ప్రోటీన్ కోసం పాల ఉత్పత్తులకే ప్రాధాన్యం
రెండో స్థానంలో చిరుధాన్యాలు
మూడు, నాలుగు స్థానాల్లో చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు
ప్రోటీన్ ఆహారం కోసం భారతీయుల ఎంపిక
50 ఏళ్లలో మూడు రెట్లు పెరగనున్న ప్రోటీన్ ఆహార వినియోగం
ఆసియా రీసెర్చ్–ఎంగేజ్‌మెంట్ నివేదిక
‘తిండి కలిగితే.. కండ కలదోయ్. కండ కలవాడే మనిషోయ్’ అని వందేళ్లకు పూర్వమే చెప్పారు గురజాడ అప్పారావు. ఇప్పుడు ఆ మాటలో మార్పొచ్చింది. ‘తిండి తింటే కండ రాదోయ్.. ప్రోటీన్ తింటేనే కండలోయ్’ అంటోంది నేటి తరం. ఈ నేపథ్యంలోనే ప్రోటీన్‌తో కూడిన ఆహారంపై దృష్టి పెడుతోంది. ఇందుకు వివిధ ఎంపికలు చేసుకుంటోంది. ప్రోటీన్ ఆహారాలపై ‘ఆసియా రీసెర్చ్–ఎంగేజ్‌మెంట్’ అధ్యయనం ఏం చెబుతోందంటే..
సాక్షి, అమరావతి: ప్రోటీన్లతో కూడిన బలవర్ధక ఆహారం కోసం భారతీయుల మొదటి ఎంపిక పాల ఉత్పత్తులే. తరువాత స్థానాల్లో చిరు ధాన్యాలు, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు ఉన్నాయి. రానున్న కాలంలో భారత్‌లో ప్రోటీన్లతో కూడిన ఆహార ఉత్పత్తుల వినియోగం భారీగా పెరగనుందని సింగపూర్‌కు చెందిన ఆసియా రీసెర్చ్–ఎంగేజ్‌మెంట్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఫిక్కి)తో కలసి ఆ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు నివేదించింది. తలసరి ప్రోటీన్లతో కూడిన ఆహార వినియోగం 2070 నాటికి మూడు రెట్లు పెరుగుతుందని తెలిపింది. దేశంలో జనాభా పెరుగుదలతోపాటు ప్రజల తలసరి, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెరుగుతుండటమే అందుకు కారణమని పేర్కొంది.
నివేదికలోని ప్రధాన అంశాలివీ
⇒ ప్రస్తుతం దేశంలో ప్రోటీన్లతో కూడిన తలసరి ఆహార వినియోగం ఏడాదికి 9.5 కేజీలుగా ఉంది. 2070 నాటికి ఆ వినియోగం 30 కేజీలకు పెరుగుతుంది. ప్రోటీన్లతో కూడిన ఆహారం కోసం భారతీయులు అత్యధికంగా పాల ఉత్పత్తులపైనే ఆధారపడుతున్నారు.
⇒ 2025లో దేశంలో పాల ఉత్పత్తుల వినియోగం ఏడాదికి 5 మిలియన్ టన్నులుగా ఉంది. 2070 నాటికి ఆ వినియోగం 13.3 మిలియన్ టన్నులకు పెరుగుతుంది.
⇒ పాల ఉత్పత్తుల తలసరి వినియోగం ఏడాదికి 3.5 కేజీల నుంచి 2070 నాటికి 13.1 కేజీలకు పెరుగుతుంది.
⇒ రెండో స్థానంలో చిరు ధాన్యాలున్నాయి. 2025లో చిరుధాన్యాల తలసరి వినియోగం ఏడాదికి 2.61 కేజీలు ఉండగా.. 2070 నాటికి 9.12 కేజీలకు పెరుగుతుంది.
⇒ చేపలు, ఇతర మత్స్య ఆహార వినియోగం ఐదు రెట్లు పెరగనుంది. 2025లో దేశంలో చేపలు, ఇతర మత్స్య ఆహారం వినియోగం ఏడాదికి 0.6 మిలియన్ టన్నులు ఉండగా.. 2070నాటికి 2.9 మిలియన్ టన్నులకు పెరుగుతుంది.
⇒ 2025లో తలసరి చేపలు, మత్స్య ఆహారం వినియోగం ఏడాదికి 6.2 కేజీలు ఉండగా.. 2070 నాటికి 19.5 కేజీలకు పెరుగుతుంది.
⇒ ప్రోటీన్‌తో కూడిన ఆహారం కోసం భారతీయుల తరువాత ఎంపిక గుడ్లు, చికెన్. 2070 నాటికి దేశంలో గుడ్ల వినియోగం 25.7 మిలియన్ టన్నులకు, చికెన్ వినియోగం 16.2 మిలియన్ టన్నులకు చేరుతుంది.
⇒ 2025లో గుడ్ల తలసరి వినియోగం ఏడాదికి 6 కేజీలు ఉండగా.. 2070 నాటికి 17 కేజీలకు పెరుగుతుంది.
⇒ చికెన్ తలసరి వినియోగం ఏడాదికి 6.50 కేజీల నుంచి 2070 నాటికి 15 కేజీలకు చేరుకుంటుంది.
⇒ ప్రోటీన్ ఆహారం కోసం భారతీయుల ప్రాధాన్య జాబితాలో తరువాత స్థానాల్లో పోర్క్ (పంది మాంసం), మటన్, బీఫ్ ఉన్నాయి.


