సాక్షి, హైదరాబాద్: అమెరికాలో కనిపించకుండాపోయిన నల్లగొండ యువతి కోయ శ్రీజ (23) ఆచూకీ కనుగొనేందుకు తెలంగాణ రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అమెరికాలోని సంబంధిత అధికారులు, ప్రవాస తెలుగువారితో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరగా శ్రీజ ఆచూకీ కనుగొనాలని ఈ-మెయిల్ ద్వారా బోస్టన్ కాన్సులేట్ జనరల్, కేంద్ర విదేశాంగ శాఖ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఆయన కోరారు. శ్రీజ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని.. ఆమె ఆచూకీ త్వరగా కనుక్కోవాలని బోస్టన్ కాన్సులేట్ జనరల్‌కు విజ్ఞప్తి చేశారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) బోస్టన్ ప్రతినిధి కృష్ణప్రసాద్‌తో ఫోన్‌లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. స్థానిక పోలీసుల సహాయంతో శ్రీజ ఆచూకీ కనుగొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కోమటిరెడ్డికి కృష్ణప్రసాద్ వివరించారు. శ్రీజ ఆచూకీ ప్రయత్నాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, తమ కూతురు క్షేమంగా తిరిగి రావాలని శ్రీజ తల్లిదండ్రులు కోయ యాదగిరిరెడ్డి, రూప కోరుకుంటున్నారు.
నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురం శ్రీజ సొంతూరు. బోస్టన్‌లోని డోర్చెస్టర్ ప్రాంతంలో నివాసముంటున్న ఆమె నవంబర్ 2న అదృశ్యమయ్యారు. ఎడిసన్ గ్రీన్ సమీపంలో చివరిసారిగా ఆమె కనిపించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఇప్పటికీ వరకు ఆమె ఆచూకీ లభ్యంకాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. శ్రీజ జాడ కనిపెట్టేందుకు బోస్టన్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అమెరికాలో నల్లగొండ విద్యార్థిని అదృశ్యం


