ప్రపంచ దేశాలకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు
అమెరికా రక్షణ మంత్రి హెగ్‌సెథ్‌తో సమావేశం
భారత్ – అమెరికా డిఫెన్స్ ఫ్రేమ్‌వర్క్ ప్యాక్ట్‌పై సమీక్ష
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి మద్దతిచ్చే, ఉగ్రవాదులకు శిక్షణిచ్చే, సంస్థలకు నిధులు అందించే దేశాల విషయంలో అంతర్జాతీయ సమాజం రాజీలేకుండా, కఠినంగా వ్యవహరించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్‌సెథ్‌తో బుధవారం జరిగిన సమావేశాల అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ – అమెరికల రక్షణ ఒప్పందానికి పదేళ్లు అయిన సందర్భంగా ఇద్దరు మంత్రులు ఫిలిప్పీన్స్‌లోని సీబూలో దీనిపై సమీక్ష నిర్వహించారు.
సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా అండగా ఉంటుందని, పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్బంగా ఆ దేశ మంత్రి హెగ్‌సెథ్ భరోసా ఇచ్చినట్లు భారత్ తెలిపింది. హెగ్‌సెథ్‌తో చర్చలు బాగా జరిగినట్లు రాజ్‌నాథ్ సింగ్ తన ఎక్స్ పోస్టులోనూ ప్రకటించారు. ‘‘పదేళ్ల భారత్–అమెరికా డిఫెన్స్ ఫ్రేమ్ వర్క్ ఒప్పందాన్ని సమీక్షించాం.
మిలటరీ టెక్నాలజీల విషయంలో వ్యూహాత్మక మేళవింపును ప్రోత్సహిస్తున్నాం. సమాచార మారి్పడి, ఇరుదేశాలు కలిసికట్టుగా రక్షణ ఉత్పత్తుల తయారీ చేపట్టడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ‘‘ఇరుదేశాల భాగస్వామ్యం ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన పరిస్థితులు కొనసాగేందుకు మూలస్తంభంగా ఉపయోగపడుతుంది’’ అని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
అమెరికా రక్షణ మంత్రి హెగ్‌సెథ్ మాట్లాడుతూ, ‘‘భారత రక్షణ మంత్రి సింగ్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. మా ప్రధాన రక్షణ డిఫెన్స్ ఫ్రేమ్ వర్క్ సమీక్షే. ఇరుదేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకునే మార్గాలపై చర్చించాం,’’ అని పేర్కొన్నారు. ‘‘నాయకులు ఇద్దరూ 10 ఏళ్ల భారత్–అమెరికా డిఫెన్స్ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం పురోగతిని సమీక్షించారు. రక్షణ సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు’’ అని రక్షణ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. నావికాదళ సహకారాన్ని మరింత విస్తరించడం, రక్షణ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థలను సమీకృతం చేయడం ద్వారా రక్షణ రంగ సహకారాన్ని మరింత ఎక్కువ చేయడం వంటి అంశాలపై చర్చ జరిగింది,’’ అని తెలిపింది.
ఆ్రస్టేలియా ఉప ప్రధానితో సమావేశం
భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి రిచర్డ్ మార్లెస్‌తో కూడా సమావేశమయ్యారు.‘‘ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని సమీక్షించడం, ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడం వంటి అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయి. స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన ఇండో–పసిఫిక్ కోసం ఆ్రస్టేలియాతో ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది,’’ అని తెలిపారు.


