోజుకు 16.90 మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాల తగ్గుదల నమోదైనట్లు ప్రకటించింది.
రూ.36 కోట్లు ఆదా..
ఈ టెక్నాలజీతో మంచి ఫలితాలు వస్తుండటంతో ఇటీవల మరో 500 బస్సుల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2 వేల బస్సుల్లో ఇది కొనసాగుతోంది. డీలక్స్ బస్సులతోపాటు కొన్ని ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లోనూ అమలు చేశారు. ఆ వ్యవస్థ ఏర్పాటుకు దాదాపు రూ.5 కోట్ల వరకు ఖర్చుకాగా, దీని ద్వారా రూ.36 కోట్ల మేర ఆదా అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పుడు టాటా కంపెనీ బస్సుల్లో కూడా, ఆ కంపెనీ అభివృద్ధి చేసిన ఇదే తరహా వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.


