సైబర్‌ ‘క్రైం’కర్యం | Massive Fraud in the Name of Trading: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సైబర్‌ ‘క్రైం’కర్యం

Sep 20 2026 4:55 AM | Updated on Sep 20 2026 4:55 AM

Massive Fraud in the Name of Trading: Andhra Pradesh

ట్రేడింగ్‌ పేరుతో ఘరానా మోసం

క్యూవీఎస్‌ఈ, బోన్‌చాట్‌ ఆన్‌లైన్‌ యాప్‌లతో కుచ్చుటోపీ

చైన్‌ లింక్‌ సిస్టమ్‌తో భారీగా పెట్టుబడులు పెట్టించిన సైబర్‌ నేరగాళ్లు

బాధితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులే అధికం

ఎన్టీఆర్‌ జిల్లాలో 10 వేల మంది నుంచి రూ.100 కోట్లకు పైగా వసూలు 

పరువుపోతుందేమోనని ఫిర్యాదుకు  వెనకాడుతున్న బాధితులు

జి.కొండూరు: ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఘ­రానా మోసానికి తెగబడ్డారు. ఒక్క ఎన్టీఆర్‌ జిల్లాలో­నే రూ.వంద కోట్లు కైంకర్యం చేశారు. ఈ విష­యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇటీవల కాకినాడ, తుని ప్రాంతాల్లో క్యూవీఎస్‌­ఈ, బోన్‌చాట్‌ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌ల బాగోతం బయటపడిన విషయం విదితమే. ఈ యాప్‌లకు ఎన్టీఆర్‌ జిల్లా వాసులూ బలయ్యారు. ఈ యాప్‌లలో ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన పది వేల మంది రూ.­100 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం.

మోసం జరిగిందిలా.. 
సైబర్‌ నేరగాళ్లు మొదట క్యూవీఎస్‌ఈ, బోన్‌చాట్‌ పేరుతో యాప్‌లను సృష్టించి కొందరు ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. పెట్టుబడి మార్గాల పేరిట అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ యాప్‌లలో ట్రేడింగ్‌ చేయాలంటే మొదట ఒక వ్యక్తి కనీసం రూ.50 వేలు క్యూవీఎస్‌ఈ యాప్‌లో పెట్టుబడి పెట్టాలని షరతు విధించారు. ఆ మొత్తానికి 500 అమెరికన్‌ డాలర్లు జమ చేసినట్టు యాప్‌ ఖాతాలో చూపించారు. అదనంగా మ­రో 50 డాలర్లు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు కవర్‌ చేశా­రు.

ఆ తర్వాత ఈ యాప్‌లో చేరిన ప్రతి ఒక్కరినీ బోన్‌చాట్‌ అనే మరో యాప్‌లో చేర్చారు. అక్కడ ట్రేడింగ్‌ చేసినట్టు చూపి ఐదు, ఎని­మి­ది డాలర్లు పెట్టుబడిదారుల ఖాతాలో జమైనట్టు చూపి.. ఇలా రోజూ చేస్తే 550 డాలర్లు కాగానే విత్‌డ్రా చేసుకోవచ్చని ఆశ చూపారు. రోజూ రూ.50వేల నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చని దానిని బట్టి ఆదాయం పెరుగుతుందని నమ్మబలికారు. అంతేగాక ఇంకా ఎవరినైనా చేరిస్తే అదనంగా 10 డాలర్లు ఇస్తామని నమ్మించారు. ఆ తర్వాత అందినంత గుంజుకుని ఆ తర్వాత విత్‌­డ్రా ఆప్షన్‌ను ఆపేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు.  

ప్రభుత్వ ఉద్యోగులే అధికం 
కాకినాడ, తుని ప్రాంతాలతోపాటు తెలంగాణా­లోనూ ఈ యాప్‌ బాగోతం బట్టబయలు కావడంతో ఎన్టీఆర్‌ జిల్లా, ఇబ్రహీంపట్నం మండల పరిధి కొండపల్లికి చెందిన ఉద్యోగి సాయి ఈ నెల 14వ తేదీన సీసీఎస్‌ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు క్యూవీఎస్‌ఈ యాప్‌ వల్లన మోస­పోయామంటూ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడంతో బాధితులు వేల సంఖ్యలో ఉన్నట్లు చర్చ మొదలైంది. ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, విజయవాడ­కు చెందిన వీటీపీఎస్, రైల్వే, ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులే ఈ యాప్‌లలో అధి­కంగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.

డ్వాక్రా సంఘాల మహిళలు, చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు కూడా బంగారు నగలను తనఖాపెట్టి మరీ వీటిల్లో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. చాలామంది మోసపోయామని తెలిస్తే పరువుపోతుందని ఫిర్యాదు చేసేందుకూ వెనుకాడుతున్నారు. యాప్‌ల బాగోతంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇంత జరిగినా సైబర్‌ నేరగాళ్లు తమ ఆగడాలను ఆపలేదు. తమ యాప్‌లపై దుష్ప్రచారం వల్ల కార్యకలాపాలు స్తంభించాయని, అయినా మళ్లీ పెట్టుబడి పెట్టి ట్రేడింగ్‌ కొనసాగించాలని, పాత డబ్బులతోపాటు కొత్తగా భారీ రాబడులు చూపిస్తామని వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా బాధితులను నమ్మబలుకుతున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement