వాట్సప్‌ చాట్‌లోనే బిల్లుల చెల్లింపు | WhatsApp Big AI Upgrade Pay Bills Complete Tasks Right Inside Chats | Sakshi
Sakshi News home page

వాట్సప్‌ చాట్‌లోనే బిల్లుల చెల్లింపు

Nov 11 2026 12:18 PM | Updated on Nov 11 2026 12:41 PM

WhatsApp Big AI Upgrade Pay Bills Complete Tasks Right Inside Chats

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్‌లో మార్పులు రానున్నాయి. వాట్సప్ గ్లోబల్ హెడ్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా తాజాగా తన భవిష్యత్తు ప్రణాళికలను అధికారికంగా ప్రకటించారు. చాటింగ్ ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే పరిమితం కాకుండా రోజువారీ పనులను మరింత సులభతరం చేసేలా వాట్సప్‌ను సూపర్ యాప్ దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా డిజిటల్ చెల్లింపులు, ఏఐ, సంభాషణలను మరింత మెరుగుపరచడంపై దృష్టి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.

ప్రధానాంశాలపైనే ఫోకస్

ప్రస్తుతం వాట్సప్‌లో రోజువారీగా కోట్లకు పైగా వినియోగదారులు మెసేజ్‌లు పంపుకుంటున్నారు. ఇందులో నిత్యం సుమారు 10 బిలియన్లకు పైగా వాయిస్ నోట్స్, 4 బిలియన్‌లకు పైగా స్టిక్కర్లు షేర్ అవుతున్నాయి. వినియోగదారుల కమ్యూనికేషన్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు వాయిస్ నోట్స్, గ్రూప్ చాట్స్, స్టిక్కర్లు, వీడియో ఇంటరాక్షన్స్‌ను మరింత సరళంగా, భావప్రకటనకు అనుకూలంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు.

చాట్ విండోలోనే బిల్లుల చెల్లింపులు

చాలావరకు పనులు వాట్సప్ చాట్‌లో మొదలై ఇతర యాప్‌లకు మారడంతో ముగుస్తుంటాయని కునాల్ షా అభిప్రాయపడ్డారు. విద్యుత్ బిల్లులు చెల్లించడం, రుణాలు పొందడం లేదా ప్రయాణ సమయాల్లో కనెక్టివిటీని కొనసాగించడం వంటి పనుల కోసం వేర్వేరు అప్లికేషన్లకు మారడం వల్ల సమయం వృథా అవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్సప్ ప్రముఖ ఆర్థిక సేవల సంస్థలు, టెలికాం భాగస్వాముల సహకారంతో నేరుగా చాట్ విండోలోనే బిల్లుల చెల్లింపులు తదితర సేవలను అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తోంది. దీనివల్ల ఏ పనినైనా ప్రారంభించడం ఎంత సులభమో దాన్ని ముగించడం కూడా అంతే సులభం కానుంది.

సమయం ఆదా చేసేందుకు ఏఐ వాడకం

సాంకేతికత వినియోగదారులకు సమయాన్ని ఆదా చేయాలన్నదే తమ ఉద్దేశమని కునాల్ షా వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఏఐ సాంకేతికతను జోడించడం ద్వారా యూజర్లు కోరుకున్న సమాచారాన్ని సులభంగా కనుగొనడం, పనులను వేగంగా పూర్తి చేయడం, ముఖ్యమైన అపాయింట్‌మెంట్లు లేదా బుకింగ్‌లను మరువకుండా చూసేలా ఏఐ అసిస్టెన్స్ పనిచేస్తుందని వివరించారు.

గోప్యతకు అత్యంత ప్రాధాన్యత

వాట్సప్ విస్తరణ ఏ విధంగా ఉన్నప్పటికీ ప్లాట్‌ఫామ్‌ భద్రతకు, విశ్వసనీయతకు ఎలాంటి భంగం వాటిల్లదని కునాల్ షా స్పష్టం చేశారు. వాట్సప్ ప్రతిరోజూ 100 బిలియన్లకు పైగా సందేశాలు, 2 బిలియన్లకు పైగా కాల్స్‌ను ప్రాసెస్ చేస్తోందని గుర్తుచేశారు. ‘సంవత్సరాల తరబడి సంపాదించుకున్న నమ్మకాన్ని నిలుపుకోవడం మా బాధ్యత. వ్యక్తిగత చాట్‌లు, కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ విధానంలోనే భద్రంగా ఉంటాయి’ అని ఆయన తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement