మాంసంతో పోలిస్తే మొక్కల ఆధారిత మాంస ప్రత్యామ్నాయాలు శరీరానికి ప్రోటీన్‌ను మరింత సమర్థవంతంగా అందిస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ’, ‘గుడ్ ఫుడ్ ఇనిస్టిట్యూట్ ఇండియా’ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ పరిశోధనను నిర్వహించాయి. మొక్కలతో తయారు చేసిన కబాబ్‌లు మాంసం రుచి, ఆకృతి విషయంలో పూర్తిస్థాయిలో పోటీ పడలేకపోయినప్పటికీ, వాటిలోని ప్రోటీన్‌ను శరీరం గ్రహించే సామర్థ్యం మాత్రం చాలా ఎక్కువగా ఉంటున్నట్లు అధ్యయన పరిశోధకులు కనుగొన్నారు.
ప్రోటీన్ గ్రహింపు శాతం
పరీక్షించిన మూడు రకాల ఆహార పదార్థాల్లోనూ చికెన్ ఉత్పత్తుల కంటే మొక్కల ఆధారిత ప్రత్యామ్నాయాల నుంచే శరీరం ఎక్కువ శాతంలో ప్రోటీన్‌ను గ్రహించినట్లు ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. మొక్కల ఆధారిత బర్గర్ ప్యాటీల నుంచి శరీరం 80.8 శాతం ప్రోటీన్‌ను గ్రహించగా, చికెన్ బర్గర్ ప్యాటీల నుంచి కేవలం 38.8 శాతం మాత్రమే దేహానికి అందుతోంది. అలాగే మొక్కల ఆధారిత నగ్గెట్స్ నుంచి 61.2 శాతం ప్రోటీన్ లభిస్తుండగా, చికెన్ నగ్గెట్స్ నుంచి 43.4 శాతం గ్రహింపు నమోదైంది. మొక్కల ఆధారిత సీక్ కబాబ్‌ల విషయానికి వస్తే 57 శాతం ప్రోటీన్ శరీరానికి అందుతుండగా, చికెన్ సీక్ కబాబ్‌ల నుంచి కేవలం 21.2 శాతం మాత్రమే శరీరానికి చేరుతోందని ఈ పరిశోధన స్పష్టం చేసింది.
భవిష్యత్తులో కీలకమైన పాత్ర
ఈ పరిశోధన ఫలితాలు, శాకాహారులకు తమ ఆహారం ద్వారా మెరుగైన ప్రోటీన్ పొందేందుకు కొత్త అవకాశాలను అందిస్తున్నాయి. పర్యావరణహితమైన మొక్కల ఆధారిత మాంస ప్రత్యామ్నాయాలు భవిష్యత్తు ఆహార రంగంలో చాలా కీలకపాత్ర పోషించవచ్చని భావిస్తున్నారు. అయితే మొక్కల ఆధారిత ఆహారాలు ఎక్కువ ప్రోటీన్‌ను అందుబాటులోకి తెచ్చినంత మాత్రాన, అవి అన్ని విధాలా చికెన్ కంటే ఆరోగ్యకరమైనవని నిర్ధారించలేమని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆహారంలోని కొవ్వులు, ఉప్పు, ఇతర పోషకాలు కూడా మానవ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.
ఇదీ చదవండి: మాంసం తినండి.. పర్యావరణాన్ని కాపాడండి
ఆశాజనకంగా పరిశోధనలు
ప్రస్తుతానికి ఈ పరిశోధన ఫలితాలు ఒక శాస్త్రీయ సమావేశంలో మాత్రమే వెల్లడయ్యాయి. ఇవి ఇంకా పీర్–రివ్యూ (ఇతర స్వతంత్ర నిపుణుల పరిశీలన) చేసిన అధికారిక శాస్త్రీయ జర్నల్‌లో ప్రచురణ కాలేదు. పరిశోధకులు ఈ ఫలితాలను మరింత పక్కాగా నిర్ధారించడానికి తదుపరి దశలో మరిన్ని సమగ్ర పరీక్షలు నిర్వహించనున్నారు. ఏది ఏమైనప్పటికీ, మొక్కల ఆధారిత మాంస ప్రత్యామ్నాయాలు శరీరానికి ప్రోటీన్‌ను అందించే విషయంలో చాలా ఆశాజనకంగా ఉన్నాయని ఈ అధ్యయనం సూచిస్తోంది. అయితే వీటి పూర్తి స్థాయి ఆరోగ్య ప్రయోజనాలను స్పష్టంగా తెలుసుకోవడానికి భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు అవసరం కానున్నాయి.
సాక్షి స్పెషల్ డెస్క్


