పంచాయతీ ఎన్నికల్లోనూ పత్తా లేని ఎమ్మెల్యే | Tiruvuru MLA Kolikapudi Srinivasa Rao Disappears From Constituency After Municipal Election Dispute | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికల్లోనూ పత్తా లేని ఎమ్మెల్యే

Nov 24 2026 2:02 PM | Updated on Nov 24 2026 2:12 PM

Tiruvuru MLA Kolikapudi Srinivasa Rao Disappears From Constituency After Municipal Election Dispute

విజయవాడ: తిరువూరు పురపాలక సంఘ ఎన్నికల్లో కూటమి నిర్ణయాన్ని ధిక్కరించి చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్‌ పదవులకు తన ప్యానల్‌ను నిలపడానికి విఫలయత్నం చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గత రెండు నెలలుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు.  తిరువూరు మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని కూటమి ఒప్పందం మేరకు జనసేనకు కేటాయించగా, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మద్దతుతో పెనుమల్లి శ్రావణి పోటీకి దిగారు.  అధిష్టానం పసుపులేటి మాధవికి ఈ సీటు కేటాయించడంతో పాటు ఎమ్మెల్యే వర్గీయులైన అభ్యర్థులెవరికీ కౌన్సిలర్‌ పదవులలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో ఆయన కినుక వహించారు.

అధిష్టానంపై అలిగిన ఎమ్మెల్యే పురపాలక సంఘ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం, ఫలితాలు వెల్లడయ్యాక కూడా తిరువూరు రాకపోవడంతో పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తిరువూరులో సోమవారం జరిగిన మున్సిపల్‌ కౌన్సిలర్ల అభినందన సభకు కూడా ఎమ్మెల్యే రాలేదు. మధ్యలో ఒక్కసారి మాత్రం ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన హైదరాబాదులో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పురపాలక సంఘ కౌన్సిల్‌ ప్రమాణ స్వీకారంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొనకపోవడం పారీ్టలో, నియోజకవర్గ ప్రజల్లో చర్చనీయాంశమైంది.   

అభివృద్ధి పనుల ఊసే లేదు 
ఎమ్మెల్యే మున్సిపల్‌ ఎన్నికలకు ముందు తిరువూరు పట్టణ ప్రజలకిచ్చిన పలు హామీలను కూటమి నేతలు పట్టించుకోవట్లేదు.  ఫ్యాక్టరీ సెంటర్‌ నుంచి మధిర రోడ్డు భగత్‌సింగ్‌ కాలనీ వరకు ఆర్‌ అండ్‌ బీ రహదారిని రూ.14కోట్లతో అభివృద్ధి చేయడంతో పాటు సెంట్రల్‌ లైటింగ్, డివైడర్‌ ఏర్పాటు చేస్తామని, డ్రయినేజీలు నిర్మిస్తామని ఎమ్మెల్యే మున్సిపల్‌ ఎన్నికలకు ముందు ప్రకటించారు.  ఈ పనులకు ఆయనే శంకుస్థాపన కూడా చేశారు. కృష్ణానది నుంచి తిరువూరుకు తాగునీరు సరఫరాకు రూ.240 కోట్లు ఏఐబీ నిధులు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే స్థానిక ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన రెండు సంవత్సరాల అభివృద్ధి నివేదికలో పేర్కొన్నారు. కానీ ఇంతవరకు పనులు మొదలుకాకపోవడంపై ఎమ్మెల్యే, కూటమి నేతలు నోరు మెదపట్లేదని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల్లోనూ పత్తా లేని ఎమ్మెల్యే 
తిరువూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలను కూడా ఎమ్మెల్యే కొలికపూడి పట్టించుకోవట్లేదు. అంతా తానై ఎంపీ కేశినేని చిన్ని తిరువూరు నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక నిర్వహిస్తున్నారు.  నామినేషన్ల దాఖలుకు సోమవారంతో గడువు పూర్తయినప్పటికీ ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగిపోయింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement