హైవేలపై తగ్గిన ప్రమాదాలు | Road Accidents on National Highways Decrease: Telangana | Sakshi
Sakshi News home page

హైవేలపై తగ్గిన ప్రమాదాలు

Nov 23 2026 5:13 AM | Updated on Nov 23 2026 5:13 AM

Road Accidents on National Highways Decrease: Telangana

2025లో 14.8% మరణాలు తగ్గుదల

13 నిమిషాల్లోనే   అత్యవసర సాయం

రహదారి భద్రతకు ‘ఏఐ’ తోడు

ఎన్‌హెచ్‌ఏఐ హైదరాబాద్‌  ఆర్‌వో శివశంకర్‌ 

ముగిసిన ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సదస్సు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని జాతీయ రహదా రులపై రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గిందని ఎన్‌హెచ్‌ఏఐ తెలంగాణ ప్రాంతీయ అధికారి శివశంకర్‌ వెల్లడించారు. 2024లో రోడ్డు ప్రమాదాల్లో 1,245 మంది మరణించగా, 2025లో ఆ సంఖ్య 1,061కి తగ్గిందని తెలిపారు. ఏడాదిలో 14.8 శాతం తగ్గుదల నమోదైందన్నారు. రహదా రులపై ప్రమాద ప్రాంతాలను సరిదిద్దటం, రోడ్డు భద్రతా చర్యలే ఇందుకు కారణమని చెప్పారు. రోడ్డు ప్రమా ద బాధితులకు సాయం అందించడంలోనూ తెలంగాణ ముందుందని వివరించారు.

ఎన్‌హెచ్‌ ఏఐ కేర్‌ అత్యవసర సేవల ద్వారా ప్రమాదం జరిగిన 13 నిమిషాల్లోనే సిబ్బంది అక్కడికి చేరుకుని సాయం చేస్తున్నారని తెలిపారు. 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ వార్షిక సదస్సులో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరాలు వెల్లడించారు. రహదారుల విస్తరణ, ఏఐ వినియోగం, పర్యావరణ పరిరక్షణ, రహదారి భద్రతకు సంబంధించిన అంశాలను వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
‘వరంగల్‌–ఖమ్మం ఎన్‌హెచ్‌–163జీ మార్గంలో కాలువల మళ్లింపు, చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెంపు పనులు చేపట్టాం. ఎన్‌హెచ్‌–363పై వన్యప్రాణులు రహదారిని సురక్షితంగా దాటేందుకు ప్రత్యేక క్రాసింగ్‌లను ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌–మన్నెగూడ రహదారి విస్తరణలో చెట్లను సాధ్యమైనంత వరకు యథాతథంగా ఉంచాం. అవసరమైన చోట శాస్త్రీయ పద్ధతుల్లో మరోచోటికి తరలించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చాం. ఎన్‌హెచ్‌ఏఐ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం చొరవతో ఏటవాలు అమరికలో నిర్మాణాలు చేపట్టే విధానాన్ని జాతీయ విధానంగా స్వీకరించడం గొప్ప విషయం. ఈ విధానం వల్ల భూమి వినియోగం సమర్థంగా ఉంటుంది’ అని శివశంకర్‌ తెలిపారు.

రోడ్ల నిర్మాణంలో ఏఐ వినియోగం
‘ఎన్‌హెచ్‌–167పై ఏఐ ఆధారిత మెషీన్‌ కంట్రోల్‌ పైలట్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. డిజిటల్‌ హైవే మానిటరింగ్‌ వ్యవస్థలు, కేంద్రీకృత నియంత్రణ, అధునాతన ట్రాఫిక్‌ నిర్వహణ ద్వారా రహదారుల పర్యవేక్షణ, లైటింగ్, నిఘా, ప్రమాదాలపై తక్షణ స్పందనను మెరుగుపరుస్తున్నాం. హైవేలపై క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత ప్రాజెక్టు సమాచార బోర్డులు, ప్రయాణికులకు అందించే సౌకర్యాల మెరుగుదల వంటి కార్యక్రమాలనూ చేపడుతున్నాం’ అని శివశంకర్‌ వివరించారు.

19 సెషన్లు.. 400 స్టాళ్లు.. 3 వేల ప్రతినిధులు
హైటెక్స్‌ వేదికగా నాలుగు రోజుల పాటు జరిగిన ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ 85వ వార్షిక సదస్సు ఆదివారంతో ముగిసింది. దేశ, విదేశాల నుంచి 3 వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. రహదారి భద్రత, నిర్మాణ సామగ్రి, సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంజినీరింగ్‌లో కొత్త ఆవిష్కరణలు, సాంకేతికత వినియోగం తదితర అంశాలపై 19 సమావేశాలు జరిగాయి. ఆయా రంగాలకు చెందిన నిపుణులు పరిశోధనా పత్రాలను సమర్పించడంతో పాటు, తమ అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న విధానాలను పంచుకున్నారు. వివిధ అంశాలపై 400కి పైగా స్టాళ్లతో కూడిన ఎక్స్‌పోను నిర్వహించారు.

ఐఆర్‌సీ కొత్త అధ్యక్షుడిగా సీబీ ఓజా
సదస్సులో భాగంగా ఆదివారం హైటెక్స్‌లో ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ కౌన్సిల్‌ సమావేశమైంది. వివిధ అంశాలపై యువ ఇంజినీర్లకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య పెంపు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సభ్యులు తీర్మానించారు. రానున్న వార్షిక సమావేశం కోల్‌కతాలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఐఆర్‌సీ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సీబీ ఓజా, ఉపాధ్యక్షులుగా బాఘేల్, రవి శేఖర్, ఆర్తి భార్గవ ఎన్నికయ్యారు. ఏఐ సహా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రహదారుల రంగంలో వినియోగించుకోవాలని కొత్త అధ్యక్షుడు ఓజా పిలుపునిచ్చారు.

కీలక అంశాలపై చర్చలు జరిగాయి: మంత్రి కోమటిరెడ్డి
సదస్సును విజయవంతంగా నిర్వహించటం ఆనందంగా ఉందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రహదారుల మౌలిక సదుపాయాలు, ఇంజినీరింగ్‌ ఆవిష్కరణలు, రోడ్డు భద్రత, సుస్థిర అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చించేందుకు గొప్ప వేదికగా నిలిచిందని చెప్పారు. నూతనంగా ఎన్నికైన ఐఆర్‌సీ కౌన్సిల్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement