513 మండలాల్లో కరువు ఛాయలు
ఇందులో 268 చోట్ల తీవ్రంగా.. 245 చోట్ల మోస్తరుగా..
వచ్చే నెల 1న కరువు మండలాల ప్రకటన
వర్షాభావ పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నాలుగింట మూడొంతుల ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుపోయింది. మొత్తం 663 గ్రామీణ మండలాలకుగాను ఏకంగా 78 శాతం మండలాలు అంటే.. 513 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నాయి. వర్షాభావ పరిస్థితులపై సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఏపీలోని 28 జిల్లాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం 513 మండలాల్లో కరువు నెలకొందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
వీటిలో 268 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా, 245 మండలాల్లో మోస్తరుగా ఉందన్నారు. కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలనను వ్యవసాయ శాఖ చేపడుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో క్షేత్రస్థాయి బృందాలు పంట నష్టం, దిగుబడి నష్టాన్ని పరిశీలిస్తాయని, అనంతరం వ్యవసాయ శాఖ క్షేత్ర పరిశీలన నివేదికను జిల్లా కలెక్టర్లకు సమర్పిస్తుందని అధికారులు చెప్పారు. కరువు ప్రతిపాదనలను రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖకు కలెక్టర్లు సమర్పించాల్సి ఉంటుందన్నారు. దీనికి సెపె్టంబర్ 24 చివరి తేదీగా నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనలను సెపె్టంబర్ 29న రాష్ట్రస్థాయి కమిటీ సమావేశంలో పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.
అక్టోబర్ 1న కరువు మండలాలు ప్రకటించండి..
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై ప్రతీనెలా కేంద్రానికి నివేదికలు పంపించాలని ఆయన సూచించారు.
ఉద్యాన పంటలపై ప్రభావం..
ఉద్యాన పంటలు కాపాడటానికి ఇప్పటికే రూ.190 కోట్లు కేటాయించామని, వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సమీక్షలో సీఎం చెప్పారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 1,357 రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న పంటలు హైరిస్క్ కేటగిరీలో ఉన్నాయని అధికారులు తెలిపారు. వర్షాభావంతో 17,916 హెక్టార్లలోని నారింజ, బత్తాయి, మామిడి, ఎర్ర మిరప, ఉల్లి, కూరగాయల పంటలు ప్రభావితం కానున్నాయని తెలిపారు.
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు..
ఇక రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ప్రజలు ఇబ్బందిపడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. తాగునీటికి బోర్లపైన ఆధారపడే ప్రాంతాలకు అవసరమైతే అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేలా చూడాలన్నారు. విశాఖలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటినుంచే కార్యాచరణ చేపట్టాలన్నారు. విశాఖ సమీపంలోని రిజర్వాయర్లు నింపేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టే అవకాశాలను పరిశీలించాలన్నారు. మేఘాద్రిగడ్డకు పోలవరం ఎల్‌ఎంసీ నుంచి ప్యాకేజీ–8 కింద పైపులైన్ ద్వారా నీటిని తరలించే పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.


