అమెరికాలో ఏడాదికి రూ. 1 కోటి సంపాదిస్తున్న భారతీయ మహిళ, ఇప్పటికీ తాను మధ్యతరగతి (మిడిల్ క్లాస్) వ్యక్తినే అంటూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన నెలవారీ ఖర్చుల వివరాలు, ఇండియాతో పోల్చిన తీరు ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసింది. పదండి అదేంటో మనం కూడా చూసేద్దాం.
అమెరికాలో ఉంటున్న నితిన్ మల్హోత్రా అనే భారతీయుడు తన సోదరి మహిమ రాఠీతో కలిసి ఉన్న ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోను షేర్ చేయడంతో ఈ చర్చ మొదలైంది. మహిమ తన నెలవారీ సంపాదన ,ఖర్చుల గురించి మాట్లాడుతూ, అమెరికాలో పైకి భారీగా కనిపించే జీతం,నిజానికి అంత గొప్పదేమీ కాదని, పన్నులు, హౌసింగ్ లోన్, బీమా, రోజువారీ ఖర్చులకే తన నెలవారీ ఆదాయంలో ఎక్కువ భాగం ఖర్చయిపోతోందని, చివరకు చాలా తక్కువ మాత్రమే మిగులుతోందని ఆమె వివరించారు.
మహిమ తనకు ప్రతి నెలా 8,000 డాలర్లు (సుమారు రూ. 7.5 లక్షలు) జీతం వస్తుంది. అయితే, అందులో సింహభాగం అత్యవసర ఖర్చులకే సరిపోతోంది. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రతి నెలా సుమారు 1,500 డాలర్లు (సుమారు రూ. 1.4 లక్షలు) పన్నుల రూపంలో చెల్లిస్తుండగా, మరో 2,500 డాలర్లు (సుమారు రూ. 2.34 లక్షలు) ఇంటి తనఖా (మోర్ట్‌గేజ్) చెల్లింపులకే ఖర్చవుతున్నాయి
మిగతా ఖర్చులు
ఆహార ఖర్చులు: 1,000 డాలర్లు (దాదాపు రూ. 94,000)
వైద్య బీమా (Medical Insurance): 500 డాలర్లు (దాదాపు రూ. 47,000)
కారు బీమా , పెట్రోలు: 500 డాలర్లు (దాదాపు రూ. 47,000)
ఫోన్, ఇంటర్నెట్ , ఇంటి బిల్లులు: 500 డాలర్లు (దాదాపు రూ. 47,000)
పిల్లల ఖర్చులు: 300 డాలర్లు (దాదాపు రూ. 28,000)
ఇతర ఖర్చులు: 200 డాలర్లు (దాదాపు రూ. 19,000)
ఈ ఖర్చులన్నీ పోగా, తన వద్ద ప్రతి నెలా సుమారు 1,000 డాలర్లు (దాదాపు రూ. 94,000) మాత్రమే మిగులుతున్నాయని మహిమ చెప్పారు. పైగా, ఈ లెక్కల్లో తన వ్యక్తిగత ఖర్చులను కలపలేదని కూడా ఆమె స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : విషాదం : తెల్లవారితే పెళ్లి..తిరిగిరాని లోకాలకు టెకీ!
సేవింగ్స్ - పోలిక
అమెరికాలోని తన ఆర్థిక పరిస్థితిని గతంలో భారత్‌లో ఉన్నప్పటి జీవితంతో మహిమ పోల్చారు. భారత్‌లో ఉన్నప్పుడు తాను ఏడాదికి రూ. 15 లక్షలు సంపాదించేదానినని, అయినప్పటికీ తన ఆదాయంలో ఎక్కువ భాగం పొదుపు చేయగలిగానని ఆమె వెల్లడించారు. రెండు దేశాల మధ్య కాస్ట్ ఆఫ్ లివింగ్ , కొనుగోలు శక్తిలో ఉన్న వ్యత్యాసాలపై ఆమెవ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
నెటిజన్లు ఏమన్నారంటే
అమెరికా మెరుగైన మౌలిక సదుపాయాలు, పరిశుభ్ర వాతావరణం, నాణ్యమైన జీవనశైలిని అందిస్తుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడగా, మరికొందరు ఎక్కువ జీతం ఉన్నంత మాత్రాన ఆర్థిక భద్రత ఉంటుందా అని ప్రశ్నించారు. "మా పరిస్థితి కూడా అంతే. మా ఇంట్లో ఇద్దరం సంపాదిస్తున్నా, విపరీతమైన ఖర్చుల వల్ల ఏమీ పొదుపు చేయలేకపోతున్నాము" అని మరొకరు కామెంట్ చేశారు. మరొకరు, "మీకు సొంత ఇల్లు, కారు ఉన్నాయి. స్వచ్ఛమైన గాలి, నీరు, శుభ్రమైన పార్కులు, ఫుట్‌పాత్‌లు అందుబాటులో ఉన్నాయి. పిల్లల సంరక్షణ, ప్రసూతి ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని అవసరాలకు, కోరికలకు ఖర్చు చేయ గలుగుతున్నారు, తక్కువ ధరకే మంచి బ్రాండ్లు కొనగలుగుతున్నారు. అమెరికాలో మధ్యతరగతి జీవితం అంటే ఇదే" అని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: 15 ఏళ్ల కొడుక్కి, రూ. 1.6 కోట్ల కారు గిప్ట్ : ఎందుకో తెలుసా


