పిల్లల లోకంలోకి రండి | Childrens Day Special Story on Childrens world | Sakshi
Sakshi News home page

పిల్లల లోకంలోకి రండి

Nov 14 2026 1:07 AM | Updated on Nov 14 2026 1:07 AM

Childrens Day Special Story on Childrens world

పిల్లలకు ఒక ప్రపంచం ఉంటుంది. 
పిల్లలకంటూ ఒక లోకం ఉంటుంది.

ఆ లోకంలో పరీక్షలు ఉండవు. మార్కులు ఉండవు. ర్యాంకులు ఉండవు. అక్కడ చిన్న రాయే గుడి. కాగితపు పడవే ఓడ. గోళీలే బంగారం. స్నేహితుడి భుజమే పెద్ద ఆస్తి. ఆ లోకంలో ఆకాశం చాలా దగ్గరగా ఉంటుంది. కలలు చాలా పెద్దగా ఉంటాయి. ఏడ్చిన ఐదు నిమిషాలకే మళ్లీ నవ్వేసే మాయ ఆ లోకంలోనే ఉంటుంది.

గతంలో ఆ లోకం ఎంత బాగుండేది! వీధి మొత్తం ఆటస్థలం. సాయంత్రం అయితే ఇంటి ముందు కేరింతలు. అమ్మమ్మ ఒడిలో వినే కథలు. వర్షం వస్తే నింగికి వెక్కిరింతలు. ఎండాకాలం వస్తే మామిడి కాయలు, వేసవి సెలవులు. పిల్లలు పిల్లల్లా బతికేవారు. పసితనపు 

దుప్పటిలో వెచ్చగా ఉండేవారు.
పెద్దలు పిల్లల పక్షం వహించేవారు. పిల్లలు తప్పు చేస్తే తిట్టేవారు... కానీ భయపెట్టేవారు కాదు. ఓడి పోతే ఓదార్చేవారు, అవమానించేవారు కాదు. వారు కింద పడితే లేపి వీపు తట్టడానికి ఇరుగింటి పొరుగింటి బాబాయ్, పిన్ని ఉండేవారు.
మరి ఇప్పుడు పిల్లల లోకం ఎలా ఉంది? చిన్న ఫ్లాట్‌లోకి, చిన్న స్క్రీన్‌లోకి కుంచించుకు పోయింది. ఉదయం 7 గంటలకే వీపున పడే బ్యాగ్‌ రాత్రి 10 గంటల వరకు వదలదు. ఆట లేదు. నిద్ర లేదు. స్నేహితులు లేరు. ఉన్నదల్లా మొబైల్, ట్యూషన్, మార్కుల భయం. 

పిల్లలు నవ్వడం మర్చి పోయారు. ప్రశ్న అడగడం మర్చి పోయారు. ఏడుపును కూడా దాచుకోవడం నేర్చుకున్నారు. పిల్లాడు ఇప్పుడు పిల్లాడు కాదు. చిన్న పెద్దమనిషి. ఈ పిల్లల ప్రపంచాన్ని పాడు చేసింది ఎవరు? మనమే.
మార్కులు రాక పోతే పిల్లాడు పనికిరాడని నమ్మిన తల్లిదండ్రులం మనమే. ఆటస్థలాలు అమ్మేసి అపార్ట్‌మెంట్లు కట్టిన సమాజం మనదే. బడిని జైలులా, పరీక్షను యుద్ధంలా మార్చిన వ్యవస్థ మనదే. పిల్లల చేతికి ఆట వస్తువు బదులు ఫోన్‌ ఇచ్చిన వాళ్ళం మనమే.

మరి దీనిని బాగు చేయాల్సింది ఎవరు? మనమే. చాలా పెద్ద పనులు అక్కర్లేదు. పిల్లాడు ఆడాలంటే ఆడనివ్వండి. ప్రశ్న అడిగితే విసుక్కోకుండా జవాబు చెప్పండి. మార్కులు తక్కువ వస్తే తిట్టకుండా దగ్గరకు తీసుకోండి. రోజుకు ఒక్క గంటైనా ఫోన్‌ లేకుండా వాడితో కలిసి కూర్చోండి. బడిలో ఆటకు ఒక పీరియడ్‌ ఇవ్వండి. వాడి తప్పును క్షమించండి, వాడి కలను నమ్మండి.

‘బాలల దినోత్సవం’ సందర్భంగా ఒక్కసారి మనం మన పిల్లల ప్రపంచంలోకి వెళ్దాం. వాళ్ళతో పాటు కింద కూర్చుందాం. వాళ్ళ కళ్లతో ఈ లోకాన్ని చూద్దాం. అప్పుడు తెలుస్తుంది, మనం వాళ్లకు ఏం  పోగొట్టామో. పిల్లల ప్రపంచం ఇంకా చావలేదు. అది మన కోసం ఎదురు చూస్తోంది. రండి, ఆ ప్రపంచంలోకి వెళ్దాం. పిల్లలకు తోడు పెద్దలు కలిస్తే అక్కడ మళ్ళీ నవ్వులు పూస్తాయి. మళ్ళీ కలలు మొలుస్తాయి. మళ్ళీ పిల్లలు పిల్లల్లా బతుకుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement