న్యూఢిల్లీ: ప్రముఖ రెస్టారెంట్ చైన్ సాగర్ రత్నలో ఆహార పరిశుభ్రతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో ఉన్న ఆ రెస్టారెంట్‌లో ఓ కస్టమర్‌కు వడ్డించిన దోశలో చనిపోయిన బొద్దింక కనిపించింది. దాదాపు దోశ మొత్తం తిన్న తర్వాత ఆలూ మసాలాలో బొద్దింకను గుర్తించినట్లు బాధితుడు వెల్లడించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది.
రుషిల్ దత్తా అనే వ్యక్తి నవంబర్ 9న తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని అశోక్ విహార్‌లో ఉన్న సాగర్ రత్న రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ దోశ ఆర్డర్ చేశాడు. దాదాపు భోజనం పూర్తి చేసే సమయంలో దోశలోని ఆలూ మసాలాలో చనిపోయిన బొద్దింక కనిపించింది. దీంతో అతడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘటనను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో రూపంలో పంచుకున్నాడు.
"దోశ దాదాపు మొత్తం తినేశాను. ఇంతలో ఆలూ మసాలాలో బొద్దింక కనిపించింది. అప్పటి నుంచి నాకు అనారోగ్యంగా, చాలా అసహ్యంగా అనిపిస్తోంది" అని రుషిల్ తన పోస్టులో పేర్కొన్నాడు. వీడియోలోనూ రెస్టారెంట్ పేరు, ప్రాంతాన్ని ప్రస్తావించాడు. "ఈరోజు నవంబర్ 9. మేము అశోక్ విహార్‌లోని సాగర్ రత్న రెస్టారెంట్‌లో ఉన్నాం. ఇక్కడ ఆహారంలో బొద్దింక వచ్చింది" అని తెలిపాడు.
గతంలోనూ ఇలాంటి ఫిర్యాదు చేశారంటూ..
ఈ సందర్భంగా రుషిల్ మరో విషయాన్ని ప్రస్తావించాడు. ఆగస్టు 30న కూడా ఇదే రెస్టారెంట్‌లో తనకు సమీపంలో భోజనం చేస్తున్న మరో వ్యక్తి ఆహారంలో పురుగు కనిపించిందని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ పరిశుభ్రతపై ప్రశ్నలు లేవనెత్తాడు. "నాకు లేదా నా కుటుంబ సభ్యులకు ఏదైనా వ్యాధి వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇంత దారుణమైన పరిశుభ్రత, తీవ్ర నిర్లక్ష్యం ఏమిటి?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో పలువురు స్పందిస్తున్నారు. రెస్టారెంట్‌లో ఆహార తయారీ, పరిశుభ్రత ప్రమాణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)ను కూడా ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం కస్టమర్ చేసిన సోషల్ మీడియా ఫిర్యాదే అందుబాటులో ఉంది. ఆరోపణలపై సాగర్ రత్న రెస్టారెంట్ యాజమాన్యం నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. ఈ ఫిర్యాదుపై ఆహార భద్రతా అధికారులు విచారణ చేపడతారా? రెస్టారెంట్ యాజమాన్యం ఎలాంటి వివరణ ఇస్తుంది? అన్నది వేచి చూడాలి.
दिल्ली के अशोक विहार स्थित Sagar Ratna रेस्टोरेंट में खाने मे कॉकरोच मिलने का मामला सामने आया है। एक युवक ने खाने में कॉकरोच मिलने का वीडियो बनाकर सोशल मीडिया पर शेयर किया, जिसके बाद वीडियो वायरल हो रहा है। #DelhiNews #AshokVihar #SagarRatna #CockroachInFood #ViralVideo https://t.co/s9KOWGMoJT
— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) November 10, 2026


