ప్రపంచ మాంసం ఉత్పత్తిలో కోళ్లు,పందులదే 74 శాతం వాటా
తక్కువ స్థలంలో, కొద్ది రోజుల్లోనే కోతకు వస్తుండటంతో వీటి పెంపకంపైనే రైతుల మొగ్గు
ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నివేదిక వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు పచ్చిక బయళ్లలో మేసే పెద్ద పశువులపై ఆధారపడిన మాంసం ఉత్పత్తి రంగం, ఇప్పుడు వేగంగా చికెన్, పందులు వంటి (ఒకే జీర్ణాశయం కలిగిన మోనోగ్యాస్ట్రిక్) చిన్న జీవుల వైపు మళ్లింది. ప్రపంచ వార్షిక మాంసం ఉత్పత్తిలో ఏకంగా 74 శాతం వాటా కోళ్లు, పందులు, టర్కీ కోళ్లు, బాతుల నుంచే లభిస్తోందని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) తాజా నివేదికలో వెల్లడించింది. ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేక లు వంటి నెమరువేసే జంతువుల వాటా కేవలం 26 శాతానికే పరిమితమైందని స్పష్టం చేసింది. పశుపోషణ రంగం ప్రపంచ వ్యవసాయ స్థూల ఉత్పత్తిలో 40% వాటాను కలిగి ఉంది. ఇది సుమారుగా 1.8లక్షల కోట్ల డాలర్లకు సమానం.
ఎందుకీ అనూహ్య మార్పు?
ప్రపంచవ్యాప్తంగా భూమి లభ్యత తగ్గటం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కొరత, వేగంగా మారుతున్న ఆర్థిక సమీకరణాలు ఈ మార్పునకు ప్రధాన కారణాలని ఎఫ్‌ఏఓ విశ్లేషించింది. పెద్ద జంతువులను మాంసం కోసం పెంచాలంటే విస్తారమైన పచి్చక బయళ్లు, స్థలం అవసరం. కానీ పౌల్ట్రీ రంగం విస్తరణకు చాలా తక్కువ భూమి సరిపోతుంది. అడవుల విస్తీర్ణం తగ్గకుండా చూడాల్సిన అవసరం రీత్యా ఈ మార్పు అత్యంత కీలకమైన అంశంగా మారింది.
కోళ్లు తక్కువ దాణాను తిని, అత్యంత వేగంగా బరువు పెరుగుతాయి. దీనివల్ల ఉత్పత్తి వ్యయం తగ్గటమే కాకుండా తక్కువ సమయంలో దిగుబడి చేతికొస్తుంది. గ్రామాల్లో వ్యవసాయ కారి్మకుల లభ్యత ప్రపంచవ్యాప్తంగా తగ్గుతోంది. దీంతో, తక్కువ మందితో సులభంగా నిర్వహించగల బ్రాయిలర్ కోళ్ల పెంపకం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. మటన్‌తో పోలిస్తే చికెన్ ధరలు మధ్యతరగతి, పేద వర్గాలకు అందుబాటులో ఉండటం ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగాన్ని విపరీతంగా పెంచింది.
పర్యావరణ అనుకూలత
మానవ కారక ఉద్గారాలలో పశుసంవర్థక రంగం వాటా 12 శాతం ఉంది. ఇందులో అత్యధిక వాటా ఆవులు, గేదెలు నెమరు వేసేటప్పుడు వెలువడే మీథేన్ ద్వారానే వస్తోంది. దీనితో పోలి్చతే కోళ్ల పెంపకం వల్ల వెలువడే ఉద్గారాల తీవ్రత చాలా తక్కువ కావటం పర్యావరణపరంగా కలిసివచ్చే అంశం. రాబోయే దశాబ్దాల్లో పెరుగుతున్న జనాభాకు తక్కువ వనరులతో చౌకైన జంతు ప్రోటీన్‌ను అందించటంలో కోళ్లు, పందులు, టర్కీ కోళ్లు, బాతులే కీలకంగా మారనున్నాయని ఎఫ్‌ఏఓ తేల్చిచెప్పింది.
67% వెజ్ ప్రొటీనే!
ప్రపంచ ప్రజలకు ఆహార ధాన్యాలు, పప్పుదినుసులు, సోయాబీన్స్, నూనెగింజలు, కూరగాయల ద్వారా 67% వెజ్ ప్రొటీన్ అందుతోంది. పాలు, మాంసం, గుడ్ల రూపంలో 33% జంతు ప్రోటీన్ సరఫరా అవుతోంది. ఈ జంతు ప్రోటీన్‌లో కోళ్లు/పక్షుల మాంసం, గుడ్ల ద్వారా 30%, పంటలతో పాటు ఆవులు, గేదెలు, మేకల రైతువారీ పెంపకం ద్వారా మరో 30%, పందుల పెంపకం ద్వారా 19%, బహిరంగ పచి్చక మైదానాల్లో మేత మేసే పశువుల ద్వారా మరో 12%, ఇతరత్రా 9% ప్రొటీన్ ఆహారం ఉత్పత్తి అవుతోంది.
– సాక్షి, స్పెషల్ డెస్క్


