నల్లగొండ : మధ్యలోనే చదువు మానేసిన విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో బాలల సంరక్షణ, సాధికారతపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల కార్మికులు, బాల్య వివాహాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల కారణంగా విద్యకు దూరమైన పిల్లలను గుర్తించి వారికి విద్యను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రమాదకర వృత్తుల్లో పనిచేస్తున్న పిల్లలు, ఇటుక బట్టీల్లో కార్మికులుగా ఉన్న బాలలను గుర్తించి వారికి రక్షణ, పునరావాసం, విద్యతోపాటు అవసరమైన సహాయాన్ని అందించాలని పేర్కొన్నారు. చదువుతోపాటు క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలపై ఆసక్తి ఉన్న పిల్లలను ఆయా రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ బాలల భద్రత, భవిష్యత్ విషయంలో ప్రతి శాఖ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధి ఫిలిప్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్ రెడ్డి, అదనపు ఎస్పీ రమేష్, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లావణ్య, డీఈఓ సుశీందర్‌రావు, డీఐఈఓ దస్రూనాయక్, డీపీఓ తరుణ్‌చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


