తాత్వికథ
ఒక పట్టణంలోని పెద్ద జంక్షన్ వద్ద పెద్ద పుస్తకాల అంగడి ఉంది. అందులో అన్ని రకాల పుస్తకాలూ దొరుకుతాయి. అంగడి యజమానే స్వయంగా దాన్ని నడుపుతాడు. ఆ యజమానికి ప్రత్యేక లక్షణం ఒకటి ఉంది. అది ఏమిటంటే, ఏ రచయిత అయినా ఆధ్యాత్మిక పుస్తకాలు ప్రచురిస్తే వంద పుస్తకాలను సగం ధరకు కొంటాడు.
ఓ రోజు బొంబాయిలో స్థిరపడిన తన చిన్ననాటి స్నేహితుడు అంగడికి వచ్చాడు. కట్టలుకట్టలుగా పేరుకుపోయి ఉన్న ఆధ్యాత్మిక పుస్తకాలను చూసి ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో ఒక ఆధ్యాత్మిక పుస్తక రచయిత అక్కడికి వచ్చాడు. అతడి దగ్గర ఉన్న పుస్తకాలను అంగడి యజమాని కొన్నాడు. వంద నెయ్యి దీపాల వెలుగు ముఖంతో రచయిత అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
‘‘అమ్ముడుకాక పుస్తకాలు అంగడిలో దండిగా ఉన్నాయి, ఇంకా కొనడం ఎందుకు? అవి అమ్ముడు పోకపోతే నీకు నష్టం కదా’’ అని అడిగాడు బొంబాయి మిత్రుడు. అంగడి యజమాని మిత్రుడి కళ్ళలోకి చూస్తూ, ‘‘నేను వారి దగ్గర పుస్తకాలు కొంటున్నది లాభాల కోసం కాదు, ఆ రచయితలను ప్రోత్సహించడం కోసం’’ అని బదులిచ్చాడు. ‘ఆ...‘ అని నోరు తెరిచాడు బొంబాయి మిత్రుడు.
‘‘మనలాంటి వారు ఇలాంటి మంచి పుస్తకాలను కొనడం మానేస్తే వారు చిన్నచిన్నగా ప్రచురించడం మానేస్తారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, హిందూమత ఘన వైభవం, గత చరిత్రలు వెలుగులోకి రాకుండా పోతాయి. సమాజంలో శాంతి, భద్రత, సుఖసంతోషాలు వెల్లివిరియాలంటే అందరిలోనూ ఆధ్యాత్మిక భావజాలం పెంపొందాలి. అందుకు ఈ పుస్తకాలు ఎంతగానో దోహదం చేస్తాయి. రామసేతు నిర్మాణానికి వానర సహాయంలా నావంతు సహాయం సమాజానికి అందించాలని నేనీ పని చేస్తున్నాను’’ అని చెప్పాడు యజమాని.
మరి ఇప్పటికే పేరుకుపోయి ఉన్న పుస్తకాల పరిస్థితి ఏమిటని అడిగాడు బొంబాయి మిత్రుడు. మహాశివరాత్రికి ఈ పట్టణంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అక్కడికి వచ్చి సేవలందించే సేవకులకు ఉచితంగా పంచిపెడతానన్నాడు యజమాని.
మరి నీకు లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నించాడు బొంబాయి మిత్రుడు.
‘‘నేను ఒక్క ఆధ్యాత్మిక పుస్తకాలే అమ్మడం లేదు కదా, మిగిలిన వాటిలో వచ్చే ఆదాయం నా కుటుంబ పోషణకు సరిపోతుంది’’ అని నవ్వుతూ బదులిచ్చాడు అంగడి యజమాని. అతడి మాటలు విన్న బొంబాయి మిత్రుడి కళ్ళు చెమర్చాయి.‘కేవలం ధనార్జనే ధ్యేయంగా మారిన ఈ రోజుల్లో, లాభనష్టాలను పక్కనబెట్టి సంస్కృతి పరిరక్షణకు, తోటి రచయితలకు ఆసరాగా నిలుస్తున్న నీది ఎంతటి విశాల హృదయమో!‘ అని స్నేహితుడిని అభినందించి అక్కడినుంచి కదిలాడు.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు


