కేంద్ర హోంశాఖ సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: వాట్సాప్ వెబ్ వినియోగదారులకు కేంద్ర హోంశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయిన వినియోగదారుల ఖాతాలను కొందరు సైబర్ నేరగాళ్లు అనధికారికంగా తమ అ«దీనంలోకి తీసుకునే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది. తద్వారా వ్యక్తిగత సందేశాలను చదవడం, వినియోగదారుల పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపడం, కాంటాక్ట్స్, గ్రూప్ సంభాషణలను యాక్సెస్ చేయడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ విధంగా ఖాతాదారుల విశ్వసనీయతను ఆసరాగా చేసుకుని ఆర్థిక మోసాలు, ఫిషింగ్, సోషల్ ఇంజనీరింగ్ నేరాలకు పాల్పడవచ్చని హోం శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) తెలిపింది. ముఖ్యంగా కార్యాలయాల్లో ఉపయోగించే కంప్యూటర్లు, ఇతరులతో పంచుకునే సిస్టమ్స్, పబ్లిక్ కంప్యూటర్లు, ఇతరులు సులభంగా యాక్సెస్ చేయగల పరికరాల్లో వాట్సాప్ వెబ్‌ను వినియోగించేటప్పుడు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించాయి.


