సర్‌ను సుప్రీంకోర్టు కొట్టేస్తే.. సీఈసీకి జైలే! | Senior advocate Prashant Bhushan Comments on Gyanesh Kumar | Sakshi
Sakshi News home page

సర్‌ను సుప్రీంకోర్టు కొట్టేస్తే.. సీఈసీకి జైలే!

Nov 23 2026 4:28 AM | Updated on Nov 23 2026 4:28 AM

Senior advocate Prashant Bhushan Comments on Gyanesh Kumar

జ్ఞానేశ్‌ కుమార్‌ దేశానికి తీవ్ర అన్యాయం చేశారు 

సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సంచలన వ్యాఖ్యలు 

ఖైరతాబాద్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను సుప్రీంకోర్టు కొట్టివేస్తే.. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు. ఆయన దేశానికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లను సంప్రదించకుండానే జ్ఞానేశ్‌ కుమార్‌ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా 14 సందర్భాల్లో నిర్ణయాలు అమలు చేశారని తెలిపారు. ‘సర్‌–రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై ఆదివారం విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.  

ఓటర్ల హక్కులకు భంగం 
గతంలో ఓటర్ల జాబితాలో పేరున్న వ్యక్తిని తొలగించాలంటే నోటీసు, విచారణ తప్పనిసరని సుప్రీంకోర్టు 1995లో స్పష్టం చేసిందని భూషణ్‌ గుర్తుచేశారు. ప్రస్తుత ఎస్‌ఐఆర్‌ విధానంలో మాత్రం ఓటర్లే తమ అర్హతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎన్యుమరేషన్‌ ఫారాలు అందని వారి పేర్లు తొలగించి, కొత్త ఓటర్ల కోసం ఉద్దేశించిన ఫారం–6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం అన్యాయమన్నారు. 

పశ్చిమ బెంగాల్‌లో సుమారు 27 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించగా, దీనిపై 22 లక్షల మంది అప్పీలు చేసుకున్నారని భూషణ్‌ తెలిపారు. ఇప్పటివరకు పరిష్కరించిన 1.4 లక్షల అప్పీళ్లలో 93 శాతం తొలగింపులు తప్పుగా జరిగినవేనని వెల్లడించారు. ప్రస్తుత వేగంతో మిగిలిన అప్పీళ్ల పరిష్కారానికి మరో 14 ఏళ్లు పడుతుందని అన్నారు. పాత ఓటర్ల జాబితాను బహిరంగంగా పరిశీలించేందుకు వీడియో చిత్రీకరణతో కూడిన పోలింగ్‌ బూత్‌ స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. 

ప్రభుత్వానికి అనుకూలంగా స్పీకర్‌ 
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభను కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నడుపుతున్నారని ప్రశాంత్‌ భూషణ్‌ విమర్శించారు. పార్లమెంటరీ కమిటీలకు ప్రస్తుతం కేవలం ఐదు శాతం బిల్లులనే పంపుతున్నారన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిపోయిందని, రాజకీయ పారీ్టల ఖర్చుపై పరిమితి లేకపోవడంతో అభ్యర్థుల ఖర్చుపై ఉన్న పరిమితి అర్థరహితంగా మారిందన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల్లో కేవలం రెండు శాతం మాత్రమే లెక్కిస్తున్నందున పేపర్‌ బ్యాలెట్లకు తిరిగి వెళ్లాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ సమంజసమైందేనని ప్రశాంత్‌ భూషణ్‌ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్‌ హరగోపాల్, సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య, రచయిత్రి, సునీత తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement