కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌చార్జి బీఎం సందీప్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తాం
టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
రాబోయే ఎన్నికలకు అవసరమైన వ్యవస్థ అంతా తయారవుతోంది
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలెవరూ చింత పెట్టుకోవద్దు.. అదరవద్దు
ప్రజా ప్రభుత్వం చేసిన మంచి పనులన్నీ ప్రజలకు గుర్తు చేస్తే చాలు
క్షేత్రస్థాయికి వెళదాం.. పార్టీని మళ్లీ అధికారంలోకి తెద్దాం.. రాహుల్‌ను ప్రధానిని చేద్దాం
పార్టీ కోసం కష్టపడే వారితో పాటు కష్టపడి చెడగొట్టేవారినీ గుర్తుంచుకుంటాం
అందరి ప్రవర్తనా నిశితంగా గమనిస్తున్నామన్న ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, ఈసారి 119 అసెంబ్లీ స్థానాల్లో కోటి ఓట్లు టార్గెట్‌గా పెట్టుకున్నామని, 90 చోట్ల విజయం సాధిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికలకు అవసరమైన వ్యవస్థ అంతా తయారవుతోందని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలెవరూ చింత పెట్టుకోవద్దని, అదరవద్దని సూచించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మేలు జరిగే అనేక పనులు చేశామని, వాటన్నింటినీ గుర్తుచేస్తే చాలని అన్నారు.
అబద్ధాలను ప్రచారం చేసి అధికారంలోకి రావాలనేది బీఆర్‌ఎస్ ప్రయత్నమని, అది జరిగేది కాదని చెప్పారు. రాజకీయాల్లో విశ్వాసం, నమ్మకమే వేయి ఏనుగుల బలాన్నిస్తాయని, అవి లేకపోతేనే సమస్య వస్తుందని పేర్కొన్నారు. కేంద్రంలో 2024 పార్లమెంటు ఎన్నికల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సి ఉందని, కానీ ఆ ఎన్నికలను విశ్వాసంతో ఎదుర్కోక పోవడంతోనే అది జరగలేదని వ్యాఖ్యానించారు. ఆదివారం గాం«దీభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
అందరి సమాచారం మా వద్ద ఉంది..
‘కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసిన వాళ్లకు మంచి జరుగుతుంది. పార్టీని విశ్వసించి, రాహుల్ గాం«దీని నమ్మితే న్యాయం జరుగుతుంది. పార్టీని నమ్మితే సొమ్ము అవుతుంది. పార్టీ లైన్‌లో పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయి. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. పార్టీ ఇన్‌చార్జిగా వచ్చిన సందీప్ కూడా ఆ కోవలోకే వస్తారు. ఏఐసీసీ ఆయనకు పెద్ద గౌరవం ఇచ్చింది. మీరు క్షేత్రస్థాయిలో కష్టపడండి. వ్యూహం, ఎత్తుగడలు మాకు వదిలేయండి. ఎవరు కష్టపడతారో, ఎవరు పడరో అన్నీ చూస్తుంటాం. నిశితంగా గమనిస్తుంటాం. ప్రతి ఒక్కరి మాటతీరు, ప్రవర్తనకు సంబంధించిన సమాచారం మా దగ్గర ఉంది.
ఎవరి ముందు, ఎవరి వెనకాల ఏం మాట్లాడుతున్నారో సంపూర్ణ సమాచారం ఉంది. మీ శ్రమను ఎన్నికల సమయంలో కొలుస్తాం. కష్టపడే వారిని గుర్తిస్తాం.. కష్టపడి చెడగొట్టే వాళ్లను గుర్తిస్తాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. అనుబంధ సంఘాల చైర్మన్‌లు, డీసీసీల అధ్యక్షులు గుర్తు పెట్టుకోవాలి.
గాందీభవన్ చుట్టూ తిరిగితే, ఢిల్లీలో పలుకుబడి ఉందని పదవులు వస్తాయనుకుంటే అది అపోహ మాత్రమే. ఫలానా వారికి పదవులు ఇవ్వాలని ఢిల్లీ నుంచి ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు. ఢిల్లీకి కాదు.. గ్రామాలకు, తండాలకు, గూడేలకు, మారుమూల పల్లెలకు, పేదల వద్దకు వెళ్లాలి. పేదలకు అత్మబంధువులు అయ్యేవారే కాంగ్రెస్ పార్టీకి నాయకులు అవుతారు. పార్టీ పట్ల చూపించే చిత్తశుద్ధి, శ్రమతోనే పదవులు వస్తాయి..’ అని రేవంత్ స్పష్టం చేశారు.
మనం ఏం చేశామో కూడా చెప్పుకోవాలి.
‘ఎస్సీల వర్గీకరణ, కులగణన, గిగ్ వర్కర్ల చట్టం, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం, కోటిమందికి ఇందిరమ్మ చీరలు, 72,500 ఉద్యోగాలు భర్తీ, రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ, రూ.36 వేల కోట్ల రైతు భరోసా, రూ.90 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు, 4.75 లక్షల మందికి కొత్తగా పింఛన్ల గురించి చెప్పాలి. 8 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. 2.25 లక్షల కుటుంబాలు గృహ ప్రవేశం చేశాయి. ఇంకా చాలా ఉన్నాయి.
బీఆర్‌ఎస్ బురద జల్లే ప్రయత్నం చేస్తోంది
బీఆర్‌ఎస్ ఏదో ఒక తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వద్దామని అనుకుంటోంది. గోదావరి, కృష్ణా జలాల గురించి లేనిపోని ఆరోపణలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. పోయిన అసెంబ్లీ ఎన్నికలప్పుడే వీళ్లందరి బట్టలు వాళ్లే విప్పుకునేలా చేశా. బస్టాండులో నిలబెట్టిన. మొన్న సిద్దిపేటలో విప్పింది హరీశ్‌రావు అంగీనే. ఈసారి లాగు కూడా విప్పిస్తా. తెలంగాణ ఉద్యమంలో అగ్గిపెట్టె దొరకనోడు మంత్రి అయితే, అగ్గిపెట్టె దొరికిన శ్రీకాంతాచారి అమరుడయ్యాడు. ఇది వాళ్ల నైజం. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తాం. ఈలోపు అంతా సిద్ధం చేస్తున్నాం.
కోటి ఓట్ల టార్గెట్ ఎందుకంటే..
ఈసారి టార్గెట్ కోటి ఓట్లు ఎందుకంటే.. ఇందిరమ్మ చీరలు కోటి మంది ఆడపడుచులకు ఇస్తున్నాం. కోటి కుటుంబాలకు జీవిత బీమా అమలు చేస్తున్నాం. ఏ చెట్టు కిందయినా రచ్చబండ పెట్టండి.. బీఆర్‌ఎస్ వాళ్లను అడగండి. రేవంత్, ఉత్తమ్‌లు ఇచ్చిన సన్నబియ్యం తింటున్నారో లేదో. గాలికి తిరిగే బీఆర్‌ఎస్ నేతలు మనమిచ్చిన సన్నబియ్యం తింటున్నారు. వారి ఆడపడుచులు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. వారి ఇళ్లల్లో 200 యూనిట్ల విద్యుత్ కాంతులు వెలుగుతున్నాయా లేదా అడగండి. మనం చేయాల్సింది గుర్తు చేయడమే. చేసింది చెప్పుకోకపోతే, గుర్తు చేయకపోతే లాభముండదు.
అందరం క్షేత్రస్థాయికి వెళ్దాం. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంతో పాటు రాహుల్‌ను ప్రధానిని చేసే బాధ్యత తెలంగాణ తీసుకోవాలి. ఈసారి 17 పార్లమెంటు స్థానాల్లో 15 తెలంగాణ నుంచి ఇస్తాం. ఇద్దరు ఎమ్మెల్సీలను గెలిపించండి..’ అని ముఖ్యమంత్రి అన్నారు.
టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బీఎం సందీప్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు జెట్టి కుసుమకుమార్, సచిన్ సావంత్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.


