పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంకలో ఎగసిపడుతున్న అలలు
తీరంలో 3 కిలోమీటర్లకు పడిపోయిన అర్నబ్ వేగం
6 గంటలపాటు కొనసాగిన ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ
తీరంలో అన్ని గంటలు నిలిచి పోవడం వల్లే తీవ్ర ప్రభావం
ఫలితంగా పలు ప్రాంతాల్లో కుంభవృష్టి
ఏడాది క్రితం మొంథా తుపాను తీరం దాటిందీ నరసాపురం వద్దే
సాక్షి, అమరావతి: సముద్రంలో వేగంగా ప్రయాణిస్తూ తీరం వైపు దూసుకొచ్చిన అర్నబ్ తుపాను.. తీరానికి చేరాక పూర్తిగా నెమ్మదించింది. మంగళవారం పగలంతా గంటకు 17 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాను, బుధవారం తెల్లవారుజామున నరసాపురం వద్ద భూమిని తాకే సమయానికి గంటకు 3 కిలోమీటర్ల వేగానికి పడిపోయింది. దీంతో రెండు గంటల్లో ముగుస్తుందనుకున్న తీరం దాటే ప్రక్రియ ఆరు గంటలపాటు సాగింది.
ఆ సమయంలో గోదావరి జిల్లాల్లో పెనుగాలులు, ఉ9త్తరాంధ్రలో కుండపోత వర్షం కురిసింది. అర్నబ్ ఈ నెల 23న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడింది. 24న వాయు గుండంగా, 25న తీవ్ర వాయుగుండంగా బలపడింది. 26 తెల్లవారుజామున తుపానుగా మారాక ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది.
అదే రోజు సాయంత్రానికి తీవ్ర తుపానుగా, అర్ధరాత్రికి అతి తీవ్ర తుపానుగా మారింది. 24 గంటల్లోనే తుపాను కేంద్రం వద్ద గాలి వేగం దాదాపు రెట్టింపైంది. ఇలా అతి తక్కువ సమయంలో బలపడటాన్ని వాతావరణశాస్త్రంలో ‘రాపిడ్ ఇంటెన్సిఫికేషన్‌గా చెబుతారు. మంగళవారం పగలు తుపాను కేంద్రం వద్ద గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయి.
తీరం వద్ద నెమ్మదించి..
మంగళవారం ఉదయం కాకినాడకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుపాను, రాత్రికల్లా 70 కిలోమీటర్లకు చేరువైంది. తుపాను వేగం పెరగడంతో బుధవారం మధ్యాహ్నంలోపు తీరం దాటుతుందన్న అంచనాను వాతావరణ శాఖ మార్చుకుని.. తెల్లవారుజామునే తీరం దాటుతుందని ప్రకటించింది. తెల్లవారుజాము 2 గంటలకు తీరాన్ని తాకడం మొదలుపెట్టినా, అక్కడికి వచ్చాక దాని వేగం పూర్తిగా తగ్గిపోయింది.
తీరానికి చేరువయ్యాక సముద్రం నుంచి తేమ, వేడి అందక పోవడం, భూమిపై ఘర్షణ పెరగడం, తుపానును ముందుకు నెట్టే పైస్థాయి గాలులు బలహీన పడటంతో వేగం తగ్గిందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. యానాం సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసినా, అంతకంటే కొంచెం దక్షిణంగా యానాంకు 40 కిలోమీటర్ల దూరంలో నరసాపురం వద్ద భూమిని తాకింది. ఉదయం 8 గంటలకు గానీ తుపాను కేంద్రం పూర్తిగా భూభాగంపైకి రాలేదు. దీంతో తీర ప్రాంతాలు ఎక్కువసేపు గాలులు, వర్షం బారిన పడ్డాయి.
తీరం దాటింది ఒకచోట.. కుండపోత మరోచోట
తుపాను తీరం దాటిన నరసాపురంలో 3.3 సెంటీమీటర్ల వర్షమే కురిసింది. కానీ 200 కిలోమీటర్ల దూరంలోని విశాఖ పరిసరాల్లో అనేక చోట్ల 20 నుంచి 31 సెంటీమీటర్ల వర్షం పడింది. ఉత్తరాంధ్రలో వందకు పైగా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో తుపాను గాలులు అపసవ్య దిశలో తిరుగుతాయి. దాంతో తుపాను ఉత్తర భాగంలోని గాలులు సముద్రం నుంచి తేమను తీసుకొచ్చి ఉత్తరాంధ్ర తీరాన్ని తాకాయి.
ఇవి సింహాచలం కొండలు, తూర్పు కనుమలను ఢీకొని పైకి లేచి, చల్లబడి భారీ వర్షంగా కురిశాయి. అందుకే అత్యధిక వర్షపాతం సింహాచలం కొండల పరిసరాల్లోనే నమోదైంది. తుపాను దక్షిణ భాగంలో భూమి మీది నుంచి పొడి గాలులు వీయడంతో బాపట్ల, ప్రకాశం జిల్లాల వైపు వర్షం తక్కువగా పడింది.
హుద్‌హుద్‌లోనూ ఇలాగే..
తుపాను ఎక్కడ తీరం దాటినా ఉత్తరాంధ్ర కొండ ప్రాంతాల్లోనే అత్యధిక వర్షం కురవడం గతంలోనూ జరిగింది. 2014లో హుద్‌హుద్ విశాఖ వద్ద తీరం దాటిన సమయంలో విజయనగరం జిల్లా గంట్యాడలో ఒక్క రోజులో 38 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 2021లో గులాబ్ తుపాను సమయంలో విశాఖలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం పడింది. ఈసారి అర్నబ్ 200 కిలోమీటర్ల దక్షిణాన తీరం దాటినా, భారీ వర్షం అవే కొండ ప్రాంతాల్లో కురిసింది. ఒక్కచోట నమోదైన గరిష్ట వర్షపాతం ఆ రెండు తుపాన్ల కంటే తక్కువే అయినా, అర్నబ్ వల్ల ఒకేరోజు వందకు పైగా ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది.
ఏడాది తేడాతో ఒకే చోట
సరిగ్గా ఏడాది క్రితం అక్టోబర్ 28 అర్ధరాత్రి మొంథా తుపాను కూడా నరసాపురం వద్దే తీరం దాటింది. అప్పుడు మొంథా తీవ్ర తుపానుగా తీరం దాటగా, ఈసారి అర్నబ్ అంతకంటే బలమైన అతి తీవ్ర తుపానుగా వచ్చింది. రెండూ ఒకే చోట తీరం దాటినా ప్రభావం వేర్వేరు ప్రాంతాలపై పడింది. మొంథా సమయంలో దక్షిణ కోస్తాలోని ఒంగోలులో భారీ వర్షం కురవగా, ఈసారి ఉత్తరాంధ్రలో కుండపోత కురిసింది.
ఇతర తుపాన్లతో పోలిస్తే..
బలంలో అర్నబ్ హుద్‌హుద్ కంటే తక్కువే. 2018లో శ్రీకాకుళం జిల్లాను దెబ్బతీసిన తిత్లీ కూడా అతి తీవ్ర తుపానే. గులాబ్, మిచాంగ్, మొంథాల కంటే మాత్రం అర్నబ్ బలంగా తీరం దాటింది. 2023లో మిచాంగ్ తుపాను చెన్నై తీరం వెంబడి నెమ్మదిగా కదలడంతో ఆ నగరం వరదలో మునిగింది. తీరం దగ్గర తుపాను నెమ్మదిస్తే నష్టం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అక్టోబర్–డిసెంబర్‌లోనే ఎక్కువ
హుద్‌హుద్, తిత్లీ, పెథాయ్, మిచాంగ్, మొంథా, అర్నబ్.. రాష్ట్రాన్ని తాకిన తుపాన్లు అక్టోబర్–డిసెంబర్ మధ్యే వచ్చాయి. ఈ నెలల్లో బంగాళాఖాతం ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల తుపాన్లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా అర్నబ్ లాంటి ఒక్క రోజులోనే బలపడే తుపాన్లు పెరుగుతున్నాయని వాతావరణ అధ్యయనాలు చెబుతున్నాయి.
నేడూ ఉత్తరాంధ్రలో వర్షాలు
తుపాను తీరం దాటినా ముప్పు ఇంకా తొలగలేదు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తడిసి ముద్దయిన ఉత్తరాంధ్రపై మరోసారి కుండపోత కురిస్తే వాగులు, వంకలు ఉప్పొంగే ప్రమాదం ఉంది.
విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. గురువారం కూడా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో 10వ నంబర్, విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో 9వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.


