అనకాపల్లి: మండలంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో అతి చిన్న వయస్సులోనే సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగి పలువురిని ఆకట్టుకుంటుంది ఆర్.భీమవరంకు చెందిన బీ టెక్ విద్యార్థిని బల్లిన మేఘన. ఆర్.భీమవరం శివారు పంచాయతీ చిన భీమవరం రెండు గ్రామాలు కలిపి ఆర్.భీమవరం పంచాయతీలో ఉన్నాయి. రెండు గ్రామాల్లో 10 వార్డులుండగా 1,386 మంది ఓటర్లున్నారు. స్ధానిక పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ పంచాయతీ జనరల్ మహిళకు కేటాయించారు.
దీంతో తాజా మాజీ సర్పంచ్ బల్లిన అమ్మునాయుడు కుమార్తె బల్లిన మేఘన పంచాయతీ సర్పంచ్‌గా నామినేషన్ వేసింది. యువత రాజకీయాల్లో రాణించి సేవా కార్యక్రమాలు చేయాలన్న మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నా«థ్ ఆశయాలకు అనుగుణంగా ఆమె రాజకీయాల వైపు దృష్టి మల్లించింది. ఈ ఏడాది బీ టెక్ పూర్తి చేసి 21 ఏళ్ల 8 నెలల వయస్సున్న ఈమె సర్పంచ్ బరిలోకి దిగింది. అతి పిన్న వయస్సులోనే సర్పంచ్ బరిలోకి దిగడంతో గ్రామస్తులంతా అభినందిస్తున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా మాజీ సర్పంచ్, టీడీపీకి చెందిన మలిరెడ్డి బుజ్జి భార్య లక్ష్మీని బరిలోకి దించారు.
మేఘన తన కంటే రెండింతలకుపైగా వయస్సున్న అభ్యర్థితో సర్పంచ్ బరిలోకి దిగి ఆమెకు పోటీగా దీటుగా ప్రచారం చేస్తోంది. నామినేషన్ వేసిన తరవాత మేఘన తాత బల్లిన రాజునాయుడు అనారోగ్యంతో 11వ తేదీన మృతి చెందగా శనివారం ఆయన సంతాప సభ జరిగింది. ఒక వైపు తాతయ్య మృతి చెందిన దుంఖంలో ఉంటూనే గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం,గ్రామ అభివృద్ధికై ఎన్నికల బరిలో నిలిచి ప్రజల మన్నలను పొందుతుంది. మూడు రోజుల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని గ్రామ ఓటర్లను కోరుతోంది. మేఘనకు పోటీగా కూటమి నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
ఇదీ చదవండి: సర్పంచ్ బరిలో తోడికోడళ్లు


