జ్యోతిర్మయం
క్రోధం రాక్షస లక్షణం. మనుషులలో కూడా దీని విజృంభణను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. రాక్షస లక్షణాలు ప్రదర్శించే సమయాల్లో మనుషులూ రాక్షసులే అయిపోతారు. దంభం, దర్పం, అజ్ఞానం, పారుష్యం మొదలైన అవలక్షణాలతో పాటు, క్రోధాన్ని కూడా ‘అసురీ’ లక్షణాలలో ఒకటిగా భగవద్గీత పరిగణిస్తుంది. క్రోధం ఒక నిరుప యోగమైన భావోద్రేకం.
క్రోధవశం కాకుండా, పైకి మాత్రం క్రోధాన్ని ప్రదర్శించటం ఎప్పుడయినా ఒకసారి ఉపకరించచ్చు. కానీ నిజంగా క్రోధావేశంలో పడిపోవటం వల్ల ఎప్పటికీ ఏ లాభమూ ఉండదు. అంతా నష్టమే. క్షణికంగా పొంగి వచ్చే క్రోధమే ఎంతో హాని కలిగించగలదు. ఇక దీర్ఘకాలం మనసులో నిలిచి, ప్రజ్వరిల్లుతూ ఉండే క్రోధం సంగతి చెప్పాలా? క్రోధాగ్ని బుద్ధినీ, విచక్షణనూ దగ్ధం చేసి, మనిషిని పశుత్వం వైపు దిగజారుస్తుంది.
ఎప్పుడయినా ఒక బలహీన క్షణంలో ఏ కారణం వల్లనయినా అంతరంగంలో క్రోధం పుట్టుకొస్తే, వివేకవంతులు వెంటనే దాన్ని చల్లార్చుకొని తమను తాము రక్షించుకొంటారు. ఆ క్రోధాగ్నికి ఆజ్యం జోడిస్తూ, నిరంతర చింతనతో దాన్ని మరింత పెంచి, పోషించి, ప్రజ్వరిల్లజేస్తూ పోవటం, ఆత్మ శ్రేయాన్ని విస్మరించిన అమాయికత్వం. ఆత్మ వినాశ నానికి అది అడ్డదారి. ‘నీలాంటి పండితులూ, ధర్మ విశారదులూ, సకల శాస్త్ర విదులూ కూడా క్రోధానికి బానిస లౌతున్నారంటే, నీ శాస్త్ర పాండిత్యమంతా నిరర్థకమైన, శ్రమదండుగ వ్యవహారమే, అయిపోయినట్టు!
– గృహ్యతే యది రోషేణ త్వాదృశోపి విపశ్చితః, తతః
శాస్త్ర విపశ్చిత్వం శ్రమ ఏవ హి కేవలమ్
అని విభీషణుడు రావణుడిని హెచ్చరించటం సుభాషిత భాండాగారమైన సుందర కాండలో కనిపిస్తుంది. సందర్భం, శ్రీరామ దూతగా వచ్చిన ఆంజ నేయుడిని వధించాలని ఆవేశపడుతున్న అన్నకు, అది తగని పని అని తమ్ముడు హితవు చెప్పే ఘట్టం.
‘క్రోధం కలగనే కూడదు. కలిగితే దాన్ని వెంటనే తుంచి వేసుకోవాలి, దాన్ని బహుకాలం మన సులో ఉంచుకొని రక్షించేవాడిని అ అగ్గి బుగ్గి చేస్తుంది. ఇది నేర్వనివాడు ఎన్ని విద్యలు ఎంత గొప్పగా నేర్చినా వివేక శూన్యుడే, వికాస హీనుడే’ అని విభీషణుడి మతం. శాంతము లేక సౌఖ్యము లేదు. అభ్యుదయం లేదు. ఆధ్యాత్మిక ప్రగతి అసలే లేదు.
– ఎం. మారుతి శాస్త్రి


