దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి నిల్వ వ్యవస్థల వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ముందస్తు వర్గీకరణ చేయని (అన్‌సార్టెడ్) బ్యాటరీ వ్యర్థాలు, లిథియం-అయాన్ బ్యాటరీ బ్లాక్ మాస్ ఎగుమతులను తక్షణమే నిషేధిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) అధికారిక ప్రకటన జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
మారిన ఎగుమతి విధానం
గతంలో ఐటీసీ (హెచ్‌ఎస్) కోడ్ కింద ఉన్న ప్రాథమిక సెల్స్, ప్రైమరీ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ అక్యుములేటర్లు అలాగే వినియోగించిన బ్యాటరీల వ్యర్థాల ఎగుమతి విధానం ‘స్వేచ్ఛ’(ఫ్రీ) జాబితాలో ఉండేది. అయితే, ఎలాంటి సీసం (లెడ్), కాడ్మియం లేదా పాదరసం లేని, వర్గీకరించని బ్యాటరీ స్క్రాప్, లిథియం-అయాన్ బ్యాటరీ బ్లాక్ మాస్‌ను ఇప్పుడు నిషేధిత జాబితాలోకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశీయ ఎగుమతిదారులు ఇకపై ఈ నిర్దిష్ట వ్యర్థాలను విదేశాలకు తరలించడానికి వీలు ఉండదు.
ఈ నిర్ణయం వెనుక కారణం
లిథియం-అయాన్ బ్యాటరీల రీసైక్లింగ్ ద్వారా లభించే బ్లాక్ మాస్‌లో లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన ఖనిజాలు ఉంటాయి. సరిగ్గా ఇటువంటి కీలక ఖనిజాల సంపద దేశం దాటిపోకుండా అడ్డుకోవడమే ఈ నిషేధం ప్రధాన ఉద్దేశం. భారత్‌ను గ్రీన్ ఎనర్జీ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది పెద్దపీట వేస్తుంది. దేశంలో తయారయ్యే లేదా సేకరించే బ్యాటరీ వ్యర్థాలు ఇక్కడి రీసైక్లింగ్ యూనిట్లకే అందేలా చూడటం ద్వారా సర్క్యులర్ ఎకానమీ విధానాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం!


