విద్యుత్ లైన్ల సమస్య పరిష్కారానికి మంత్రి తుమ్మల ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌పామ్ తోటల మధ్య నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్ల సమస్య పరిష్కారానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం కీలక ప్రతిపాదన చేశారు. 11 కేవీ, ఎల్‌టీ విద్యుత్ లైన్ల స్థానంలో సాంకేతికంగా సాధ్యమైన చోట్ల ఏరియల్ బంచ్డ్ (ఏబీ) కేబుల్స్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. సాధారణంగా ఎకరాకు 50 ఆయిల్‌పామ్ మొక్కలు నాటాల్సి ఉండగా, విద్యుత్ లైన్ల కారణంగా గణనీయ సంఖ్యలో మొక్కలు తగ్గుతున్నాయి.
అంతేకాకుండా, విద్యుత్ ప్రమాదాలకు కూడా ఆ లైన్లు కారణమవుతున్నాయి. నిర్మల్ జిల్లా కనకాపూర్‌లో నాలుగున్నర ఎకరాల తోటలో 150 మీటర్ల మేర విద్యుత్ లైన్ ఉండటంతో 20 మొక్కలు కూడా నాటలేని పరిస్థితి నెలకొన్న విషయాన్ని మంత్రి దృష్టికి రైతులు తీసుకెళ్లారు. ఏబీ కేబుల్స్ ఏర్పాటుతో విద్యుత్ అంతరాయాలు, షార్ట్ సర్క్యూట్లు, అగ్ని ప్రమాదాలతో పాటు గెలల కోత సమయంలో కార్మికులకు విద్యుత్ ప్రమాదాల ముప్పు తగ్గుతుంది.
ఏబీ కేబుల్స్ ఏర్పాటుకు ఎకరాకు రూ.61 వేల నుంచి రూ.76 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ వ్యయంపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని, సాధ్యం కాకుంటే డిస్కంల ఛార్జీల్లో మినహాయింపు కల్పించాలని మంత్రి తుమ్మల సూచించారు. డిస్కంల ద్వారా నాణ్యమైన కేబుల్స్ సరఫరా చేయాలని కోరారు. విద్యుత్, ఉద్యాన శాఖలు సంయుక్తంగా లైన్లను గుర్తించి దశలవారీగా ఏబీ కేబుల్స్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి తుమ్మల ప్రతిపాదించారు.


