ఫతేపూర్: కర్వాచౌత్ పండుగ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అభిమన్యు మాంగ్లిక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సుమారు 700 మంది మహిళా పోలీసులకు పండుగ జరుపుకునేందుకు నేడు (గురువారం) సెలవు మంజూరు చేశారు. కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు ఉన్న మహిళా సిబ్బందికి ఈ నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది. విధి నిర్వహణలో నిరంతరం నిమగ్నమయ్యే మహిళా పోలీసులకు కుటుంబంతో కలిసి పండుగ జరుపుకునే అవకాశం కల్పించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
23 పోలీస్ స్టేషన్లు, 40 ఔట్‌పోస్టుల్లో..
ఫతేపూర్ జిల్లాలోని 23 పోలీస్ స్టేషన్లు, 40 పోలీస్ ఔట్‌పోస్టుల్లో మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కర్వాచౌత్ ఉపవాసం ఉండాలనుకునే మహిళా పోలీసుల జాబితాను అందించాలని ఆయా పోలీస్ స్టేషన్ల ఇన్‌ఛార్జీలను ఎస్పీ అభిమన్యు మాంగ్లిక్ ఆదేశించారు. అదే సమయంలో జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. విధులు, పండుగ బాధ్యతల మధ్య సమతుల్యత ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.
కుటుంబంతో పండుగ జరుపుకునే అవకాశం
మహిళా పోలీసుల ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని కానిస్టేబుల్ అమృతా సింగ్ తెలిపారు. విధుల కారణంగా కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు చాలా తక్కువ సమయం లభిస్తుందని చెప్పారు. కర్వాచౌత్ సందర్భంగా సెలవు ఇవ్వడంతో ఈసారి పండుగను కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకోగలుగుతానని పేర్కొన్నారు. ఉత్తరాదిన మహిళలు కర్వాచౌత్ పండును నేడు (అక్బోబర్ 29)న జరపుకుంటున్నారు.


