ఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మహమ్మద్ అజంఖాన్‌కు చెందిన జౌహర్ యూనివర్సిటీ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.1,170 కోట్లు ఉంటుందని ఈడీ వెల్లడించింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఉన్న మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ భూములు, భవనాలను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ), 2002 కింద తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు తెలిపింది.
మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ ట్రస్ట్ ఈ యూనివర్సిటీని నిర్వహిస్తోంది. అజంఖాన్ యూనివర్సిటీ గౌరవ ఛాన్సలర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. రైతుల వ్యవసాయ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుని యూనివర్సిటీ కోసం వినియోగించారనే ఆరోపణలపై రాంపూర్‌లోని అజీమ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన 26 కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
సింఘన్‌ఖేడా గ్రామంలో సుమారు 34 ఎకరాల్లో 45 ప్లాట్లను యూనివర్సిటీ కోసం అజంఖాన్ అక్రమంగా ఆక్రమించినట్లు ఈడీ పేర్కొంది. ట్రస్ట్‌కు ఆ భూములపై ఇచ్చిన లీజును సంబంధిత అధికారి రద్దు చేసినప్పటికీ ఆక్రమణ కొనసాగినట్లు తెలిపింది. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ పనుల కోసం కేటాయించిన నిధులను యూనివర్సిటీ నిర్మాణానికి మళ్లించినట్లు దర్యాప్తులో గుర్తించామని ఈడీ తెలిపింది. ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన కాంట్రాక్టర్ల నుంచి విరాళాల రూపంలో నిధులు తిరిగి ట్రస్ట్‌కు చేరినట్లు పేర్కొంది.
అజంఖాన్‌పై రాంపూర్ పోలీసులు నమోదు చేసిన మరో 28 ఎఫ్‌ఐఆర్‌లను కూడా ఈడీ దర్యాప్తు పరిధిలోకి తీసుకుంది. వీటిలో చాలా కేసుల్లో ఇప్పటికే చార్జిషీట్లు దాఖలయ్యాయి. 2016లో రాంపూర్ నగరంలోని వక్ఫ్ ఆస్తుల్లో నివసిస్తున్న వారితో పాటు పలువురు కుటుంబాల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసినట్లు ఆ కేసుల్లో ఆరోపణలు ఉన్నాయని ఈడీ తెలిపింది.
ఇదీ చదవండి: మెట్రోలో పోకిరీ రహస్య వీడియో


