అమెరికా ఏం తింటోంది? | Fast Food to Real Food: America Nutrition Policy Details | Sakshi
Sakshi News home page

అమెరికా ఏం తింటోంది?

Nov 12 2026 7:17 PM | Updated on Nov 12 2026 7:27 PM

Fast Food to Real Food: America Nutrition Policy Details

ఫుడ్‌ పిరమిడ్‌ను తలకిందులు చేసి.. ‘ఫాస్ట్‌ ఫుడ్‌’ నుంచి ‘రియల్‌ ఫుడ్‌’  వైపు అగ్రరాజ్యం ప్రస్థానం

అల్ట్రా–ప్రాసెస్డ్‌ ఫుడ్స్, పత్తి గింజల నూనెలతో తయారయ్యే మార్జరిన్‌ (వనస్పతి) వల్లే అమెరికన్లకు జీవక్రియ వ్యాధులొస్తున్నాయంటున్న యూఎస్‌ ప్రభుత్వం

హానికరమైన ఆహారం వల్ల అమెరికా పోలీసుల ఆయుర్దాయం 22 ఏళ్లు తక్కువని ప్రజారోగ్య శాఖ నిర్ధారణ

ప్రతి పూట ఆహారంలోనూ నాణ్యమైన సహజ ప్రొటీన్లు తప్పనిసరి అంటున్న కొత్త ఆహార మార్గదర్శకాలు

దశాబ్దాలుగా పిండి పదార్థాల (కార్బోహైడ్రేట్లు) పునాదిపై నడిచిన పాత ఆహార పిరమిడ్‌ను అమెరికా ప్రభుత్వం తలకిందులు చేసి మార్గదర్శకాలను సమూలంగా మార్చివేసింది. ప్రాసెస్‌ చేసిన తినుబండారాలు, కృత్రిమ నూనెలు, అధిక చక్కెరల స్థానంలో సహజ సిద్ధమైన పౌష్టికాహారాన్ని (రియల్‌ ఫుడ్‌) అమెరికన్ల ప్లేట్లలోకి తీసుకురావటమే లక్ష్యంగా కొత్త విధానానికి రూపకల్పన జరిగింది.

కొత్త మార్గదర్శకాలు ఏమిటి?
గతంలో రొట్టెలు, ధాన్యాలను పిరమిడ్‌ పునాదిగా చూపి, కొవ్వులను పూర్తిగా పక్కన పెట్టేవారు. అయితే, నూతన మార్గదర్శకాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ప్రతి పూట ఆహారంలో నాణ్యమైన సహజ ప్రొటీన్లు తప్పనిసరిగా ఉండాలని నిర్దేశించాయి. శరీర బరువును బట్టి రోజువారీ ప్రొటీన్‌ వినియోగాన్ని గణనీయంగా పెంచారు. అంతేకాకుండా, కొవ్వు రహిత (స్కిమ్డ్‌) పాల ఉత్పత్తుల స్థానంలో సహజ కొవ్వులు కలిగిన వెన్న, పెరుగు, చీజ్, సహజ కొవ్వులను (టాలో, నెయ్యి), గుడ్లను ఆహారంలో చేర్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఇంజిన్‌ ఆయిల్‌గా వాడే పత్తి గింజల నూనెలతో మార్జరిన్‌ (వనస్పతి) తయారుచేసి వెన్న కంటే మంచిదని అబద్ధపు ప్రచారం చేశారని, ఫలితంగానే అమెరికాలో జీవక్రియ రోగాలు, ఊబకాయం పెరిగాయని గుర్తించి ఆ విధానాలకు స్వస్తి పలికామని అమెరికా ఆరోగ్య శాఖ (హెచ్‌హెచ్‌ఎస్‌) మంత్రి రాబర్ట్‌ ఎఫ్‌. కెన్నెడీ జూనియర్‌ ప్రకటించారు.

క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరు
అమెరికా సరికొత్త ఆహార మార్గదర్శకాలు కాగితాలకే పరిమితం కాకుండా పాఠశాలల మధ్యాహ్న భోజన పథకాలు, సైనిక మెస్‌లు, ఫెడరల్‌ ఆహార సహాయ కార్యక్రమాల్లో అమలవుతున్నాయి. అల్ట్రా–ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌పై ఆంక్షలు విధిస్తూ, స్థానికంగా లభించే వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలు, సహజ మాంసం వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఫుడ్‌ లేబుళ్లపై రసాయనాలు, సీడ్‌ ఆయిల్స్‌ వాడకాన్ని తగ్గించేలా కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నారు.

ఆహార దినోత్సవం వేళ ఆరోగ్య మంత్రి వినూత్న ప్రచారం
ఈ ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అమెరికా ఆరోగ్య శాఖ (హెచ్‌హెచ్‌ఎస్‌) మంత్రి రాబర్ట్‌ ఎఫ్‌. కెన్నెడీ జూనియర్‌ ప్రజల్లోకి నేరుగా వెళ్లేందుకు ‘ది రియల్‌ ఫుడ్‌ షో’ పేరుతో వినూత్న వంటల ప్రచారాన్ని చేపట్టారు. తెరపై ‘సూపర్‌మ్యాన్‌’గా నటించిన డీన్‌ కెయిన్, ప్రఖ్యాత అమెరికన్‌ బాడీబిల్డర్, హాలీవుడ్‌ నటుడు లూ ఫెర్రిగ్నోలతో కలిసి స్వయంగా వంట చేసి చూపించారు. అత్యవసర సేవల్లో ఉంటూ నిరంతర ఒత్తిడి, రాత్రి డ్యూటీల వల్ల 22 ఏళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోతున్న పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. 

ఆ వీడియోని మంత్రి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఖరీదైన మాంసాలు కాకుండా తక్కువ ధరకు లభించే మాంసం ముక్కలతో కూడా అత్యవసర అమైనో ఆమ్లాలు అందించే పౌష్టికాహారాన్ని తయారు చేసుకోవచ్చని చాటారు. నాన్‌–స్టిక్‌ పాత్రలను వీడి ఇనుప పెనాలు వాడటం, సీడ్‌ ఆయిల్స్‌కు బదులు సహజ కొవ్వులతో ఇళ్లలో వంట చేసుకొని తినటమే అమెరికాకు అసలైన రక్షణ అని కెన్నెడీ జూనియర్‌ చాటి చెప్పారు.

పాత పిరమిడ్‌ వర్సెస్‌ కొత్త ఆహార సూత్రాలు!
అమెరికా ఆహార మార్గదర్శకాల్లో గతంలో ధాన్యాలను ఎక్కువగా తినమని నిర్దేశించారు. కొత్త ఆహార మార్గదర్శకాల్లో వాటిని బాగా తగ్గించేశారు. కొత్త ఫుడ్‌ పిరమిడ్‌కు సహజ ప్రొటీన్లు (గుడ్లు, మాంసం, పప్పుధాన్యాలు) కేంద్ర బిందువయ్యాయి.

పత్తి గింజల నూనెతో చేసిన మార్జరిన్, విత్తనాల నుంచి తీసిన రిఫైన్డ్‌ వంట నూనెలను తిరస్కరించి.. వెన్న, ఆలివ్‌ నూనె, బీఫ్‌ టాలో, కొవ్వుతో కూడిన పాల ఉత్పత్తులను చేర్చారు.

ఇదీ చ‌ద‌వండి: మాంసం తినండి.. పర్యావరణాన్ని కాపాడండి

ప్యాకేజ్డ్‌ ఆహారాలు, అధిక ఫ్రక్టోజ్‌ కార్న్‌ సిరప్, శుద్ధి చేసిన నూనెల వాడకాన్ని తగ్గించటం తప్పనిసరి చేశారు.
రిఫైన్డ్‌ పిండి పదార్థాలను బాగా తగ్గించి, కేవలం ముడి ధాన్యాలకే పరిమితంగా స్థానం కల్పించారు.

ఆరోగ్య సంక్షోభంలో పోలీసులు
సాధారణ అమెరికా పౌరులతో పోలిస్తే విధి నిర్వహణలో ఉండే పోలీసుల సగటు ఆయుర్దాయం 22 ఏళ్లు తక్కువ.

పోలీసులు విధుల్లో ప్రాణాలు కోల్పోవటం కంటే, సాధారణ పౌరులతో పోలిస్తే, గుండెపోటు బారిన పడే ముప్పు 25 రెట్లు అధికంగా ఉంది.
రాత్రి డ్యూటీల్లో రోడ్లపై దొరికే జంక్‌ ఫుడ్‌ తినకుండా, ముందు రోజే ఇంట్లో నాణ్యమైన ఆహారాన్ని వండుకొని వెంట తీసుకెళ్లాలని లూ ఫెర్రిగ్నో సూచన.

ఇదీ చ‌ద‌వండి: మైండ్‌ మేనేజ్‌మెంట్‌ మొదలెట్టండి

ఎక్కువ ఖర్చు లేకుండానే తక్కువ బడ్జెట్‌లో కుటుంబం మొత్తానికి అవసరమైన సమతుల్య పోషకాలు కొత్త ఆహార మార్గదర్శకాల ద్వారా పొందవచ్చని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. 
సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement