నిరుడు మాదిరిగానే ఈసారి కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎంతగా అర్రులు చాచినా నోబెల్ శాంతి బహుమతి ఆయనకు దక్కలేదు. భారతీయ మూలాలున్న దక్షిణాఫ్రికా న్యాయవేత్త, మానవహక్కుల ఉద్యమకారిణి నవనీతం పిళ్లేను శాంతి పురస్కారానికి ఎంపిక చేశామని నోబెల్ కమిటీ శుక్రవారం చేసిన ప్రకటనను ప్రపంచవ్యాప్త మానవహక్కుల ప్రియులు హర్షించారు.
కండబలం ఉన్నదనీ, ప్రపంచ దేశాలను దోచుకొచ్చి పోగేసిన అపార సంపద, ఆయుధ సంపత్తి సొంతమని విర్రవీగి బడుగు దేశాలపై దండెత్తే దుర్నీతి రాజ్యమేలుతున్న కాలంలో మానవహక్కుల కోసం నిలబడి హంతకుల్ని వేలెత్తి చూపగల చేవ, సాహసం ప్రదర్శించేవారు నిస్సందేహంగా మహోన్నతులు. నవనీతం ఆ కోవకు చెందిన అరుదైన మహిళ. గాజాలో మూడేళ్లుగా మారణహోమం సృష్టిస్తూ, వేలాదిమంది మరణానికి, లక్షలాదిమంది క్షతగాత్రులు కావటానికి కారణమైన ఇజ్రాయెల్ ముసుగు తొలగించిన ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్‌కు 2025లో ఆమె నేతృత్వం వహించారు.
మహాకవి శ్రీశ్రీ ‘కవితా... ఓ కవితా!’ ఖండికలోని అపురూప ప్రయోగం ‘అగ్ని సరస్సున వికసించిన వజ్రం’ విశేషణానికి నవనీతం సరిగ్గా సరిపోతారు. తన బతుకంతా పోరాటమే ఊపిరిగా శ్వాసించిన ఆమె...బాల్యంలో దుర్భరదారిద్య్రాన్ని చవి చూశారంటే... విద్యార్థినిగానే దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వాన్ని ధిక్కరించారంటే చిన్న విషయం కాదు. 70వ దశకంలో భర్త గాబీ పిళ్లేతోసహా వందలమందిని అప్పటి పాలకులు ఉగ్రవాద చట్టం కింద నిర్బంధిస్తే వారి విడుదలకు చట్టబద్ధంగా పోరాడి ఆమె తొలి విజయాన్నందుకున్నారు.
నాటల్‌లో 1967లో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన తొలి మహిళ ఆమెనే. అటుపై దేశంలోనూ, అంతర్జాతీయంగానూ ఎన్నో ప్రాముఖ్యతగల ట్రైబ్యునళ్లకు సారథ్యంవహించి అసహాయులకు స్వరమై నిలిచారు. మహిళలపై సాగే లైంగిక హింసను నరమేధంగా పరిగణించాలని 1998లో చరిత్రాత్మక తీర్పునిచ్చిన ధర్మాసనంలో ఆమె ఉన్నారు. హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు 2003నుంచి అయిదేళ్లపాటు పనిచేశారు. ఆ తర్వాత సమితి మానవహక్కుల హైకమిషనర్‌గా పనిచేశారు.
ఇతర పురస్కారాల మాటెలావున్నా శాంతి బహుమతి ఎంపిక విషయంలో వ్యవహరించే తీరుపై ఎప్పటినుంచో ఫిర్యాదులున్నాయి. 1919లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌కూ, 1973లో అప్పటి అమెరికా విదేశాంగమంత్రి హెన్రీ కిసింజర్‌కూ, 2002లో మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కూ, 2009లో ఒబామాకూ బహుమతులెలా ఇచ్చారో ఎవరికీ తెలియదు. నానాజాతి సమితిలో ప్రధాన పాత్ర పోషించినందుకు ఉడ్రో విల్సన్‌కు శాంతి బహుమతినిచ్చినా... అమెరికా ఆ సమితిలో చేరిందిలేదు. చిలీలో సైనిక కుట్రకు ప్రణాళిక రచించి, వియత్నాం యుద్ధాన్ని కొనసాగించి, కాంబోడియాపై బాంబులు కురిపించిన కిసింజర్‌కి ఇచ్చినప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది.
అఫ్గానిస్తాన్ ముజాహిదీన్లకు ఆయుధాలిచ్చి ఉగ్రవాదానికి బీజం వేసినవారు కార్టర్. శాంతి పురస్కారం ఇచ్చేనాటికి ఒబామా అధికారంలోకి వచ్చి ఎన్నాళ్లో కాలేదు. కనీసం అందుకైనా ఆయన శాంతి కోసం పాటుపడకపోగా, బుష్ మొదలెట్టిన యుద్ధాలను మరింత తీవ్రం చేశారు. ‘అది ఎందుకిచ్చారో నాకే అర్థంకాలేద’ని అనంతరకాలంలో ఒబామా చెప్పారు. ‘ఒబామాకున్న అర్హత ఆయన బుష్ కాకపోవటమే’ అని చాలామంది అప్పట్లోనే ఎగతాళిగా అన్నారు.
పిళ్లేకు పురస్కారం ఇవ్వటం ద్వారా నోబెల్ కమిటీ తన పాత పాపాలను కడిగేసుకుంది. ఆ బహుమతికి అర్రులుచాచిన ట్రంప్... విజేత నవనీతం రెండు విరుద్ధ భావజాలాలకూ, ఆచరణలకూ ప్రాతినిధ్యంవహిస్తారు. అంతర్జాతీయ వ్యవస్థల్ని ఖాతరుచేయని వ్యక్తి ట్రంప్ అయితే... వాటి వైశిష్ట్యాన్ని చాటినవారు పిళ్లే. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ట్రంప్ వ్యతిరేకిస్తే... నవనీతం దానికి సారథి. ఇజ్రాయెల్‌కు ట్రంప్ అండదండలందిస్తే... నవనీతం అందులోని హంతక స్వభావాన్ని బయటపెట్టారు. ట్రంప్‌ను నోబెల్‌కు సిఫార్సు చేసిన పాక్ తదితర దేశాలు ‘ఆయన బలంద్వారా శాంతిని సాధించార’ని ప్రస్తుతిస్తే... నవనీతం జీవితమంతా బలహీనులకు స్వరమై నిలిచారు. మొత్తానికి నోబెల్ శాంతి కమిటీ ఈసారి తనను తాను గౌరవించుకుంది!
ఇదీ చదవండి: సవాళ్ల నడుమ భారత వాయుసేన


