రేపు రాత్రి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–18 ప్రయోగం | ISRO to launch NVS-03 navigation satellite on October 30 | Sakshi
Sakshi News home page

రేపు రాత్రి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–18 ప్రయోగం

Oct 29 2026 6:17 AM | Updated on Oct 29 2026 6:17 AM

ISRO to launch NVS-03 navigation satellite on October 30

కక్ష్యలోకి నావిక్‌–03 ఉపగ్రహం 

నేటి రాత్రి 8.21 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం అర్థరాత్రి 11.51 గంటలకు జియో సింక్రనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ) ఎఫ్‌–18 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ ద్వారా నావిక్‌–03 ఉపగ్రహాన్ని రోదసీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. 

బుధవారం రాత్రి ఎంఆర్‌ఆర్‌ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌)కు అప్పగించారు. లాంచ్‌ ఆథరైజేష్‌ బోర్డు లాంచ్‌ రిహార్స్‌ల్‌ నిర్వహించి, ప్రయోగానికి 27.30 గంటల ముందు అంటే గురువారం (నేడు) రాత్రి 8.21 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిసింది. రాకెట్‌ ప్రయోగాన్ని 19 నిమిషాల్లో పూర్తిచేయాలని నిర్ణయించారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–2 సిరీస్‌లో ఇది 20వ ప్రయోగం. షార్‌ కేంద్రం నుంచి ఇది 107వ ప్రయోగం. బెంగళూరు నుంచి గురువారం శ్రీహరి కోటకు రానున్న ఇస్రో చైర్మన్‌ ఆధ్వర్యంలోనే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభించనున్నారు.

నావిక్‌–03 ఉపగ్రహంతో ఉపయోగాలు
నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాన్స్‌స్టలేషన్‌ (నావిక్‌) మన దేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్‌ వ్యవస్థ. ఈ వ్యవస్థలో భారత్‌ క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ఉపగ్రహాల శ్రేణికి నావిగేషన్‌ సేవల కొనసాగింపుగా అందించేందుకు ఉద్దేశించిన తదుపరి తరం నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థలో మూడో ఉపగ్రహం నావిక్‌–03. ఈ ఉపగ్రహంలో నావిగేషన్‌ పేలోడ్, రేంజింగ్‌ పేలోడ్‌ అనే రెండు రకాల పేలోడ్స్‌ను అమర్చారు. 

నావిగేషన్‌ పేలోడ్‌ వినియోగదారులకు నావిగేషన్‌ సేవా సంకేతాలను ప్రసారం చేస్తుంది. ఈ పేలోడ్‌ ఎల్‌1, ఎల్‌5, ఎస్‌ బ్యాండ్‌లతో పనిచేస్తుంది. ఈ పేలోడ్‌లో అత్యంత స్థిరమైన రుబీడియం అటావిుక్‌ క్లాక్‌ ఏర్పాటు చేశారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సిరీస్‌ ఉపగ్రహాలలో దిగుమతి చేసుకున్న రుబీడియం అటావిుక్‌ క్లాక్‌లు విఫలం కావడంతో అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించి ఈ ఉపగ్రహంలో అమర్చారు. 

అయితే ఇప్పటికే కొనుగోలు చేసిన అటావిుక్‌ క్లాక్‌లతో పాటు స్వదేశీ అటావిుక్‌ క్లాక్‌లు అమర్చి రూపొందించారు. ఇప్పటికే ఉన్న ఎల్‌5/ఎస్‌ సిగ్నల్స్‌కు అదనంగా ఎల్‌1 సిగ్నల్‌ను అందించి నావిగేషన్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. ఇది భారత భూభాగంపైన, దేశ సరిహద్దుల చుట్టూ 1,500 కిలోమీటర్ల మేర విస్తరించిన ప్రాంతంపై కవరేజీ అందిస్తుంది. రెండో పేలోడ్‌ అయిన రేంజింగ్‌ పేలోడ్‌లో ట్రాన్స్‌ఫాండర్‌ ఉంది. ఇది రెండుమార్గాల కొలతల కోసం సీడీఎంఏ మోడ్‌లో పనిచేస్తుంది. ఈ కొత్తతరం నావిగేషన్‌ ఉపగ్రహంలో పరిమిత వినియోగదారుల కోసం ఉపగ్రహ సమాచార మార్పిడిని బలోపేతం చేయడానికి మెరుగైన ఎన్‌క్రిప్షన్‌ వ్యవస్థ ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement