ఝాన్సీ: రైల్వే ప్రయాణికుడిపై దురుసుగా ప్రవర్తిస్తూ, అసభ్య పదజాలంతో దూషించిన మహిళా ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)పై రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన రైల్వే అధికారులు సదరు మహిళా టీటీఈని తక్షణమే సస్పెండ్ చేశారు. ఘటనపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు.
ఈ ఘటన నవంబర్ 8న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ (12627) రైలు ఝాన్సీ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో జరిగినట్లు సమాచారం. లక్నోకు చెందిన శ్రవణ్ కుమార్ మరో ఇద్దరితో కలిసి ఏపీలోని పెనుకొండ నుంచి యూపీలోని ఝాన్సీకి ప్రయాణిస్తున్నారు. నవంబర్ 6న ముగ్గురూ రైల్వే కౌంటర్‌లో స్లీపర్ క్లాస్ టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణం ప్రారంభించారు. మొదట వారి టికెట్లు వెయిటింగ్ లిస్ట్‌లో 2, 3, 4 స్థానాల్లో ఉండగా.. చార్ట్ సిద్ధమైన తర్వాత ఇద్దరికి ఎస్ఆర్‌సీ (RAC)తో ఎస్-2 కోచ్‌లో 39వ నంబర్ బెర్త్ కేటాయించారు. మూడో ప్రయాణికుడికి 47వ నంబర్ బెర్త్ కేటాయించారు.
టికెట్ చూపించలేదని వాగ్వాదం
రైలు ఝాన్సీ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత మహిళా టీటీఈ ప్రయాణికులను టికెట్లు చూపించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే తన టికెట్ బ్యాగులో ఉండటంతో వెంటనే బయటకు తీయలేకపోయానని శ్రవణ్ కుమార్ తెలిపారు. తన వద్ద చెల్లుబాటు అయ్యే టికెట్ ఉందని, కొంత సమయం ఇస్తే వెతికి చూపిస్తానని చెప్పినట్లు వెల్లడించారు. రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో ప్రయాణికుల పేర్లు, కోచ్, బెర్త్ వివరాలను పరిశీలించి టికెట్‌ను ధ్రువీకరించవచ్చని కూడా సూచించినట్లు పేర్కొన్నారు. అయితే టీటీఈ తనకు సమయం ఇవ్వకుండా ఇతర సిబ్బంది సమక్షంలో దురుసుగా మాట్లాడారని ప్రయాణికుడు ఆరోపించారు. చివరకు బ్యాగులోని టికెట్‌ను తీసి చూపించినప్పటికీ వాగ్వాదం కొనసాగినట్లు తెలిపారు. అంతేకాకుండా ఝాన్సీ నుంచి లక్నోకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ స్టేషన్ ప్రాంగణం విడిచి వెళ్లాలని తనను ఆదేశించారని ఆరోపించారు.
A female TTE has been suspended with immediate effect at Lakshmibai Railway Station in Jhansi following allegations of misbehaving with a passenger. Passenger Shravan Kumar alleged that the TTE called him an “untouchable” and made casteist remarks after he took time to retrieve his ticket from his bag. After the video went viral, the railway authorities initiated an inquiry into the incident.
— Gems Of Railway (@GemsOfRailway) November 10, 2026
‘అంగుఠాచాప్’ అంటూ అవమానకర వ్యాఖ్యలు
ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియోలో మహిళా టీటీఈ ప్రయాణికుడిని తీవ్ర పదజాలంతో దూషిస్తున్నట్లు సమాచారం. ‘నీకు ఏమీ తెలియదు.. నువ్వు అంగుఠాచాప్ (నిరక్షరాస్యుడు)’ అంటూ అవమానించినట్లు వీడియోలో ఉంది. అంతేకాకుండా అతడిని చూడటమే తనకు ఇష్టం లేదన్నట్లుగా వ్యాఖ్యానించడంతో పాటు, తాను ఖాళీగా ఉంటే తన సత్తా ఏమిటో చూపించేదాన్నని హెచ్చరించినట్లు ఆరోపించారు. ప్రయాణికుడు తాను తదుపరి ప్రయాణానికి ఆన్‌లైన్‌లో టికెట్ కూడా బుక్ చేసుకున్నానని చెప్పగా.. అది కన్ఫర్మ్ అయిందా? కన్ఫర్మ్ అయితేనే రైలు ఎక్కగలవంటూ టీటీఈ గట్టిగా మాట్లాడినట్లు వీడియోలో కనిపిస్తోంది.
సోషల్ మీడియా ఫిర్యాదుతో చర్యలు
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను శ్రవణ్ కుమార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు చేసి, రైల్వే అధికారులను ట్యాగ్ చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వీడియో వైరల్ కావడంతో రైల్వే అధికారులు స్పందించి విచారణ ప్రారంభించారు. ఝాన్సీ రైల్వే డివిజన్ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) మనోజ్ కుమార్ సింగ్ ఈ ఘటనపై స్పందించారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా, గౌరవంగా వ్యవహరించడం భారతీయ రైల్వేలకు అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. ఘటనకు సంబంధించి మహిళా టీటీఈని తక్షణమే సస్పెండ్ చేసినట్లు, శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. విచారణ ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మంత్రులు, ఎమ్మెల్యేలతో విజయ్ అత్యవసర భేటీ


