యాచ‌కురాలి దాన‌గుణం.. రూ.లక్ష విరాళం! | Kakinada Beggar Turns Alms Into Donations | Sakshi
Sakshi News home page

యాచ‌కురాలి దాన‌గుణం.. రూ.లక్ష విరాళం!

Nov 24 2026 2:14 PM | Updated on Nov 24 2026 2:26 PM

Kakinada Beggar Turns Alms Into Donations

కాకినాడ: సాధారణంగా ఆలయాలకు వెళ్లే భక్తులు పూజలు, దర్శనాల అనంతరం బయట ఉన్న యాచకులకు ఎంతో కొంత డబ్బులు ఇస్తుంటారు. అలా వచ్చిన డబ్బుతో కొందరు తమ రోజువారీ అవసరాలు తీర్చుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారు. మరికొందరు కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటారు. కానీ కాకినాడ జిల్లా తునికి చెందిన గొర్లి నరసయ్యమ్మ మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించారు. భక్తులు భిక్షగా ఇచ్చిన సొమ్మును దైవ ప్రసాదంగా భావించి.. అదే డబ్బును తిరిగి ఆలయాల అభివృద్ధికి, ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. దీంతో ఆమె పట్టణంలో ఉదార స్వభావం కలిగిన దాతగా గుర్తింపు పొందారు.

మూడు దశాబ్దాలుగా యాచక వృత్తి
నరసయ్యమ్మ మూడు దశాబ్దాలకు పైగా యాచక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో తిరుపతి నుంచి తునికి వలస వచ్చిన ఆమె.. అప్పటి నుంచి ఆలయాల వద్దే ఉంటూ భక్తులు ఇచ్చే చిల్లర, నోట్లతో జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం గొల్లపారావు సెంటర్‌ సమీపంలోని శివాలయ ప్రాంగణంలో ఉంటున్నారు. ప్రతిరోజూ ఉదయం ఇతర యాచకులతో కలిసి భక్తుల నుంచి భిక్ష స్వీకరిస్తారు. అయితే వచ్చిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని ఆలయాల కోసం ప్రత్యేకంగా దాచుకుంటారు.

కలలో శివుడు కనిపించడంతో..
ఒకరోజు కలలో శివుడు కనిపించి తనకు ఆశ్రయం కల్పించిన ఆలయాలకు సాయం చేయాలని సూచించినట్లు నరసయ్యమ్మ చెబుతున్నారు. అప్పటి నుంచి భక్తులు ఇచ్చే ప్రతి రూపాయిని పవిత్రమైనదిగా భావించి ఆలయ సేవకు వినియోగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటివరకు పలు ఆలయాలకు విరాళాలు అందించారు. శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవికి ఒక జత బంగారు కళ్లు సమర్పించారు. మరో మూడు ఆలయాలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నగదు విరాళాలు ఇచ్చారు.

దారాలమ్మ ఆలయానికి రూ.లక్ష విరాళం
తునిలోని దారాలమ్మ ఆలయంలో భారీ త్రిశూలం తయారీ కోసం రూ.లక్ష విరాళంగా అందించారు. నరసయ్యమ్మ సేవాభావాన్ని ఆలయ అధ్యక్షుడు తిరుమలశెట్టి సత్తిబాబు అభినందించారు. యాచకురాలిగా జీవనం సాగిస్తోందని కొందరు ఆమెను చిన్నచూపు చూస్తుంటారని.. ఆమె మనసులోని ఉదారత తెలిస్తే అలాంటి వారే చేతులెత్తి నమస్కరిస్తారని పేర్కొన్నారు.

ఆలయ కార్యదర్శి పల్లెల నాగేేశ్వరరావు మాట్లాడుతూ.. భిక్షాటన ద్వారా జీవనం సాగిస్తున్నప్పటికీ, అలా వచ్చిన సొమ్మును ఆధ్యాత్మిక సేవకు వినియోగించడం గొప్ప విషయమన్నారు. తమ కనీస అవసరాలు తీర్చుకున్న తర్వాత మిగిలిన డబ్బును ఇతరుల ప్రయోజనాలకు ఉపయోగించాలన్న ఆమె ఆలోచన అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ ఏడాది రూ.50 వేల విరాళం
గతేడాది అన్నదాన కార్యక్రమం కోసం నాలుగు బస్తాల బియ్యం అందించారు. ఈ ఏడాది ఇప్పటికే ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.50 వేలు విరాళంగా ఇచ్చారు. ఇన్ని విరాళాలు అందించినప్పటికీ ఆమె జీవన విధానంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ ఇతర యాచకులతో కలిసి భిక్షాటన చేస్తూ.. రోజూ వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని ఆలయాల కోసం పొదుపు చేస్తున్నారు.

భక్తులు ఇచ్చే భిక్షే ఆమెకు ఏకైక ఆదాయ వనరు. అయినప్పటికీ అందులో నుంచి ఆలయాలకు విరాళాలు అందిస్తూ నరసయ్యమ్మ చూపిస్తున్న సేవాభావం స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది. భక్తికి, దాతృత్వానికి ఆస్తిపాస్తులతో సంబంధం లేదని.. ఇవ్వాలనే మంచి మనసే అసలైన సంపద అని ఆమె తన చేతలతో చాటిచెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement