కులగణన చేయాల్సిందే...! | Revanth Reddy Calls for Caste Census in Telangana | Sakshi
Sakshi News home page

కులగణన చేయాల్సిందే...!

Nov 23 2026 12:42 AM | Updated on Nov 23 2026 12:42 AM

Revanth Reddy Calls for Caste Census in Telangana

జనగణనలో కులగణన చేయాలని కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో తీర్మానం

కరువును ఎదుర్కొనేందుకు రూ.30వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ మరో తీర్మానం

మీనాక్షికి ధన్యవాదాలు... సందీప్‌కు స్వాగతం తెలుపుతూ రెండు తీర్మానాలు

అసమ్మతి నేతల గురించి ప్రస్తావిస్తుండగా.. వారించిన రాష్ట్ర పార్టీ ఇంచార్జి

మంచి మైక్‌లో చెప్పి.. చెడు చెవిలో చెప్పాలన్న సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న జనగణనలో కులగణన చేయాల్సిందేనని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా కమిటీ (పీఏసీ) సమావేశంలో తీర్మానించింది. కాంగ్రెస్‌ నిరంతర డిమాండ్‌ నేపథ్యంలో 2027 జనగణనలో కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ, ఆగస్టు 14న విడుదల చేసిన 40 ప్రశ్నల నమూనాలో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే అవకాశం కల్పించి, ఓబీసీ కాలమ్‌ను చేర్చకపోవడం పట్ల సమావేశం అభ్యంతరం వ్యక్తం చేసింది.

జనగణనలో ఓబీసీల గణన కోసం ప్రత్యేక కాలమ్‌ చేర్చాలని తీర్మానించింది. అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను అధిగమించేందుకు రూ.30వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతూ మరో తీర్మానాన్ని కూడా సమావేశం ఆమోదించింది. అదేవిధంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా మీనాక్షి నటరాజన్‌ ఏడాది పాటు చేసిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ, కొత్త ఇంచార్జి బీఎం సందీప్‌కు స్వాగతం తెలిపే తీర్మానాలకూ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ వివరాలను సమావేశం అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు అజ్మత్‌ హుస్సేన్, సంపత్‌కుమార్‌ మీడియాకు వివరించారు. 

కేవలం పరిచయ సమావేశమే..
సీనియర్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను పీఏసీ సభ్యులకు వివరించారు. ఇటీవలి కాలంలో పార్టీలో చర్చనీయాంశమవుతున్న అసమ్మతి నేతల వ్యవహారం గురించి పీఏసీ సభ్యుడు రాములు నాయక్‌ ప్రస్తావించబోగా, పార్టీ ఇంచార్జి సందీప్‌ వారించినట్టు తెలిసింది. ఇది కేవలం తన పరిచయ సమావేశం మాత్రమేనని, ఎజెండాకు మాత్రమే పరిమితమవుదామని ఆయన చెప్పారని, సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇప్పుడు ఆ చర్చ అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిసింది. మంచి మైక్‌లో చెప్పాలని, చెడు చెవిలో చెప్పాలన్న విషయాన్ని పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని రేవంత్‌ సూచించినట్టు సమాచారం.

ఇక, సంక్రాంతి తర్వాత చేపట్టనున్న ప్రజాబలం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులను శుభ్రం చేసే పనులను చేపడదామనే చర్చ సందర్భంగా పనులు సరే కానీ, బిల్లుల చెల్లింపు ఎలా అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.జగ్గారెడ్డి ప్రశ్నించినట్టు తెలిసింది.

గత ప్రభుత్వం చేయించుకున్న పనులకు సంబంధించిన బిల్లులే రూ.వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, కొత్త పనులకు నిధుల సమస్య లేకుండా చూడాలని కోరగా, అలా జరగకుండా ప్రణాళిక రూపొందిద్దామని సీఎం చెప్పినట్టు సమాచారం. ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ కుమార్‌ మాట్లాడుతూ రాజకీయ వ్యవహారాల కమిటీ, సలహా కమిటీల సమావేశాలు సంయుక్తంగా కాకుండా, వేర్వేరుగా నిర్వహిస్తే బాగుంటుందని సూచించగా, ఈ దఫా అదే తరహాలో విడివిడిగా సమావేశం నిర్వహిద్దామనే అభిప్రాయం వ్యక్తమైంది. 

పార్టీ బలోపేతంపై చర్చ: మంత్రి పొన్నం
సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం పెంపు గురించిన చర్చ జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా అర్హుల ఓట్లు తీసేయకుండా ప్రజల ఓట్లను పరిరక్షించేందుకు క్షేత్రస్థాయిలో తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. బీజేపీ జాతీయ నేతల రాష్ట్ర పర్యటన సందర్భంగా అటు పార్టీ శ్రేణులు, ఇటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సమావేశం పిలుపునిచ్చిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement