భారత వాయుసేనకు వెన్నెముకగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ యుద్ధ విమానం
విశ్లేషణ
భారతదేశ సమగ్ర సైనిక వ్యవస్థలో వాయుసేనది అత్యంత కీలకమైన పాత్ర. జాతీయ భద్రతను మరింత సమర్థంగా పరిరక్షించేందుకు వైమానిక దళానికి ఉన్న సామర్థ్యాలను, ఈ క్రమంలో ఎదుర్కొంటున్న సవాళ్లను ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పి. సింగ్ తరచూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. ఈ నెలాఖరులో ఆయన పదవీ విరమణ చేయనున్న సందర్భంగా ఇటీవలి తన వీడ్కోలు ప్రసంగాల్లోనూ ఆయన ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
పోరాట పటిమలో అద్భుతమైన ప్రతిభను రుజువు చేసుకున్న భారత వాయుసేన, సంస్థాగతంగా మాత్రం తీవ్ర కొరతలను ఎదుర్కొంటున్న మాట వాస్తవం. అత్యవసర పరిస్థితుల్లో రెండు వైపులా (పాక్, చైనా) నుంచి ఒకేసారి పోరాటం సాగించడానికి కనీసం 42 పోరాట స్క్వాడ్రన్లు అవసరం. కానీ, పాతబడిన మిగ్–21 విమానాలను తొలగించిన తర్వాత, ప్రస్తుతం వాయుసేన వద్ద కేవలం 29 నుండి 30 స్క్వాడ్రన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కొరతను అరికట్టాలంటే ఏటా కనీసం 36 నుండి 40 కొత్త యుద్ధ విమానాలను సమకూర్చుకోవాల్సి ఉందని ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ స్పష్టం చేశారు.
తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్ మార్క్–1ఎ’ సరఫరాలో జరుగుతున్న ఆలస్యాన్ని కూడా ఆయన పలుమార్లు ప్రస్తావిస్తూ వచ్చారు. వాయుసేన మొత్తం 180 తేజస్ విమానాల కొనుగోలుకు ప్రణాళిక రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా 2021 ఫిబ్రవరిలో రూ.48,000 కోట్లతో 83 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. వీటిలో మొదటి విడత విమానాలు 2024 మార్చి నాటికే అందాల్సి ఉంది. రెండో విడతగా 2025 సెప్టెంబర్‌లో రూ. 62,370 కోట్లతో మరో 97 విమానాలకు ఆర్డర్ పెట్టింది. అయితే, ఇప్పటివరకు మొదటి బ్యాచ్‌కి చెందిన ఒక్క విమానమూ అందకపోవడం గమనార్హం.
తేజస్‌కు రెక్కలున్నా ఇంజన్‌లు లేవు!
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) దాదాపు 27 ఎయిర్‌ఫ్రేమ్‌లను సిద్ధం చేసినప్పటికీ, వాటిలో అమర్చాల్సిన ఇంజన్ల కోసం నిరీక్షిస్తూ ఉంది. ఇది దేశీయ రక్షణ రంగంలో ఉన్న రెండవ బలహీనతను ఎత్తిచూపుతోంది. తేజస్ విమానాలు అమెరికాకు చెందిన ‘జిఇ ఎఫ్ 404 ఐ.ఎన్.20’ ఇంజన్లపై అమితంగా ఆధారపడుతున్నాయి. 2021 నాటి ఆర్డరుకు సంబంధించి మొదటి ఇంజన్ 2025 మార్చిలో మన దేశానికి చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన మరో నాలుగింటితో కలిపి, ‘హాల్’ వద్ద ప్రస్తుతం మొత్తం 14 ఇంజన్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరో 12 ఇంజన్లు అందుతాయని భావిస్తున్నారు.
ఇది కేవలం సరఫరా వ్యవస్థలో ఏర్పడిన సాధారణ అంతరాయం కాదు. భారత రక్షణ రంగానికి ఎదురవుతున్న తీవ్ర వ్యూహాత్మక ప్రమాదాన్ని ఇది సూచిస్తోంది. మారుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో... వాణిజ్య సుంకాలు, సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణల విషయంలో అమెరికాతో మనకున్న విభేదాలు తెలిసిందే. ఈ పరిస్థితుల్లో భారతీయ యుద్ధ విమానాలకు ఇంజన్ల కోసం ఒకే ఒక అమెరికన్ సంస్థపై ఆధారపడటం అనిశ్చితికి దారితీస్తోంది. రక్షణ ఉత్పత్తులను స్వదేశంలోనే సంయుక్తంగా తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఇది మరోసారి గుర్తుచేస్తోంది.
సంక్షోభంలో సైతం ‘సిందూర్’ విధ్వంసం
ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ ప్రధానంగా యుద్ధ విమానాల అంశాన్నే ప్రస్తావించినప్పటికీ, వాయుసేనతో పాటు భారత సైన్యం కూడా తీవ్రమైన హెలికాప్టర్ల కొరతను ఎదుర్కొంటోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన అధునాతన తేలికపాటి హెలికాప్టర్ ‘ధ్రువ్’ను సేవలకు దూరంగా పెట్టటం కూడా రక్షణ దళాలు ఎంతటి దయనీయమైన కొరతను ఎదుర్కొంటున్నాయో తేటతెల్లం చేసింది. భారత తీరరక్షక దళం ఉపయోగిస్తున్న ఒక ధ్రువ్ హెలికాప్టర్ 2025 జనవరి 5న పోర్‌బందర్ తీరం వద్ద ప్రమాదవశాత్తు కుప్పకూలింది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యగా, ముప్పై ఏళ్లకు పైగా సేవలందిస్తున్న 330కి పైగా ధ్రువ్ హెలికాప్టర్లను తనిఖీలు, మరమ్మతుల కోసం నిలిపివేశారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఉపయోగిస్తున్న వెర్ష¯Œ లకు 2025 మేలో తిరిగి ఎగిరేందుకు అనుమతి లభించింది. అయితే, నౌకాదళం, కోస్ట్ గార్డ్ ఉపయోగించే హెలికాప్టర్ల ఇంజన్లు ఉప్పు నీటి వాతావరణంలో పనిచేయాల్సి ఉంటుంది. వీటి పరిశీలనలో ‘స్వాష్ ప్లేట్’ భాగంలో బీటలు వారుతున్నట్లు అధికారులు గుర్తించారు. రోజులు గడుస్తూ 2026 లోకి అడుగుపెట్టినా, వాటి మరమ్మతులు ఇంకా పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం.
‘ఆపరేషన్ సిందూర్’ ప్రతి ఒక్కరినీ నివ్వెరపరిచిన విషయం విదితమే. ఒకవైపు అపారమైన విధ్వంసక శక్తితో, మరోవైపు అత్యంత పక్కాగా పనిచేసిన గగనతల రక్షణ వ్యవస్థలతో భారత వాయుసేన క్షణాల వ్యవధిలోనే రంగంలోకి ఎలా దిగగలిగిందో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పి. సింగ్ వివరించారు. క్షిపణి దాడుల్లో భారత సైన్యానికి చెందిన శతఘ్ని (ఆర్టిలరీ) అస్త్రాలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఈ ‘సమిష్టి జాతీయ వాయు శక్తి’ కేవలం వాయుసేన పోరాట స్క్వాడ్రన్ల సంఖ్యే కాకుండా, అన్ని రంగాల సమిష్టి ఆధిపత్యం నేడు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలంటే సమాంతరంగా కొన్ని ప్రక్రియలను వేగవంతం చేయాల్సి ఉంది. తేజస్ మార్క్–1ఎ విమానాల సమీకరణ త్వరితగతిన జరగాలి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏడాదికి కనీసం 20 నుండి 24 విమానాలను అందించే స్థాయికి ఎదగాలి. మానవరహిత పోరాట వైమానిక వాహనాలను, సెకండరీ విమాన పైలట్లను నిరంతరం సిద్ధంగా ఉంచుకోవాలి. తేలికపాటి హెలికాప్టర్ల వినియోగాన్ని వేగవంతం చేయడంతో పాటు, మధ్యతరహా హెలికాప్టర్లను లీజుకు తీసుకోవడం లేదా అత్యవసర ప్రాతిపదికన కొనుగోలు చేయడం ద్వారా కొరతను తీర్చాలి.
వాయుసేన అప్రమత్తం... సాంకేతికతే సందిగ్ధం
వచ్చే మూడు దశాబ్దాల్లో (కనీసం 2056 వరకు) భారతదేశానికి ఎలాంటి ఏరోస్పేస్ సామర్థ్యాలు అవసరమో నిర్ణయించుకోవడం ఒక పెద్ద వ్యూహాత్మక సవాలు. ఏరోస్పేస్ రంగాన్ని సాంకేతికత శాసిస్తోంది. ఆ సాంకేతికతలో వస్తున్న మార్పుల వేగం విధాన నిర్ణేతలను సైతం నిర్ఘాంతపరుస్తోంది. ఈ క్రమంలోనే ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ వీడ్కోలు ప్రసంగం భరోసానిస్తూనే, మరోవైపు రక్షణ రంగానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వాయుసేన నిరంతరం అప్రమత్తంగా, యుద్ధానికి సిద్ధంగా ఉంది. కానీ సాంకేతికతను సమకూర్చుకోవడంలో జరిగే జాప్యం మొత్తం సైనిక ప్రయోజనాన్నే దెబ్బతీస్తుంది.
సాంకేతిక జాప్యాన్ని అరికట్టాలంటే ముందుగా యుద్ధ విమానాల ఇంజన్ల సరఫరా సమస్యను పరిష్కరించుకోవాలి. హెలికాప్టర్ల రికవరీ ప్రణాళికలకు తగినంత నిధులు కేటాయించాలి. క్షీణిస్తున్న రూపాయి విలువకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించాలి. డ్రోన్లు, స్వయంప్రతిపత్తి కలిగిన వ్యవస్థలకు భారీ బడ్జెట్ మద్దతునివ్వాలి. మారుతున్న కాలానికి తగినట్లుగా వాయుసేన సరైన రూపంలో ఉందా? దానికి పరిమితంగా ఉన్న నిధులను ప్రభుత్వం సమర్థంగా కేటాయించగలదా? అన్నదే ఇప్పటికీ మిగిలి ఉన్న అసలైన ప్రశ్న. 
- సి. ఉదయ్ భాస్కర్, వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ
ఇదీ చదవండి: ‘నోబెల్ శాంతి’కి సరైన ఎంపిక


