26/11 తరహా ఉగ్రదాడులు? | Hyderabad police step up security after email threatens: Telangana | Sakshi
Sakshi News home page

26/11 తరహా ఉగ్రదాడులు?

Nov 23 2026 4:16 AM | Updated on Nov 23 2026 4:16 AM

Hyderabad police step up security after email threatens: Telangana

ఆదివారం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులు

లష్కరే పేరుతో హైదరాబాద్‌ పోలీసులకు బెదిరింపు ఈ–మెయిల్‌ 

టార్గెట్‌లో హోటల్‌ టూరిస్ట్‌ ప్లాజా, కాచిగూడ రైల్వేస్టేషన్‌ 

అప్రమత్తంగా ఉండాలంటూ స్పెషల్‌ బ్రాంచ్‌ హెచ్చరిక 

రద్దీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం 

అనుమానాస్పదాలపై సమాచారమివ్వండి: సీపీ  

సాక్షి, హైదరాబాద్‌: ముంబైలో 2008 నవంబర్‌ 26న జరిగిన ఉగ్రదాడుల తరహా దాడులను హైదరాబాద్‌లోనూ  చేస్తామంటూ వచ్చిన బెదిరింపు మెయిల్‌ కలకలం రేపుతోంది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) పేరుతో ఓ వ్యక్తి పోలీసులకు పంపిన ఈ–మెయిల్‌లో హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడతామని హెచ్చరించినట్లు నగర నిఘా విభాగమైన స్పెషల్‌ బ్రాంచ్‌ అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కాచిగూడలోని హోటల్‌ టూరిస్ట్‌ ప్లాజా, కాచిగూడ రైల్వేస్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుంటామని, కనీసం 300 మందిని హతమారుస్తామని ఆ మెయిల్‌లో ఉండటంతో నగర పోలీసులు అప్రమత్తయ్యారు. మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నగరానికి వస్తుండటంతో మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.  

లతీఫ్‌ భట్‌ను హతమార్చినందుకంటూ... 
నగర స్పెషల్‌ బ్రాంచ్‌కు నేతృత్వం వహించే జాయింట్‌ కమిషనర్‌ శనివారం జారీ చేసిన ఎస్బీ అలర్ట్‌ సందేశంలో కీలక వివరాలను వెల్లడించారు. లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈ–మెయిల్‌లో తమకు ఆ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని పేర్కొన్న గుర్తుతెలియని వ్యక్తి హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడతామని హెచ్చరించినట్లు తెలిపారు.

భారత సైన్యం తమ నాయకుడు లతీఫ్‌ భట్, ఇతర సహచరులను హతమార్చినందుకు ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడతామని ఆ మెయిల్‌లో పేర్కొన్నట్లు వివరించారు. సదరు మెయిల్‌లో పేర్కొన్న రెండు ప్రాంతాల్లో నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది.

బెదిరింపు నేపథ్యంలో హైదరాబాద్‌లోని అన్ని పోలీసుస్టేషన్లు, ఏసీపీలు, జోనల్‌ డీసీపీలతోపాటు ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్‌ విభాగాలను ఎస్బీ అధికారులు అప్రమత్తం చేశారు. హోటల్‌ టూరిస్ట్‌ ప్లాజా, కాచిగూడ రైల్వేస్టేషన్‌లతోపాటు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలు, హోటళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ప్రార్థనా స్థలాలు, ఇతర కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని, నిఘాను బలోపేతం చేయాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్‌ నిర్వహించడంతోపాటు బాంబు నిర్వీర్య బృందాలతో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. బెదిరింపు మెయిల్‌ వెనుక ఉన్న వ్యక్తులు లేదా ముఠాను గుర్తించేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

అనుమానాస్పదాలపై సమాచారమివ్వండి: సీపీ  
బెదిరింపు ఘటన నేపథ్యంలో ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు వ్యాప్తి చేయొద్దని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ ఎం. భగవత్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, ఎవరూ లేని చోట కనిపించే అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు గుర్తిస్తే వాటిని తాకకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అత్యవసర పోలీస్‌ సహాయం కోసం 112 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement