మళ్లీ వాక్‌–ఇన్‌ | Recruiters ditching online hiring as AI use fuels cheating Fears | Sakshi
Sakshi News home page

మళ్లీ వాక్‌–ఇన్‌

Nov 23 2026 4:02 AM | Updated on Nov 23 2026 4:02 AM

Recruiters ditching online hiring as AI use fuels cheating Fears

ఏఐ చీటింగ్‌ ఎఫెక్ట్‌తో మారుతున్న నియామకాల తీరు

మళ్లీ క్యాంపస్, వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూల బాట పట్టిన కంపెనీలు

డీప్‌ఫేక్, ప్రాక్సీ ఇంటర్వ్యూలకు పడనున్న అడ్డుకట్ట

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి తర్వాత ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో పాటు ‘ఆన్‌లైన్‌ హైరింగ్‌’ ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. అభ్యర్థులు ఇంట్లో కూర్చునే పరీక్షలు రాయడం, ఇంటర్వ్యూలకు హాజరవడం సర్వసాధారణమైపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి యూటర్న్‌ తీసుకుంది. ఆన్‌లైన్‌ పరీక్షల్లో ఏఐ సాయంతో జరుగుతున్న మోసాలు పెరిగిపోయాయి. దీంతో భారతీయ కంపెనీలు మళ్లీ పాత పద్ధతిలోనే నేరుగా కాలేజీ క్యాంపస్‌లకు వెళ్లడం లేదా వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించడం మొదలుపెట్టాయి. 

ఏఐతో పెరిగిన స్కామ్‌లు 
కొన్నేళ్లుగా కంపెనీలు మొదటి రౌండ్‌ కోడింగ్‌ టెస్టుల నుంచి ఫైనల్‌ హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూల వరకు ఆన్‌లైన్‌లోనే నిర్వహించేవి. దీనివల్ల సంస్థలతోపాటు అభ్యర్థులకు ప్రయాణ ఖర్చులు, సమయం ఆదా అయ్యేవి. కానీ చాట్‌జీపీటీ, జెమినీ ఏఐలు అందుబాటులోకి వచ్చాక సీన్‌ మారిపోయింది. ఆన్‌లైన్‌ పరీక్షల సమయంలో అభ్యర్థులు సీక్రెట్‌ బ్రౌజర్‌ ట్యాబ్స్, సెకండ్‌ స్క్రీన్, వాయిస్‌ టూల్స్‌ ఉపయోగించి ఏఐ ద్వారా సమాధానాలు కాపీ కొడుతున్నారని రిక్రూటర్లు గుర్తించారు.

కొన్ని సందర్భాల్లో అసలు అభ్యర్థికి బదులుగా వేరొకరు పరీక్ష రాయడం, వీడియో కాల్‌లో డీప్‌ఫేక్‌ టెక్నాలజీ వాడి ముఖం మార్చడం వంటి మోసాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ అసెస్‌మెంట్‌ సంస్థ ‘హైర్‌ప్రో’ విడుదల చేసిన ‘క్యాండిడేట్‌ ఇంటిగ్రిటీ రిపోర్ట్‌–2026’ ప్రకారం ఆన్‌లైన్‌ నియామక పరీక్షల్లో 45 శాతం మేర ఏదో ఒక రకమైన మోసం లేదా అనుమానాస్పద చర్యలు నమోదయ్యాయి. అలాగే గత ఏడాదితో పోలిస్తే రియల్‌–టైమ్‌ ఏఐ ప్రాంప్‌్టల ద్వారా జరిగే చీటింగ్‌ 50 శాతం పెరిగింది. డీప్‌ఫేక్, స్క్రీన్‌ మానిప్యులేషన్‌ కేసులు రెట్టింపై 9 శాతానికి చేరాయి. 

మళ్లీ ఆఫ్‌లైన్‌కు ప్రాధాన్యం 
ఆన్‌లైన్‌ మోసాల ద్వారా ఇంటర్వ్యూలో అద్భుతంగా సమాధానాలు చెప్పి ఉద్యోగంలో చేరిన అభ్యర్థులు.. తర్వాత కనీస కోడింగ్‌ లేదా సమస్యలను పరిష్కరించే సామర్థ్యం లేకపోవడంతో కంపెనీలు తలలు పట్టుకుంటున్నాయి. అందుకే అభ్యర్థి ప్రతిభను నేరుగా పరీక్షించాలని నిర్ణయించుకున్నాయి.

ఐఐటీ జో«ద్‌పూర్, ఐఐటీ పాటా్న, ఐఐటీ రోపార్, ఐఐటీ మండి, ఐఐటీ ఇండోర్‌ వంటి సంస్థల ప్లేస్‌మెంట్‌ సెల్‌ వివరాల ప్రకారం.. 2027 బ్యాచ్‌ నియామకాల కోసం నేరుగా క్యాంపస్‌కు వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్న కంపెనీల సంఖ్య 60–70 శాతానికి పెరిగింది. మారుమూల ప్రాంతాలకు కూడా కంపెనీ ప్రతినిధులే నేరుగా వెళ్తున్నారు.

క్యాప్‌జెమినై, అప్లైడ్‌ మెటీరియల్స్, ఎస్‌కేఎఫ్‌ ఇండియా వంటి సంస్థలు ఆఫ్‌లైన్‌ క్యాంపస్‌ డ్రైవ్‌లకు మొగ్గు చూపుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, పుణే వంటి ఐటీ కారిడార్లలో మళ్లీ వీకెండ్స్‌లో భారీ ‘వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు’ నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ పరీక్ష తప్పనిసరి అయితే అభ్యర్థులను సమీపంలోని పరీక్షా కేంద్రాలకు పిలిపించి, ఇని్వజిలేటర్ల పర్యవేక్షణలో, లాక్‌డౌన్‌ బ్రౌజర్ల సాయంతో పరీక్షలు జరుపుతున్నారు. 

ఇకపై ఏం చేయాలి? 
⇒ ఏఐ టూల్స్‌ అందుబాటులో ఉన్నాయని బేసిక్స్‌ను నిర్లక్ష్యం చేయవద్దు. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, కోర్‌ సబ్జెక్టులపై లోతైన అవగాహన పెంచుకోవాలి. 
⇒ ఆఫ్‌లైన్‌ ఇంటర్వ్యూలలో కంప్యూటర్‌ లేకుండానే వైట్‌బోర్డ్‌ లేదా పేపర్‌పై లాజిక్‌ రాయమంటారు. కాబట్టి ముందే అలా ప్రాక్టీస్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. 

⇒  మీ రెజ్యూమేలో పెట్టిన ప్రతి ప్రాజెక్ట్‌ గురించి లోతుగా తెలుసుకోండి. ఇంటర్వ్యూలలో ఆ ప్రాజెక్టుల గురించి అడిగినప్పుడు సమగ్రంగా చెప్పగలగాలి. 
⇒  ముఖాముఖి ఇంటర్వ్యూలలో భయం, తడబాటు లేకుండా ఉండటానికి స్నేహితులు లేదా మెంటార్లతో ఆఫ్‌లైన్‌ మాక్‌ ఇంటర్వ్యూలు ప్రాక్టీస్‌ చేయాలి. 

⇒  ఆఫ్‌లైన్‌ ఇంటర్వ్యూలలో అభ్యర్థి ఆత్మవిశ్వాసం, బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్‌ చాలా కీలకం. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 
⇒ హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో జరిగే వీకెండ్‌ వాక్‌–ఇన్‌ డ్రైవ్‌ల కోసం కంపెనీల అధికారిక వెబ్‌సైట్లు, లింక్డ్‌ఇన్‌ పేజీలను గమనిస్తూ ఉండాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement