యుద్ధంలో మహిళలే కీలకం: ఐరాసలో భారత్‌ | India At UN Calls For Greater Women Leadership In Global Peace And Security, Highlights Women’s Reservation Law And Military Reforms | Sakshi
Sakshi News home page

యుద్ధంలో మహిళలే కీలకం: ఐరాసలో భారత్‌

Oct 29 2026 11:22 AM | Updated on Oct 29 2026 12:27 PM

India at UN Womens Leadership Crucial for Peace and Security

న్యూయార్క్‌: అంతర్జాతీయ శాంతి, భద్రతల పరిరక్షణలో మహిళల నాయకత్వం, నిర్ణయాధికారంలో వారి భాగస్వామ్యం అత్యంత కీలకమని భారత్ ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా స్పష్టం చేసింది. రాజకీయ నాయకత్వంతో పాటు పాలన, సాయుధ దళాలు, సాంకేతిక రంగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు చట్టబద్ధమైన లింగ సమానత్వ కోటాలు దోహదపడతాయని పేర్కొంది. ఐరాస భద్రతా మండలిలో మహిళలు, శాంతి, భద్రత అంశంపై జరిగిన బహిరంగ చర్చలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడారు. మహిళల సాధికారత కోసం భారత్ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా 2023 నాటి నారీ శక్తి వందన్ అధినియమంను ప్రస్తావించారు.

1993లో స్థానిక ప్రభుత్వ సంస్థల్లో మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం గణనీయమైన మార్పునకు దారితీసిందని హరీశ్ తెలిపారు. ఈ విధానం ద్వారా పది లక్షల మందికిపైగా మహిళలు నాయకత్వ స్థానాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. 2023 మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా జాతీయ, రాష్ట్ర శాసనసభల్లోనూ మహిళల ప్రాతినిధ్యాన్ని విస్తరించే దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రైవేటు రంగంలోనూ నిర్ణయాధికార స్థానాల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

భారత సాయుధ దళాల్లోనూ మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నట్లు హరీశ్ వివరించారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల్లో చేపట్టిన వ్యవస్థాగత సంస్కరణల ద్వారా మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేయడంతో పాటు పోరాట విభాగాల్లోనూ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఫైటర్ పైలట్ల నుంచి సైనిక దౌత్యవేత్తల వరకు మహిళలు కీలక బాధ్యతలు చేపడుతున్నారని, ఐరాస శాంతి పరిరక్షక దళాల్లో భారత మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతోందని చెప్పారు.

మహిళలు, శాంతి, భద్రతకు సంబంధించిన ఐరాస భద్రతా మండలి తీర్మానం 1325ను 2000 అక్టోబర్ 29న ఆమోదించారు. సంఘర్షణ ప్రాంతాల్లో మహిళలు, బాలికల రక్షణకు ఈ తీర్మానం ప్రాధాన్యమిస్తుంది. స్వదేశానికి తిరిగి పంపడం, సంఘర్షణ అనంతర పునర్నిర్మాణం, స్థానిక శాంతి కార్యక్రమాలు సహా వివిధ చర్యల్లో లింగ సమానత్వ దృక్పథాన్ని చేర్చాలని అంతర్జాతీయ సమాజానికి సూచిస్తుంది. 

 ఇదీ చదవండి: నేడు 700 మంది మహిళా కానిస్టేబుళ్లకు సెలవు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement