41 ఏళ్ల ఏడబాటు తరువాత ఏకమైన తల్లీబిడ్డలు!  | Chilean mother reunites with two children stolen during dictatorship | Sakshi
Sakshi News home page

41 ఏళ్ల ఏడబాటు తరువాత ఏకమైన తల్లీబిడ్డలు! 

Nov 13 2026 3:42 AM | Updated on Nov 13 2026 3:42 AM

Chilean mother reunites with two children stolen during dictatorship

చిలీ రాజధాని శాంటియాగోలో ఘటన 

నియంతృత్వ పాలనలో బిడ్డల వ్యాపారం 

అక్రమంగా అమెరికా దంపతులకు దత్తత 

ఒక బిడ్డ డీఎన్‌ఏ పరీక్షతో వెతుకులాట మొదలు 

ఎట్టకేలకు ఒక్కటైన తల్లి, పిల్లలు

 

శాంటియాగో: బిడ్డను కోల్పోవడమంత విషాదం ఇంకోటి ఉండదు. చావు రూపంలో కాకుండా.. బిడ్డలను బలవంతంగా దూరం చేస్తే.. అమ్మేస్తే....??? అది మరింత లోతైన గాయాన్ని మిగులుస్తుంది. టెరెసిటా డి జీసస్‌ పాడిల్లా ఈ కష్టాన్ని ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 41 ఏళ్లు అనుభవించింది. ఎట్టకేలకు ఆధునిక సాంకేతికత పుణ్యమా అని తల్లీ ఇద్దరు బిడ్డలు మళ్లీ ఒకరిని కలుసుకోగలిగారు. 

ఆ క్షణం వారి మనసుల్లో నిండిన ఆనందం అంత ఇంత కాదు.. దక్షిణ అమెరికా దేశం చిలీ రాజధానిలో సాకారమైన ఈ దృశ్యాన్ని చూసిన కన్ను చెమర్చకుండా ఉండలేదంటే అతిశయోక్తి కాదు 1973–1990 మధ్యకాలం చిలీలో చీకటి యుగమని చెప్పాలి. జనరల్‌ అగస్టో పినోచెట్‌ నియంతృత్వం నడుస్తోంది అప్పుడు. వేలాది మంది తల్లులకు కడుపు కోట మిగిల్చిన కాలమూ ఇదే. 

ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, న్యాయవాదులు కూడా కుమ్మక్కై వేలాది మంది పసిపిల్లలను కిడ్నాప్‌ చేసి విదేశాల్లో ఉన్న వారికి దత్తతకు వచ్చే దందా నడుస్తూండేది. ఈ ముఠా బారిన పడ్డ వారిలో టెరెసిటా డి జీసస్‌ పడిల్లా (66) కూడా ఒకరు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి పేదరికంలో మగ్గిన ఆమె, గర్భవతిగా ఉండగా ఆసుపత్రికి వెళ్లడం ఆమె పాలిట శాపమైంది. అక్కడి సిబ్బంది ఆమెను బెదిరించి, భయపెట్టి ఒకసారి కాదు.. రెండుసార్లు బిడ్డలను బలవంతంగా లాక్కున్నారు. ‘‘శాశ్వతంగా కోల్పోయాననుకున్న నా బిడ్డలను దేవుడు నాకు తిరిగి ఇచ్చాడు’’అంటూ తన కుమారులు టిమ్‌ రోల్నిక్‌ (41), ట్రావిస్‌ ముర్డోక్‌ (37)లను హత్తుకుని టెరెసిటా భావోద్వేగానికి లోనయ్యారు. 

డీఎన్‌ఏ పరీక్షతో మారిన కథ... 
అమెరికాలో పెరిగిన టిమ్, ట్రావిస్‌లకు తమను దత్తతకు తీసుకున్నారని తెలుసు కానీ.. జన్మనిచ్చిన తల్లి ఎవరో స్పష్టంగా తెలియదు. ఇంతటి విషాద చరిత్ర ఉందని తెలియదు. 2020లో టిమ్‌ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ’మై హెరిటేజ్‌’ ద్వారా డీఎన్‌ఏ పరీక్ష చేయించుకున్నాడు. ఆ ఒక్క పరీక్ష అతని జీవితాన్ని మార్చేసింది. చిలీలో తన కోసం ఒక కుటుంబం ఎదురు చూస్తోందని, ప్రస్తుతం తానున్న ఇంటికి దగ్గరలోనే సొంత తమ్ముళ్లు (కవలలు ట్రావిస్, క్రిస్‌) కూడా ఉన్నారని టిమ్‌ తెలుసుకున్నాడు. అక్రమంగా దత్తత తీసుకున్న వారి కోసం పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో అన్నదమ్ములు ముగ్గురూ కలుసుకోగలిగారు.

 ‘‘ఒక తమ్ముడు ఉంటే బాగుండును అని చాలాసార్లు అనుకున్నా. కానీ.. ముగ్గురు (కవలలు ఇద్దరు, చిలీలో ఒకరు) దొరికారు!‘ అంటూ టిమ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. కవలల్లో ఒకరైన క్రిస్‌ 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దూర ప్రయాణాలు చేసే స్థితిలో లేకపోవడంతో టిమ్, ట్రావిస్‌లు తల్లిను కలుసుకునేందుకు చిలీ వెళ్లారు. ‘‘ఆమెను చూడగానే బాగా తెలిసిన మనిషిలానే అనిపించింది’’అని టిమ్‌ అన్నాడు. చిలీ న్యాయస్థానాల నివేదికల ప్రకారం పినోచెట్‌ పాలనలో దాదాపు 20,000 మంది పిల్లలు ఇలా అక్రమంగా దత్తతకు వెళ్లారు. దీనివల్ల 50,000కుపైగా కుటుంబాలు నష్టపోయాయని ’నోస్‌ బుస్కామోస్‌’ అనే స్వచ్ఛంద సంస్థ అంచనా.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement