2026లోనూ అదే జరిగింది.. నాలుగో స్థానంలో నిలవనుంది.. | 2026 to be one of four warmest years on record UN weather agency | Sakshi
Sakshi News home page

2026లోనూ అదే జరిగింది.. నాలుగో స్థానంలో నిలవనుంది..

Nov 10 2026 5:33 PM | Updated on Nov 10 2026 5:39 PM

2026 to be one of four warmest years on record UN weather agency

ప్రపంచ చరిత్రలో అత్యంత వేడి నమోదైన నాలుగు సంవత్సరాల్లో ఒకటిగా 2026 నిలవనుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 2023, 2024, 2025 సంవత్సరాల సరసన 2026 కూడా చేరనుందని తెలిపింది. సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది.

ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు నాటి (1850–1900 మధ్య) స్థాయితో పోలిస్తే 1.47 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రతలు 2025, 2023 సంవత్సరాల్లో నమోదైన పూర్తి ఏడాది సగటు స్థాయుల కంటే ఎక్కువగా ఉన్నాయి. అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కిన 2024లో నమోదైన సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే మాత్రమే కొంత తక్కువగా ఉన్నాయని వివరించింది.

సంవత్సరం ప్రారంభంలో ఏర్పడిన లా నినా పరిస్థితులు తాత్కాలికంగా ఉష్ణోగ్రతలను తగ్గించాయని నివేదిక తెలిపింది. లా నినా ప్రభావంతో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు సాధారణంగా 0.1 నుంచి 0.2 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయి. అయితే జూన్ నాటికి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటంతో ఈ చల్లదనం ప్రభావం తిరగబడింది. ఆగస్టు చివరి నాటికి ఎల్ నినో తీవ్రత మరింత పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని వివరించింది.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో ఎల్ నినో ప్రభావంతో భారత్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే వేడెక్కే పరిస్థితినే ఎల్ నినో అంటారు. ఇది సాధారణంగా కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. భారత్‌లో వర్షపాతం తగ్గడానికి కూడా ఈ పరిస్థితి కారణమవుతుందని భావిస్తారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు కరువు పరిస్థితులను ప్రకటించి, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాయి.

ఎల్ నినో ప్రభావం 2027 ప్రారంభం వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది రికార్డుల్లో అత్యంత బలమైన ఎల్ నినో పరిస్థితుల్లో ఒకటిగా మారే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యదర్శి సెలెస్టే సౌలో తెలిపారు.

“ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్ నినో రికార్డుల్లో అత్యంత బలమైన వాటిలో ఒకటిగా మారుతుందని అంచనా. సముద్రం నుంచి విడుదలయ్యే వేడి 2027 వరకు అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వాతావరణ పరిస్థితులకు కారణమవుతుంది” అని ఆమె పేర్కొన్నారు.

ఎల్ నినో ప్రభావం
ఎల్ నినో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలను 0.1 నుంచి 0.2 డిగ్రీల సెల్సియస్ వరకు పెంచుతుందని నివేదిక తెలిపింది. 2026లో మిగిలిన కాలంతో పాటు 2027 ప్రారంభం వరకు అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన సగటు ఉష్ణోగ్రతల కంటే 2026 పూర్తి ఏడాది సగటు మరింత ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది.

మరోవైపు, ఈ ఏడాది భారత్‌లో నమోదైన వడగాలులను ప్రధాన తీవ్ర వాతావరణ పరిణామాలుగా నివేదిక గుర్తించింది. ఏప్రిల్ 2026లో వచ్చిన వడగాలుల కారణంగా దేశంలో సుమారు 14.65 కోట్ల మంది తీవ్ర వేడికి గురైనట్లు వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు ప్రజల ప్రాణాలు, జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నాయని, ఆహార భద్రతను దెబ్బతీస్తూ పేదరికాన్ని మరింత పెంచుతున్నాయని నివేదిక హెచ్చరించింది. అంతేకాకుండా ప్రజలు తమ నివాస ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని తెలిపింది. వచ్చే ఏడాది వరకు ఎల్ నినో ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు, వర్షపాతం, తీవ్ర వాతావరణ పరిణామాలపై ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement